అయోధ్య విమానాశ్రయం, రైల్వే స్టేషన్​ ప్రారంభించిన మోదీ

రామ మందిర ప్రారంభోత్సవానికి శరవేగంగా ముస్తాబవుతున్న  ఆయోధ్యలో శనివారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొత్తగా నిర్మించిన మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయంతో పాటు అయోధ్య ధామ్​ జంక్షన్​ రైల్వే స్టేషన్​లను ప్రారంభించారు.  యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​ మోదీకి స్వగతం పలికిన అనంతరం రోడ్డు మార్గంలో ప్రధాని ర్యాలీ నిర్వహించారు. అయోధ్యావాసులు ప్రధానికి ఘన స్వాగతం పలికారు.
సీఎం యోగీతో కలిసి అయోధ్య ధామ్​ జంక్షన్​ రైల్వే స్టేషన్​కు వెళ్లారు మోదీ. రైల్వే స్టేషన్​ని ప్రారంభించి 2 కొత్త అమృత్​ రైళ్లతో పాటు ఆరు వందే భారత్​ రైళ్లకు పచ్చజెండా ఊపారు ప్రధాని. అనంతరం ఓ రైలులో ఎక్కి, విద్యార్థులతో ముచ్చటించారు. శ్రీ మాతా వైష్ణో దేవి కత్రా – న్యూఢిల్లీ, అమృత్‌సర్ – న్యూఢిల్లీ, కోయంబత్తూరు-బెంగళూరు, మంగళూరు-మడ్‌గావ్, జల్నా-ముంబై, అయోధ్య-ఆనంద్ విహార్ టెర్మినల్‌తో పాటు అయోధ్య-దర్భంగా, మాల్దా టౌన్ మధ్య నడిచే 6 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రారంభించారు.

ఈ అయోధ్య రైల్వే స్టేషన్​ చాలా సాధారణంగా ఉండేది. కాగా రూ. 240 కోట్లు ఖర్చు చేసి 3 అంతస్తుల​ రైల్వే స్టేషన్​గా దీనిని అభివృద్ధి చెశారు. లిఫ్ట్​లు, ఎస్కలేటర్లు, వెయిటింగ్​ హాల్స్​, ఫుడ్​ ప్లాజాలను ఏర్పాటు చేశారు. ఇక అక్కడి నుంచి మహర్షి వాల్మీకి అంతర్జాతీయ విమానాశ్రయానికి వెళ్లి విమనాశ్రాయాన్ని ప్రారంభించారు.

ఈ ఎయిర్​పోర్ట్​ని రూ. 1,450 కోట్ల ఖర్చుతో రూపొందించారు. ఎయిర్​పోర్ట్​ టర్మినల్​ని 6,500 చదరపు మీటర్ల స్థంలో నిర్మించారు. సంవ‌త్స‌రానికి దాదాపు 10 ల‌క్ష‌ల మంది విమాన ప్ర‌యాణం చేసే విధంగా ఎయిర్‌పోర్టును నిర్మించారు.  ఇక విమానాశ్ర‌యంలో రామాయ‌ణ ఇతివృత్తం ద‌ర్శ‌న‌మిచ్చేలా పేయింటింగ్స్ వేశారు. వాల్మీకి రాసిని రామాయ‌ణం ఆధారంగా ఆ క‌ల‌ర్‌ఫుల్ మ్యూర‌ల్స్ వేశారు. రామయణం, రాముడి జీవితానికి సంబంధించిన అనేక దృశ్య కావ్యాలను విమానాశ్రయం గోడలపై ముద్రించారు.

విమానాశ్రయాన్ని ప్రధాని ప్రారంభించగానే ఢిల్లీ నుంచి అయోధ్య‌కు ఇవాళ మ‌ధ్యాహ్నం ఇండిగో విమానం బ‌య‌లుదేరింది. ఆ విమాన కెప్టెన్ అశుతోష్ శేఖ‌ర్ అయోధ్య ప్ర‌యాణికుల‌కు స్వాగతం చెప్పారు. జై శ్రీరామ్ అంటూ ప్ర‌యాణికులు నినాదాలు చేశారు. అయితే, అయోధ్య  విమానాశ్రయం కార్యకలాపాలు జనవరి 6న అధికారికంగా మొదలవుతాయి. ఢిల్లీ, ముంబై, కోల్​కతా, హైదరాబాద్​, బెంగళూరు, చెన్నై, అహ్మదాబాద్​ నుంచి ప్రతి రోజు విమాన సేవలు అందుబాటులో ఉండనున్నాయి. ఇక విమానాశ్రయ ప్రారంభోత్సవం తర్వాత రాష్ట్రంలో రూ. 15వేల కోట్లు విలువ చేసే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.

మహిళ ఇంట్లో టీ తాగిన మోదీ

 కాగా వీటి మధ్యలో ఓ ఆసక్తికర సంఘటన జరిగింది.  పీఎం ఉజ్వల పథకం లబ్దిదారుల్లో ఒకరైన మీరా అనే ఓ మహిళ ఇంటికి ప్రధాని మోదీ అకస్మాత్తుగా వెళ్లారు. మహిళ యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. ఆమె భర్త సూరజ్, పిల్లలతో మోదీ ముచ్చటించారు. పిల్లలతో మోదీ కాసేపు సరదాగా మాట్లాడారు. అనంతరం ఇంట్లో టీ తాగారు.

ఆ తర్వాత ప్రధాని వారి జీవన విధానం గురించి అడిగి తెలుసుకున్నారు. ఏం పని చేస్తారని ప్రశ్నించగా అయోధ్యలో తాను పూల వ్యాపారం చేస్తున్నట్టు మీరా తెలియేసింది. అది విన్న ప్రధాని మోదీ గుడి నిర్మాణంతో పూల వ్యాపారం మెరుగవుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు.  అనంతరం విమానాశ్రయానికి వెళుతున్న మార్గంలో లతా మంగేష్కర్​ చౌక్​ వద్ద ఆగారు ప్రధాని. అక్కడి నుంచి ప్రజలకు అభివాదం చేశారు.