
తెలంగాణ రాష్ట్రం మంచి చేనేత వస్త్రాలను అందిస్తోందని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కొనియాడారు. బుధవారం యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో చేనేత కార్మికులతో ఏర్పాటు చేసిన థీమ్ పెవిలియన్ కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొంటూ పోచంపల్లి, వరంగల్, సిరిసిల్ల వస్త్రాలకు ట్యాగ్ రావడం అభినందనీయమని చెప్పారు.
నేత పరిశ్రమతో గ్రామీణ ప్రాంతప్రజలకు మంచి ఉపాధి దొరుకుతోందని చెప్పారు. పోచంపల్లి చేనేత వస్త్రాలను చూస్తే తనకు చాలా సంతోషం కలిగిందని పేర్కొంటూ భారత సంస్కృతీ సాంప్రదాయాల్లో చేనేత ఒకటి అని ఆమె తెలిపారు. ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లు రూపొందించడం అభినందనీయమని పేర్కొన్నారు.
చేనేత రంగాన్ని ముందుకు తీసుకెళ్తున్న అవార్డు గ్రహీతలందరికీ రాష్ట్రపతి శుభాకాంక్షలు తెలిపారు. చేనేత కళ ఒకరి నుండి మరొకరికి వారసత్వంగా కొనసాగడం, గురు శిష్య బంధాన్ని ఏర్పరచడం అభినందనీయమని తెలిపారు. చేనేత రంగ అభివృద్ధి కోసం ప్రభుత్వం, అధికారులు మరింత చొరవ చూపాలని ఆమె కోరారు.
భూధాన్ పోచంపల్లిని ప్రపంచ గ్రామీణ పర్యాటక ప్రాంతంగా గుర్తించడం అభినందనీయమని పేర్కొన్నారు. చేనేత వస్త్రాల కృషి గొప్పదని, కళను వారసత్వంగా మరొకరికి అందించడం గొప్ప విషయమని ఆమె ప్రశంసించారు. చేనేత రంగాన్ని కాపాడుకునే విధంగా కృషి చేయాలని రాష్ట్రపతి సూచించారు.
చేనేత అభివృద్ధికి తన వంతుగా కృషి చేస్తానని ముర్ము హామీ ఇచ్చారు. తమ ప్రాంత ప్రజలను పోచంపల్లికి తీసుకువస్తానని రాష్ట్రపతి చెప్పారు. చేనేత ఇక్కత్ వస్త్రాల తయారీ, విక్రయాలపై ఆయా సంఘాలలతో ముఖాముఖిలో పాల్గొని మాట్లాడారు. చేనేత కార్మికులతో రాష్ట్రపతి స్వయంగా మాట్లాడారు.
కాగా, శీతాకాల విడిదిలో భాగంగా హైదరాబాద్‌కు వచ్చిన ఆమె బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో పోచంపల్లికి వెళ్లారు. ముందుగా పట్టణంలోని టూరిజం సెంటర్, ఆచార్య వినోబాబావే భవనానికి వెళ్లిన రాష్ట్రపతి భూదాన ఉద్యమకారులైన వినోబాబావే, వెదిరె రామచంద్రారెడ్డి విగ్రహాలకు నివాళులర్పించారు.
అనంతరం వినోబాబావే భవనంలో ఫొటో ఎగ్జిబిషన్‌ను సందర్శించారు. పోచంపల్లి టై అండ్ డై, ఇక్కత్ చీరెలను తయారీని పరిశీలించారు. రాష్ట్రపతి పోచంపల్లి పర్యటన సందర్భంగా రాష్ట్రపతికి మంత్రి సీతక్క, ప్రభుత్వ విప్ బిర్ల ఐలయ్య, భువనగిరి ఎమ్మెల్యే అనిల్ కుమార్ రెడ్డి, కేంద్ర మంత్రిత్వ శాఖ సెక్రటరీ రచన సాహు, మున్సిపల్ చైర్ పర్సన్ చిట్టి పోలు విజయలక్ష్మిలు ఘన స్వాగతం పలికారు.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత