
పాక్ ఆక్రమిత్ కశ్మీర్ ఎప్పటికీ భారత్‌లో అంతర్భాగమని.. ఆ ప్రాంతాన్ని ఏదో ఒక రోజు మనదేశంలో విలీనం చేస్తామని కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు. అందుకే పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం 24 అసెంబ్లీ స్థానాలను రిజర్వ్ చేస్తున్నట్టు ఆయన వెల్లడించారు. జమ్ము, కాశ్మీర్ రిజర్వేషన్ ( సవరణ) బిల్లు, జమ్మూ కశ్మీర్ రీ ఆర్గనైజేషన్ ( సవరణ) బిల్లులను లోక్‌సభలో ప్రవేశ పెట్టిన సందర్భంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా కీలక ప్రసంగం చేశారు.
జమ్ము కాశ్మీర్లో ఇప్పటి వరకు 83 అసెంబ్లీ స్థానాలు ఉండగా.. తాజాగా బిల్లులో 90 కు పెంచుతూ ప్రతి పాదించారు. మరో 24 స్థానాలను పాక్ ఆక్రమిత కశ్మీర్ కోసం రిజర్వ్ చేస్తున్నట్టు వెల్లడించారు. దీంతో జమ్ము కాశ్మీర్లో మొత్తం అసెంబ్లీ స్థానాల సంఖ్య 114కు పెరగనుంది. కశ్మీర్ డివిజన్లో అసెంబ్లీ స్థానాలు 46 నుంచి 47 కు పెరగనుండగా.. జమ్ము డివిజన్లో 37 నుంచి 43కు పెరుగుతాయని సభలో అమిత్ షా వివరించారు . అదే విధంగా కశ్మీర్ నుంచి వలస వెళ్లిన వారికి 2 స్థానాలు, పాక్ ఆక్రమిత కశ్మీర్ నుంచి వచ్చి స్థిరపడిన వారికి 1 స్థానాన్ని కేటాయించినట్టు చెప్పారు. తొలి సారిగా ఎస్సీ, ఎస్టీలకు మొత్తం 9 స్థానాలు కేటాయించినట్టు వెల్లడించారు.
ఇక.. జమ్ము కశ్మీర్ సమస్యకు ఆనాటి ప్రధాని నెహ్రూ చేసిన రెండు తప్పిదాలే ప్రధాన కారణమని అమిత్ షా ఆరోపించారు. మొత్తం కాశ్మీర్‌ను గెలుచు కోకుండా అర్ధాంతరంగా కాల్పుల విరమణ ప్రకటించటం, మన అంతర్గత సమస్యను అంతర్జాతీయ వేదిక అయిన ఐక్యరాజ్య సమితి దృష్టికి తీసుకు వెళ్ళటం ఘోరమైన తప్పిదాలుగా అమిత్ షా అభివర్ణించారు. మరో 3 రోజుల పాటు యుద్ధం కొనసాగించి ఉంటే ఆనాడు పాక్ ఆక్రమిత కశ్మీర్ మన సొంతం అయి ఉండేదని వ్యాఖ్యానించారు. నేటికీ కాశ్మీరీ ప్రజలు పడుతున్న ఇబ్బందులకు నెహ్రూ అనాలోచిత చర్యలే కారణమని విమర్శించారు. కాశ్మీర్ విషయంలో తాను పొరపాటు చేశానన్న విషయం నెహ్రూ ఆ తరువాత ప్రకటించారని.. కానీ, అప్పటికే ఆయన తప్పిదం వల్ల భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చిందని అమిత్ షా పేర్కొన్నారు. జమ్ము, కాశ్మీర్, లఢక్ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని విస్పష్టంగా ప్రకటించారు.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్