ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం

ఇండోనేషియాలో పేలిన అగ్నిపర్వతం

పశ్చిమ ఇండోనేషియాలోని సుమత్రా దీవిలో మౌంట్ మరపి అగ్నిపర్వతం పేలడంతో 11 మంది  పర్వతారోహకులు మరణించారు. మరో ముగ్గురిని సహాయక బృందాలు రక్షించినట్లు అధికారులు సోమవారం తెలిపారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. సుమత్రా ద్వీపంలో 2,891 మీటర్లు (9,484 అడుగుల) ఎత్తులో ఉన్న మౌంట్‌ మరాపీ ఆదివారం విస్ఫోటనం చెందింది. 

అగ్నిపర్వతం నుండి ఎత్తులో మూడు వేల మీటర్ల ఎత్తులో బూడిద చిమ్మిన దృశ్యాలు మీడియాలో వైరలయ్యాయి. సమీప గ్రామాలపై బురద ప్రవహించినట్లు అధికారులు తెలిపారు. సోమవారం ఉదయం ఈ పర్వతంపై మొత్తం 75 మంది ట్రెక్కింగ్‌ వెళ్లినట్లు పదాంగ్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ అధ్యక్షుడు అబ్దుల్‌ మాలిక్‌ వెల్లడించారు. వీరిలో 11 మంది పర్యాటకులు మరణించినట్లు నిర్ధారించారు. 

ఇప్పటి వరకూ 49 మందికి కాపాడామని.. మరో 12 మంది ఆచూకీ తెలియాల్సి ఉందని, కాపాడిన వారిని ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. అగ్నిపర్వతం వద్ద కాలిన గాయాలతో ముగ్గురు కనిపించారని, వారి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని మాలిక్‌ వివరించారు. ఇప్పటికీ విస్ఫోటనం కొనసాగుతోందని, దీంతో సహాయక చర్యలకు ఆటంకం కలుగుతోందని పేర్కొన్నారు.

అగ్నిపర్వతం నుండి విరజిమ్ముతున్న  పొగ, బూడిద సమీప ప్రాంతాలను కమ్మేశాయని చెప్పారు. విస్ఫోటనం తర్వాత బూడిద వర్షం కురిసిందని మౌంట్‌ మారాపి మానిటరింగ్‌ స్టేషన్‌లోని అధికారి అహ్మద్‌ రిఫాండి తెలిపారు.  ఘటన తీవ్రత నేపథ్యంలో మౌంట్‌ మరపి ప్రాంతంలో అధికారులు అలర్ట్‌ ప్రకటించారు. అక్కడ రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు.

10,000 కన్నా ఎక్కువ జనాభా ఉన్న పశ్చిమ సుమత్రాలోని మూడవ అతిపెద్ద నగరమైన బుకిట్టింగీని కూడా బూడిద కమ్మేసిందని అన్నారు. గ్రామస్తులకు మాస్కులు అందించామని, ఇళ్లలోనే ఉండాల్సిందిగా ఆదేశించినట్లు స్థానిక విపత్తు ఏజన్సీ అధికారి అడే సెటియావాన్‌ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఇండోనేషియా ద్వీప సమూహం పసిఫిక్‌ రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌లో ఉండటంతో, ఖండాల ప్లేట్ల కదలిక కారణంగా ఈ ప్రాంతంలో తరుచూ అగ్నిపర్వతాల విస్ఫోటనం, భూకంపం సంభవిస్తుంటాయి. ఆగేయాసియా దేశంలో సుమారు 130 క్రియాశీల అగ్ని పర్వతాలు ఉన్నాయి.