వరదలతో టాంజానియా, భూకంపాలతో ఫిలిప్పీన్స్‌ అతలాకుతలం

గత కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా తూర్పు ఆఫ్రికా దేశమైన టాంజానియా అతలాకుతలమవుతోంది. శనివారం ఉత్తర టాంజానియాలో కురిసిన వర్షానికి వరదలు సంభవించాయి. రాజధాని డోడోమాకు ఉత్తరాన 300 కిలోమీటర్ల దూరంలో ఉన్న కటేష్‌ పట్టణంలో శనివారం భారీ వర్షం కురిసింది.  వర్షం కారణంగా సంభవించిన వరదల ధాటికి కొండచరియలు విరిగిపడ్డాయి.

ఈ ఘటనలో సుమారు 47 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 85 మంది తీవ్రంగా గాయపడ్డారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. టాంజానియా అధ్యక్షురాలు సమియా సులుహు హస్సన్ ప్రస్తుతం దుబాయ్‌ లో జరుగుతున్న కాప్‌28 పర్యావరణ సదస్సు కోసం వెళ్లారు. ఇక దేశంలోని ప్రస్థుత పరిస్థితిని అధికారులు అధ్యక్షురాలి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ప్రజలను కాపాడేందుకు తగిన చర్యలు తీసుకోవాలని ఆమె అధికారులను ఆదేశించారు. మరోవైపు మృతుల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.

ఇలా ఉండగా, దక్షిణ ఫిలిప్పీన్స్‌లో మిండానావో ద్వీపం వరుస భూకంపాలతో వణికిపోతున్నది. గత శనివారం 7.6 తీవ్రతతో బలమైన భూకంపం రాగా, తాజాగా సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు మిండానావో ద్వీపంలోని హినాటువాన్ మున్సిపాలిటీలో మరోసారి భూమి కంపించింది.  దీని తీవ్రత 6.9గా నమోదయిందని యూఎస్‌ జియోలాజికల్‌ సర్వే వెల్లడించింది.

భూ అంతర్భాగంలో 30 కిలోమీటర్ల లోతులో కదలికలు సంభవించాయని తెలిపింది. హినాటువాన్‌కు 72 కిలోమీటర్ల దూరంలో భూకంప కేంద్రం ఉన్నదని చెప్పింది. కాగా, భూకంపం వల్ల జరిగిన నష్టానికి సంబంధించిన వివరాలు ఇంకా తెలియరాలేదని అధికారులు వెల్లడించారు. కాగా, ఆదివారం సాయంత్రం కూడా 6.6 తీవ్రతతో భూమి కంపించింది. ఇక శనివారం ఇదే ప్రాంతంలో 7.6 తీవ్రతతో భూకంపం వచ్చింది. దీంతో పలు ప్రాంతాలకు సునామీ హెచ్చరికలు జారీ అయ్యాయి. శనివారం నాటి భూకంపం వల్ల ఇద్దరు మరణించారు. పలువురిని పునరావాస కేంద్రాలకు తరలించామని అధికారులు వెల్లడించారు.