తాజాగా వెలువడిన తెలంగాణ ఎన్నికల ఫలితాల్లో బీఆర్ఎస్ ఓటమి పాలు కావడం, కాంగ్రెస్‌కు పట్టం కట్టడంతో ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావు తన పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను ఆయన ఓఎస్డీతో గవర్నర్ డా. తమిళిసై సౌందరరాజన్ కు పంపించారు. మొత్తం 119 సీట్లలో కాంగ్రెస్ 64 సీట్లు గెల్చుకోగా, బిఆర్ఎస్ 39 సీట్లకు పరిమితమైంది. బీజేపీకి 8, ఎంఐఎం 7 స్థానాలను గెలుచుకున్నాయి.
తెలంగాణ డీజీపీ అంజనీకుమార్ ను ఎన్నికల సంఘం సస్పెండ్ చేసింది. ఎన్నికల ఫలితాలు పూర్తికాకముందే టీపీసీసీ అధినేత రేవంత్‌రెడ్డిని డీజీపీ కలవడంతో ఈసీ ఈ చర్యలు తీసుకుంది. రేవంత్‌రెడ్డి ఇంటికివెళ్లి ఉదయం మర్యాదపూర్వకంగా డీజీపీ వెళ్లి కలిశారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన కింద సస్పెన్షన్ వేటు వేసింది.
మరోవంక, ఎన్నికల ఫలితాలు వెలువడిన మరుసటి రోజే, అంటే సోమవారమే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని మీడియాలో కథనాలు వస్తున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో సీఎం ప్రమాణ స్వీకారం చేస్తారని వార్తలొస్తున్నాయి. ఈ రాత్రికే సీఎల్పీ సమావేశం ఉంటుందని, ఈ భేటీలో ఏఐసీసీ పరిశీలకులు ఎమ్మెల్యేల అభిప్రాయాలను తెలుసుకుంటారని సమాచారం.
ఎమ్మెల్యేల ఫిరాయింపుల విషయంలో ఆందోళనకు గురి కావడంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. 70కి పైగా సీట్లు వస్తే పరిస్థితి మరోలా ఉండేదని, కానీ 64 సీట్లు రావడంతో.. అనవసరమైన రిస్క్ వద్దనే అభిప్రాయంతో అధిష్టానం ఉందనేది భావిస్తున్నారు.
అయితే ఇప్పటికే సీఎం ఎవరనే విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఓ నిర్ణయానికి వచ్చిందని భావిస్తున్నారు. సోమవారం సాయంత్రానికి తెలంగాణ ముఖ్యమంత్రిగా కాంగ్రెస్ అభ్యర్థి ప్రమాణ స్వీకారం చేసే అవకాశాలు ఉన్నాయి. సీఎం ఎంపికపై కాంగ్రెస్ ఎమ్మెల్యేల అభిప్రాయాలను ఏఐసీసీ నేతలు సేకరించనున్నారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఇప్పటికే హైదరాబాద్ లోని తాజ్ కృష్ణకు చేరుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన నేపథ్యంలో తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు అనుముల రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్‌కుమార్ రెడ్డి తదితరులు పోటీ పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో సీఎల్పీ సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకృతమైంది. కాంగ్రెస్ పార్టీ విజయాన్ని తెలంగాణ అమరవీరులకు అంకితమిస్తున్నట్టు పీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. కాంగ్రెస్‌కు విజయం అందించిన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణ ప్రజలు ఇవాళ ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించారని, ఈ తీర్పు ఇచ్చిన ప్రజలకు కతజ్ఞతలు తెలిపారు.
`కాంగ్రెస్ పార్టీ తరపున మలి తెలంగాణ ఉద్యమంలో అమరుడైన శ్రీకాంత చారికి నివాళులర్పిస్తున్నాం. తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరించడానికి కాంగ్రెస్ పార్టీని గెలిపించి శ్రీమతి సోనియా గాంధీకి కృతజ్ఞతలు తెలిపే అవకాశం కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి ఇచ్చినందుకు తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. తెలంగాణ ప్రజల ఆలోచనలు, ఆకాంక్షలను అమలు చేయడానికి ఈ తీర్పు ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీ బాధ్యతను గుర్తు చేశారు.. బాధ్యతను పెంచారు. ` అని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.
తెలంగాణ ప్రజల ఆకాంక్షలను నేరవేర్చేందుకు కాంగ్రెస్‌కు అవకాశం వచ్చిందని చెబుతూ తెలంగాణ ప్రజలు విలక్షణ తీర్పు ఇచ్చారని.. డిసెంబర్ 3 2023 చరిత్రలో నిలిచిపోతుందని చెప్పారు. ప్రత్యేక తెలంగాణ కోసం శ్రీకాంత్ చారి డిసెంబర్ 3వ తేదీన అమరడయ్యాడని, ఇదే రోజు కాంగ్రెస్ సాధించిన ఈ విజయం అమరులకు అంకితం ఇస్తున్నామని తెలిపారు. కొత్త ప్రభుత్వ ఏర్పాటులో బీఆర్‌ఎస్ సహకరిస్తుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు. ఇక సచివాలయం గేట్లు అందరికి తెరుచుకుంటాయని, ప్రగతి భవన్ ఇక డాక్టర్ అంబేద్కర్ భవన్‌గా మారుతుందని తెలిపారు. ఇకపై అది ప్రగతి భవన్ కాదని.. ప్రజా భవన్ అని తెలిపారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము