తెలంగాణాలో 18న అమిత్ షా సుడిగాలి పర్యటన

తెలంగాణాలో 18న అమిత్ షా సుడిగాలి పర్యటన
 
* బిజెపి ఎన్నికల ప్రణాళిక విడుదల రేపే
 
తెలంగాణ రాష్ట్రంలో అధికారమే లక్ష్యంగా బీజేపీ తన ప్రణాళికలను సిద్ధం చేస్తోంది. ఇప్పటికే బీజేపీ అగ్రనేతలు పర్యటించగా మరోసారి వరుసగా రాష్ట్రంలో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించేందుకు వస్తున్నారు. ఈ క్రమంలోనే కేంద్రమంత్రి అమిత్​ షా రెండు రోజుల పర్యటన నిమిత్తం రాష్ట్రానికి రానున్నారు. శుక్రవారం రాత్రి నగరానికి చేరుకోనున్నారు.

శుక్రవారం రాత్రి 11 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు అమిత్ షా. అక్కడి నుంచి నేరుగా బేగంపేటలోని ఐటీసీ కాకతీయ హోటల్‌కు 11: 30కి చేరుకుని రాత్రి అక్కడే బస చేస్తారు. శనివారం ఉదయం అల్ఫాహారం అనంతరం 10: 30 గంటలకు సోమాజిగూడలోని కత్రియా హోటల్ ​కు చేరుకుని బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోను ప్రకటిస్తారు.
 
ఈ కార్యక్రమం అనంతరం బేగంపేట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో గద్వాల్‌కు బయలుదేరి వెళ్లనున్నారు. శనివారం మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 1: 20 గంటల వరకు గద్వాల, 2:45 నుంచి 3:20 గంటల వరకు నల్గొండ, సాయంత్రం 4:10 నుంచి 4:45 గంటల వరకు వరంగల్​లో నిర్వహించే సకల జనుల విజయ సంకల్ప సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. 
 
వరంగల్ పర్యటన ముగించుకుని బేగంపేట ఐటీసీ కాకతీయ హోటల్​కు 6:10కు చేరుకుని 6: 45 వరకు విశ్రాంతి తీసుకోనున్నారు. శనివారం రాత్రి 7 గంటల నుంచి 7:45 గంటల వరకు సికింద్రాబాద్ క్లాసిక్ గార్డెన్​లో ఎమ్మార్పీఎస్ నేతలతో అమిత్‌ షా సమావేశం కానున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పిస్తామని ఇటీవల హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. 
 
ఈ నేపథ్యంలోనే ఎమ్మార్పీఎస్‌ ముఖ్య నేతలతో అమిత్‌ షా సమావేశం కానున్నారు. ఎన్నికల్లో బీజేపీకి మద్దతు తెలపడంతో పాటు ఈ అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని ఎమ్మార్పీఎస్‌ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు. క్లాసిక్‌ గార్డెన్‌లో సమావేశం ముగించుకుని అక్కడి నుంచి నేరుగా బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. రాత్రి 8: 15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో తిరిగి ఢిల్లీకి ప్రయాణం కానున్నారు.

కాగా, నవంబర్ 23 తర్వాత బీజేపీ అగ్ర నేతల విస్తృత ప్రచారం నిర్వహించనున్నారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారం నవంబర్ 23తో ముగుస్తుండటంతో తెలంగాణపై పూర్తిగా దృష్టి పెట్టనున్నారు. ఐదు రోజుల్లో 50 సభలకు ప్లాన్ చేస్తున్నారు. ప్రచారానికి ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్రమంత్రి అమిత్ షా, యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, అస్సాం సీఎం హిమంత బిశ్వశర్మ, మహారాష్ట్ర ఏక్​నాథ్ షిండే, కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. 
 
కాగా, నవంబర్ 19 నుంచి మూడు నాలుగు రోజులపాటు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణలో ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు సమాచారం. ప్రధాని మోదీ హైదరాబాద్ నగరంలో రోడ్ షోలో పాల్గొంటారు.