బందీల విడుదలకు ఇజ్రాయిల్- హమాస్ రాజీ!

బందీల విడుదలకు ఇజ్రాయిల్- హమాస్ రాజీ!
గత నెల 7న ఇజ్రాయిల్ పై మెరుపు దాడికి దిగిన హమాస్ ఉగ్రవాదులపై ప్రతీకారాచార్యగా గాజా పట్టణమును అష్టదిగ్బంధనం చేయడంతో పాటు, విద్యుత్ సరఫరా సహితం ఆగిపోయేటట్లు సాగిస్తున్న ఇజ్రాయిల్ సేనల దాడుల నుండి ఊపిరి పీల్చుకొనేందుకు రాజీకి  ఇరుపక్షాలు సిద్ధమవుతున్నట్లు తెలుస్తున్నది. 
 
చర్చల్లో మధ్యవర్తిత్వం వహించిన ఖతార్‌ ప్రయత్నాలు ఫలించాయంటూ లెబనాన్‌, ఖతార్‌ కేంద్రంగా పనిచేస్తున్న పలు అరబిక్‌ పత్రికలు తెలుపుతున్నాయి.  మరోవంక, గాజాలో మానవతా సహాయంకు కూడా ఆటంకం కలుగుతూ ఉండటం, ఆసుపత్రులు సహితం దాడులకు గురవుతూ అమానుష పరిస్థితులు నెలకొనడంతో అంతర్జాతీయంగా పెరుగుతున్న వత్తిడులతో ఇజ్రాయిల్ సహితం రాజీకి సై అనాల్సి వస్తుంది.
 
మీడియా కధనాల ప్రకారం బందీలను విడతల వారీగా విడుదల చేసేందుకు హమాస్, కాల్పుల విరమణకు ఇజ్రాయిల్ సుముఖత వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ముందుగా 70 మంది బందీలుగా ఉన్న మహిళలు, బాలల విడుదలకు హమాస్ సిద్ధమవుతుంటే, కనీసం 100 మందిని విడుదల చేయాలనీ ఇజ్రాయిల్ పట్టుబడుతున్నది. 
 
అందుకు అనువైన వాతావరణం కల్పించేందుకు తాత్కాలికంగా ఐదు రోజుల పాటు కాల్పుల విరమణకు సుముఖత వ్యక్తం చేస్తున్నది. అలాగే ఇజ్రాయెల్ కూడా అదే సంఖ్యలో పాలస్తీనా మహిళలు, యువకులను జైలు నుండి విడుదల చేస్తుంది. మరోవంక, గాజా పార్లమెంట్, పోలీస్ కేంద్ర భావనలతో సహా పలు హమాస్ ప్రభుత్వ భవనాలను స్వాధీనం చేసుకున్నట్టు ఇజ్రాయిల్ దళాలు ప్రకటించాయి.
ఆయుధాలను రూపొందించి, సరఫరాకు కేంద్రంగా ఉంటున్న గాజా యూనివర్సిటీ ఇంజనీరింగ్ ఫాకల్టీ భవనాన్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.  ఆసుపత్రులను హమాస్ ఉగ్రవాద కార్యకలాపాలకు కేంద్రాలుగా వాడుతున్నారని చేస్తున్న ఆరోపణలకు ఆధారంగా ఒక వీడియోను విడుదల చేశారు. అందులో ఓ బాలల ఆసుపత్రిలోకి హమాస్ సేనలు వెడుతూ ఉండటం, మరో ఆసుపత్రి భూగర్భంలో ఆయుధాలు నిల్వ ఉంచడం వంటివి ఉన్నాయి.

కమ్యూనికేషన్‌ వ్యవస్థలన్నీ స్థంభన

మరోవంక, గాజాలో కొనసాగుతున్న యుద్ధంలో ఇప్పటివరకు 101 మంది ఐక్యరాజ్య సమితి సిబ్బంది మరణించారు. వారి మృతికి సంతాప సూచకంగా ఆసియా దేశాల వ్యాప్తంగా ఐక్యరాజ్యసమితి పతాకాలు సగానికి కిందకు దింపి సంతాపం వ్యక్తం చేశారు.  ఇంధన నిల్వలు హరించుకుపోయి విద్యుత్‌ కొరత ఏర్పడడంతో ఆస్పత్రుల్లో పరిస్థితులు అత్యంత దయనీయంగా మారుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అదనామ్‌ గెబ్రియెసెస్‌ హెచ్చరించారు. 
 
నవజాత శిశువులతో సహా అనేకమంది రోగులు మరణిస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇంధన కొరత కారణంగా గాజాలో వచ్చే 48గంటల్లో మానవతా సహాయక చర్యలు కూడా నిలిచిపోతాయని ఐక్యరాజ్య సమితి సహాయ చర్యల కమిషనర్‌ థామస్‌ వైట్‌ హెచ్చరించారు. 
విద్యుత్‌ లేకపోవడంతో గాజాలో కమ్యూనికేషన్‌ వ్యవస్థలన్నీ పూర్తిగా స్తంభించిపోతాయని పాలస్తీనా టెలికం మంత్రి ప్రకటించారు.
 
పెద్ద సంఖ్యలో ప్రజల ఆచూకీ గల్లంతవుతోందని, వీరిలో చాలా మంది శిధిలాల కింద చిక్కుకుపోయి ఉంటారని పాలస్తీనా ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. అటువంటి వారి సంఖ్య 3,200కి పైనే వుందని, వీరిలో 1700మంది వరకు చిన్నారులే వుంటారని తెలిపింది.  కాగా, గాజాలోని ఆస్ప‌త్రిలో 179 మందిని ఖ‌న‌నం చేసిన‌ట్లు అల్ షిఫా హాస్పిట‌ల్ చీఫ్ మ‌హ‌మ్మ‌ద్ అబూ స‌ల్మియా తెలిపారు. హాస్పిట‌ల్ కాంపౌండ్‌లో సామూహిక ఖ‌న‌నం సాగింద‌ని, దాంట్లో శిశువుల‌ను కూడా పాతిపెట్టిన‌ట్లు ఆయ‌న వెల్ల‌డించారు.
 
మరోవైపు లెబనాన్‌లోని హిజ్బుల్లా స్థావరాలపై అనేక దాడులు చేపట్టినట్లు ఇజ్రాయిల్‌ వైమానిక బలగాలు తెలిపాయి. తాము కూడా ఇజ్రాయిల్‌ బలగాలపై యుద్ధ ట్యాంక్‌ విధ్వంసక క్షిపణులను ఉపయోగించి దాడులు జరిపినట్లు హిజ్బుల్లా తెలిపింది. కొంతమంది మరణించారని వెల్లడించింది. దీనిపై ఇజ్రాయిల్‌ మిలటరీ వెంటనే వ్యాఖ్యానించలేదు.