గిరిజ‌నుల‌ను ఓటు బ్యాంకుగా చూస్తున్న కాంగ్రెస్‌

గిరిజ‌నుల‌ను కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఓటు బ్యాంకుగా ప‌రిగ‌ణిస్తే తాము మాత్రం వారి సంక్షేమానికి పాటుప‌డ‌తామ‌ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ తెలిపారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని జ‌బువ జిల్లాలో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీలో ప్ర‌ధానిపాల్గొంటూ బీజేపీ ప్ర‌భుత్వం అధికారంలోకి వ‌స్తే రాష్ట్రంలో గిరిజన జిల్లాల్లో వైద్య క‌ళాశాల‌లు ఏర్పాటు చేస్తామ‌ని, కేజీ నుంచి పీజీ వ‌ర‌కూ బాలిక‌ల‌కు ఉచిత విద్య అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

కాంగ్రెస్ నేత‌లు మ‌ధ్యప్ర‌దేశ్‌లో త‌మ పిల్ల‌ల భ‌విష్య‌త్ కోసం పాటుప‌డితే బీజేపీ గిరిజ‌న బిడ్డ‌ల భ‌విష్య‌త్ కోసం బిజెపి ప‌నిచేస్తోంద‌ని ప్రధాని చెప్పారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర ప‌రాజ‌యం త‌ప్ప‌ద‌ని జోస్యం చెప్పారు. బీజేపీకి  సునామీ కాంగ్రెస్‌ను కూక‌టివేళ్ల‌తో పెకిలిస్తుంద‌ని స్పష్టం చేశారు. 

గ‌త కొద్దిరోజులుగా తాను మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లోని వివిధ ప్రాంతాల ప్ర‌జ‌ల‌ను క‌లుస్తూ వారి ఆశీస్సులు కోరుతున్నాన‌ని పేర్కొంటూ బీజేపీ ప‌ట్ల ప్ర‌జ‌లు విశ్వాసం క‌న‌బ‌రుస్తున్నార‌ని ప్రధాని సంతోషం వ్యక్తం చేశారు. తాను హాజరవుతున్న బహిరంగ సభలకు భారీ ఎత్తున ప్రజలు హాజరవుతున్నారని, చాలా మంది ఎండను సైతం లెక్క చేయకుండా నిల్చుని ప్రసంగాలను వింటున్నారని పేర్కొన్నారు.

ఢిల్లీలో కూర్చుని లెక్క‌లు వేసుకుంటున్న వారి అంచ‌నాల‌కు అంద‌ని రీతిలో మ‌ధ్య‌ప్ర‌దేశ్‌లో బీజేపీకి ఆద‌ర‌ణ ల‌భిస్తోంద‌ని భరోసా వ్యక్తం చేశారు. రెండు రోజుల క్రితం దేశం దీపావళిని జరుపుకుందని చెబుతూ రెండో దీపావళిని డిసెంబర్ 3 న జరుపుకుంటుందని, ఆ రోజు మధ్యప్రదేశ్‌తోసహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరుగుతుందని ప్రధాని తెలిపారు.

కాంగ్రెస్ ప్ర‌భుత్వం ఏ రాష్ట్రంలో కొలువుతీరినా తాను చేప‌ట్టిన అభివృద్ధి కార్య‌క్ర‌మాల‌ను నిలిపివేయ‌డం, ప్రాజెక్టులు ముందుకు సాగ‌కుండా అడ్డుకోవ‌డ‌మే ప‌నిగా పెట్టుకుంటాయ‌ని ప్రధాని ఆరోపించారు. దోపిడీ, అవినీతి, వేధింపులు, అస‌త్యాలే కాంగ్రెస్ పార్టీ ఏకైక అజెండా అని మోదీ దుయ్య‌బ‌ట్టారు.

త‌న‌కు మూడోసారి అవ‌కాశ‌మిస్తే భార‌త్‌ను ప్ర‌పంచంలో మూడు అతిపెద్ద‌ ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌ల్లో ఒక‌టిగా ఎదిగేలా చేస్తామ‌ని చెబుతూ ఇది మోదీ గ్యారంటీ అని ప్రధాని భ‌రోసా ఇచ్చారు. ప్ర‌స్తుతం భార‌త్ అయిదో అతిపెద్ద ఆర్ధిక వ్య‌వ‌స్ధ‌గా అవ‌త‌రించామ‌ని, త్వ‌రలోనే మ‌నం మూడో అతిపెద్ద ఆర్ధిక శ‌క్తిగా ఎదుగుతామ‌ని నిపుణులు చెబుతున్నార‌ని ఆయన గుర్తు చేశారు.

భారత్‌లో జరుగుతున్న అభివృద్ధి ప్రపంచం మొత్తం మీద ప్రశంసలు అందుకుంటోందని, చాలా దేశాలు భారత్‌లో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయని వివరించారు.  ష‌జాపూర్‌లో మంగ‌ళ‌వారం జ‌రిగిన ఎన్నిక‌ల ప్ర‌చార ర్యాలీని ఉద్దేశించి ప్ర‌ధాని మోదీ మాట్లాడుతూ బీజేపీ ప‌ట్ల మీరు క‌న‌బ‌రిచే ప్రేమ కొంద‌రికి నిద్రను దూరం చేస్తోంద‌ని ఎద్దేవా చేశారు. 

వారి ముఖాల్లో న‌వ్వులు మాయ‌మయ్యాయ‌ని, టీవీ ఇంట‌ర్వ్యూల్లో వారి మాటలు ఈ విష‌యాన్ని వెల్ల‌డిస్తున్నాయ‌ని పేర్కొన్నారు. కాంగ్రెస్ ఆగ‌డాల‌తో ఆ పార్టీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో విధ్వంసం జ‌రిగింద‌ని, కాంగ్రెస్ హ‌యాం స‌మ‌స్య‌లతో సంక్లిష్ట‌మైంద‌ని ప్రధాని విమర్శించారు. మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ను క‌డ‌గండ్ల పాలు కాకుండా బీజేపీ కాపాడింద‌ని మోదీ గుర్తుచేశారు.