
దశాబ్దాలుగా ఎస్సీ వర్గీకరణ కోసం పోరాటాలు చేస్తున్నా ఏ పార్టీ చిత్తశుద్దితో పనిచేయలేదని పేర్కొంటూ ఈ విషయంలో కాంగ్రెస్ పార్టీయే మొదటి ముద్దాయి అని కేంద్ర మంత్రి, రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ఆరోపించారు. దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారాం కోసం నరేంద్ర మోదీ కృషి చేస్తున్నారని చెబుతూ ఎస్సీ వర్గీకరణకు కేంద్రం కమిటీని ఏర్పాటు చేస్తుందని తెలిపారు.
ఎస్సి వర్గీకరణ కోసం జరుగుతున్న పోరాటానికి బీజేపీ మొదటి నుండి సంపూర్ణ మద్దతునిస్తుందని పేర్కొంటూ ఈ సమస్యను ప్రధాని మోదీ అర్ధం చేసుకున్నారని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ సమస్యను కాంగ్రెస్ కోల్డ్ స్టోరేజీలో పెట్టిందని ఆరోపించారు. యూపీఏ ప్రభుత్వం ఉషా మెహతా కమిటీని వేసి, వదిలేసిందని విమర్శించారు. నాటి ప్రధాని మన్మోహన్ సింగ కమిటీ నివేదికను కూడా చదవలేదని ధ్వజమెత్తారు.
‘‘మాదిగల సమస్యను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అర్థం చేసుకున్నారు. సమస్య పరిష్కారానికి ఇంతవరకు ఏ ప్రధాని చొరవ చూపలేదు. మాదిగల సమస్యకు మొదటి దోషి కాంగ్రెస్ పార్టీనే. ఉష మెహ్రా కమిటీ రిపోర్ట్‌ను కాంగ్రెస్ పార్టీ కోల్డ్ స్టోరేజ్‌లో పెట్టింది” అంటూ కేంద్ర మంత్రి విమర్శించారు.
ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ గత జులై నెలలో ప్రధాని నరేంద్రమోదీని కలిశారని, ఎస్సీ రిజర్వేషన్ అంశంపై చర్చించారని ఆయన తెలిపారు. అగస్ట్లో ఎమ్మార్పీఎస్ నాయకులను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకొని మాట్లాడారని గుర్తు చేశారు. ఎస్సీ వర్గీకరణపై గతంలో సుప్రీంకోర్టు రెండు రకాల తీర్పులు ఇచ్చిందని కిషన్ రెడ్డి గుర్తు చేశారు.
ఐదుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనాలు పరస్పర విరుద్ధ తీర్పులు ఇచ్చాయని పేర్కొంటూ వర్గీకరణ జరగాలని ఒక ధర్మాసనం, జరగకూడదని మరో ధర్మాసనం తీర్పు చెప్పాయని తెలిపారు. చివరకు ఏడుగురు సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఏర్పాటు చేయాలని సుప్రీం చెప్పిందని వివరించారు.
“సమస్య పరిష్కారం అయ్యే విధంగా కేంద్రం కృషి చేస్తుంది. కేంద్రం వేసే కమిటీ వర్గీకరణ చేయాలా వద్దా అని కాదు… వేగవంతంగా అమలు చేయడం కోసమే… కమిటీ ఒక టాస్క్ ఫోర్క్. కొన్ని పార్టీలు కోడి గుడ్డు మీద ఈకలు పీకుతున్నాయి. న్యాయస్థానం తీర్పు అనుకూలంగా రాకపోతే.. చట్ట సవరణ చేస్తాం” అని కిషన్ రెడ్డి భరోసా ఇచ్చారు.
ప్రధాని ఇచ్చిన భరోసాతో కాంగ్రెస్ నేతలు ఈ విషయంలో ఉలిక్కి పడుతున్నారని, భయపడుతున్నారని కేంద్ర మంత్రి ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ ఎంపీలు ఒక్కసారి కూడా ప్రధానిని కలిసి ఎస్సీ వర్గీకరణపై -డిమాండ్ చేయలేదని ఆయన గుర్తు చేశారు. రెండు పార్టీల కింద భూమి కదులుతుందని భయపడుతున్నాయని తెలిపారు.
ఇది ఓట్ల కోసమో, రాజకీయాల కోసం కాదని చెబుతూ ఓట్లు కోసం అయితే మహిళ చట్టాన్ని ఇపుడే అమలు చేసే వాళ్లం అని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. కాగా, ఎస్సీ వర్గీకరణను చేపడతామని హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన సభలో ప్రధాని మోదీ హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఎస్సీ వర్గీకరణకు కమిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు.
More Stories
పాలస్తీనాను గుర్తించిన బ్రిటన్, కెనడా, ఆస్ట్రేలియా
నేటి నుంచి అమల్లోకి జీఎస్టీ కొత్త శ్లాబులు
ఎల్టీటీఈ పునరుద్ధరణకు శ్రీలంక మహిళ ప్రయత్నం