కెసిఆర్ ను ఓడిస్తేనే తెలంగాణకు విముక్తి

కెసిఆర్ ను ఓడిస్తేనే తెలంగాణ‌కు విముక్తి క‌లుగుతుంద‌ని బిజెపి ఎన్నికల మానేజ్మెంట్ క‌మిటీ క‌న్వీన‌ర్, ఎమ్యెల్యే ఈట‌ల రాజేంద‌ర్ స్పష్టం చేశారు. గజ్వేల్ నియోజకవర్గం, తూప్రాన్ మండలం, ఇమాంపూర్ లో నేడు జ‌రిగిన ఎన్నికల ప్రచారంలో ఆయ‌న మాట్లాడుతూ, ఇమాంపూర్ గ్రామంలో 652 ఎకరాల భూమి 50 ఏళ్ల క్రితం దళితులకు అసైన్డ్ చేశార‌ని, ఆ భుముల మీద కెసిఆర్ కన్ను పడింద‌ని ఆరోపించారు.
 
 ఇప్ప‌టికే ఆ భూముల‌ను గుంజుకోవడానికి నోటీసులు ఇచ్చార‌ని చెబుతూ తాము అధికారంలోకి వ‌చ్చిన వెంట‌నే ద‌ళిత‌లుకే ఆ భూమి తిరిగి వారికే అప్పగిస్తామని హామీ ఇచ్చారు.  కెసిఆర్ వల్ల గజ్వేల్ ప్రజలు కన్నీళ్లు పెడుతున్నార‌ని ఆరోపించారు. తుఫ్రాన్ మండలం, మనోహరబాద్ మండలంలో 5600 ఎకరాలు గుంజుకొని గరీబోళ్ల కళ్ళలో మట్టి కొట్టిన నాయకుడు కేసీఆర్ అంటూ ధ్వజమెత్తారు. 
 
గరిబోల్లకు ఖరీదైన భూములు ఉండవద్దా? అని ప్ర‌శ్నించారు. మన నియోజకవర్గ నుంచి ముఖ్యమంత్రి అయితే మనకు బాగు చేస్తారు అనుకుంటే , మ‌న భూములు గుంజుకొని బిచ్చగాళ్లను చేస్తున్నార‌ని మండిపడ్డారు. రేషన్ కార్డులు ఇవ్వలేదు, డబుల్ బెడ్ రూం ఇళ్లు ఇవ్వలేదు, కానీ బెల్ట్ షాపులు పెట్టి తాగుబోతులు చేస్తున్న వ్యక్తి కేసీఆర్ అంటూ విమర్శలు గుప్పించారు.
బిజెపికి అధికారం ఇస్తే ఒక ఎకరం కూడా దళితుల నుంచి గుంజుకోమని ఈటెల హామీ ఇచ్చారు. నరేంద్ర మోదీ  సహకారంతో డబుల్ బెడ్ రూమ్ ఇల్లు కట్టిస్తామని, ఉద్యోగ నోటిఫికేషన్లు ప్రతి ఆరు నెలలకు ఒకసారి ఇస్తామని ప్రకటించారు. ఉచితంగా నాణ్యమైన ఇంగ్లీష్ మీడియం విద్య అందిస్తామని చెప్పారు.

రూ. 10 లక్షల  ఖరీదైన వైద్యాన్ని పేదలకు ఉచితంగా అందిస్తామని రాజేందర్ తెలిపారు. ఇన్నాళ్ళు మనల్ని పట్టించుకోని టిఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వచ్చి మనల్ని ప్రలోభ పెట్టి, ఆశ చూపించి ఓటు వేయించుకునే ప్రయత్నం చేస్తారని ప్రజలను ఆయన హెచ్చరించారు. ధర్మం న్యాయం బ్రతకాలంటే బిఆర్ఎస్ పార్టీని బొంద పెట్టాలని స్పష్టం చేశారు. కెసిఆర్ ను ఓడగొట్టాలని చెబుతూ ఏ ఓటు వేసి ముఖ్యమంత్రిగా అధికారం ఇచ్చారో..అదే ఓటుతో దెబ్బ కొట్టాలి అంటూ ఈట‌ల పిలుపు ఇచ్చారు.