తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ – నామినేషన్లు ప్రారంభం

తెలంగాణ ఎన్నికల నోటిఫికేషన్ – నామినేషన్లు ప్రారంభం
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘం విడుదలచేసింది. దీంతో నామినేషన్ల ప్రక్రియ కూడా ప్రారంభం అయింది. ఈ నెల 10 వరకు నామినేషన్ పత్రాలను స్వీకరిస్తారు. ఎన్నికల రిటర్నింగ్‌ అధికారుల కార్యాలయాల్లో ఆదివారం మినహా మిగిలిన రోజుల్లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్‌లు స్వీకరించనున్నారు. 
 
నామినేషన్లను ఆన్‌లైన్‌లో పూర్తిచేసి ఆ దరఖాస్తును రిటర్నింగ్‌ అధికారికి భౌతికంగా సమర్పించాల్సి ఉంటుంది.  ఈ నెల 13న నామినేషన్లను పరిశీలిస్తారు. 15 వరకు ఉపసంహరణకు గడువు విధించారు. అదేరోజు సాయంత్రం అభ్యర్థుల తుది జాబితాను ప్రకటిస్తారు.  రాష్ట్రంలోని 119 నియోజకవర్గాలకు ఈ నెల 30న పోలింగ్‌ జరుగనుండగా, డిసెంబర్‌ 3న ఓట్ల లెక్కింపు జరుగనుంది. పోలింగ్‌ ప్రక్రియ మొత్తం ఎలక్ట్రానిక్‌ ఓటింగ్‌ మెషీన్‌ (ఈవీఎం)ల ద్వారా నిర్వహించనున్నారు. 

కాగా, నామినేషన్ల సమయంలో అభ్యర్థులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలని ఈసీ స్పష్టం చేసింది. ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజకవర్గం నుంచి గరిష్టంగా నాలుగుసెట్ల నామినేషన్లు వేయవచ్చు. ఒక అభ్యర్థి రెండుకు మించి నియోజకవర్గాల్లో పోటీ చేయకూడదు.

ఎన్నికల షెడ్యూల్‌

ఎన్నికల నోటిఫికేషన్‌- నవంబర్‌ 3
నామినేషన్లు ప్రారంభం- నవంబర్‌ 3
నామినేషన్లకు చివరి తేదీ- నవంబర్‌ 10
నామినేషన్ల పరిశీలన- నవంబర్‌ 13
నామినేషన్ల ఉపసంహరణ- నవంబర్‌ 15
పోలింగ్‌ తేదీ- నవంబర్‌ 30
ఓట్ల లెక్కింపు- డిసెంబర్‌ 3

అభ్యర్థులు పాటించాల్సిన నిబంధనలు ఇవే:

• ఓటు హక్కు ఉన్న నియోజకవర్గంలో కాకుండా మరొక నియోజకవర్గం నుండి అభ్యర్థిగా పోటీ చేయాలనుకుంటే తనకు ఓటు హక్కు ఉన్నట్లు ధృవీకరణ పత్రం సమర్పించాలి.

• ఒక్కో అభ్యర్థి ఒక్కో నియోజికవర్గం నుంచి గరిష్టంగా నాలుగు సెట్ల నామినేషన్ పత్రాలు దాఖలు చేయవచ్చు.

• గుర్తింపు పొందిన రాష్ట్ర లేదా జాతీయ పార్టీ అభ్యర్థి కోసం అదే నియోజకవర్గంలో ఒక ఓటరు ప్రతిపాదిస్తే సరిపోతుంది.గుర్తింపు లేని పార్టీ అభ్యర్థి లేదా స్వతంత్ర అభ్యర్థి కోసం అదే నియోజకవర్గంలో పది మంది ఓటర్లు ప్రతిపాదించల్సి ఉంటుంది.

• ఎన్నికలకు సంబంధించిన ఖర్చు కోసం ఎట్టి పరిస్థితుల్లోనూ జాయింట్ అకౌంట్లు తెరవొద్దు. ఒక్కో అభ్యర్థి పేరు మీద కేవలం ఒక అకౌంట్ మాత్రమే ఉండాలి.

• ఎస్సీ ఎస్టీ రిజర్వుడ్ స్థానాల్లో పోటీ చేసే అభ్యర్థులు ఆయా వర్గాలకు చెందిన వారే ఉండాలి అందుకోసం కుల ధ్రువీకరణ పత్రం సమర్పించాలి.

• సెక్యూరిటీ డిపాజిట్ కోసం జనరల్ అభ్యర్థులు రూ.10 వేలు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులు రూ.5 వేలు చెల్లించాలి.

• నామినేషన్ దాఖలు చేసే సమయంలో నోటరీ చేసిన అఫిడవిట్ సమర్పించాలి.అందులో అభ్యర్థి వివరాలు,ఆస్తి వివరాలు తదితర వివరాలన్నీ సరిగా ఉండాలి.

• రిటర్నింగ్ అధికారి కార్యాలయం లోపలకి అభ్యర్థి వెంట కేవలం అయిదుగురికి మాత్రమే అనుమతి ఉంటుంది.

• అభ్యర్థుల నామినేషన్లను పరిశీలించే అర్హత కేవలం రిటర్నింగ్ అధికారికి మాత్రమే ఉంటుంది.\

• నామినేషన్లను పరిశీలించే సమయంలో అభర్ధితో పాటు ఎలక్షన్ ఏజెంట్, అభ్యర్థి ప్రతిపాదించిన వారిలో ఒకరు (న్యాయవాది కూడా వెళ్లొచ్చు).

• నామినేషన్లు దాఖలు చేసే సమయంలో రిటర్నింగ్ అధికారి కార్యాలయానికి 100 మీటర్ల దూరంలో ఊరేగింపు వంటివి అపలి.

• ఎన్నికల సంఘం నిబంధనల మేరకు అభ్యర్థి ప్రతిపాదించిన వ్యక్తి నామినేషన్ సమయంలో లేకపోతే వారి నామినేషన్ తిరస్కరణకు గురి అవుతుంది.