
కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ బిసి కులాలను అవమానించారని కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు జి కిషన్ రెడ్డి ధ్వజమెత్తారు. తెలంగాణలో తమ పార్టీ అధికారంలోకి వస్తే బిసి వర్గానికి చెందిన వ్యక్తిని ముఖ్యమంత్రిని చేస్తామని బిజెపి చేసిన వాగ్దానంపై రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తప్పుపట్టారు.
తెలంగాణలో 2 శాతం ఓట్లు మాత్రమే పొందే బిజెపి బిసి ముఖ్యమంత్రిని ఎలా చేయగలదని రాహుల్ గాంధీ ప్రశ్నించడం ఆయన అహంకారాన్ని తెలియచేసోతందని కిషన్ రెడ్డి విమర్శించారు. రాహుల్ వ్యాఖ్యలు తెలంగాణలోని బిసి వర్గాలను అవమానపరిచే విధంగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.
అధికారంలోకి వస్తే బిసిని ముఖ్యమంత్రిని చేస్తామన్న తమ పార్టీ విధానాన్ని వ్యంగ్యంగా మాట్లాడటం, బిజెపిని విమర్శించడం మాత్రమే కాదని, శ్రమపైనే ధారపడి జీవించే వెనుకబడిన వర్గాల ఆకాంక్షలను అవమానించడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ జనాభాలో 55 శాతం ఉన్న వెనుకబడిన వర్గాల ఆశలను సుదీర్ఘ కాలంగా కలగా మారిన బిసిల రాజ్యాధికార ఆకాంక్షలను, వారి సామాజిక, రాజకీయ లక్ష్యాలను పూర్తి చేసే దిశగా బిజెపి పనిచేస్తోందని కిషన్ రెడ్డి తెలిపారు.
బిసి వర్గానికి చెందిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రథానమంత్రి అయితే సహించలేని రాహుల్ గాంధీ ఇప్పుడు తెలంగాణలో బిజెపి అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిని చేస్తామని ప్రకటిస్తే జీర్ణించుకోలేకపోతున్నారని ఆయన ఆరోపించారు. తెలంగాణలోని వెనుకబడిన వర్గాల ప్రజలను ఇలాగే అవమానిస్తూ పోతే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 4 సీట్లకు పరిమితం కావడం ఖాయమని కిషన్ రెడ్డి జోస్యం చెప్పారు.
కాంగ్రెస్ బీసీల ద్రోహి
కాగా, బీజేపీ ప్రకటించిన ‘బీసీ సీఎం’ వాగ్దానంపై కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలు చులకనగా, అవహేళన చేసేలా ఉన్నాయని బిజెపి ఓబిసి మోర్చా అధ్యక్షుడు డా. లక్ష్మణ్ ధ్వజమెత్తారు. రాష్ట్ర జనాభాలో 52% ఉన్న బీసీలకు రాజ్యాధికారం ఇస్తామంటే రాహుల్ జీర్ణించుకోలేకపోతున్నారని దుయ్యబట్టారు. దేశాన్ని, రాష్ట్రాన్ని 6 దశాబ్దాలకు పైగా పాలించిన కాంగ్రెస్ పార్టీ ఒక్కసారి కూడా బీసీని ముఖ్యమంత్రిగా చేయలేదని గుర్తు చేశారు.
బీసీలను కేవలం ఓట్లు వేసే యంత్రాలుగా భావించారు తప్ప రాజ్యాధికారం, పాలనలో భాగస్వాములను చేయలేదని విమర్శించారు. బీసీ నేత సీఎం ఎక్కడ సీఎం అయిపోతారోనన్న దుగ్ధ, ఓర్వలేనితనంతో రాహుల్ మాట్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. మాట తప్పని బీజేపీ ఇచ్చిన ‘బీసీ సీఎం’ వాగ్దానాన్ని నిలబెట్టుకునేలా బీజేపీని గెలిపించే బాధ్యత బీసీలపైనే ఉందని, బీసీ సంఘాలు సత్తా చాటాలని పిలుపునిచ్చారు.
అందివచ్చిన ఈ అవకాశాన్ని జారవిడుచుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. బడుగులు, బలహీనవర్గాలపై చులకన భావం కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు కొత్తేమీ కాదని తెలిపారు. బర్రెలు, గొర్రెలు ఇస్తే చాలు, బీసీలు సంతృప్తి పడతారు అన్నట్టుగా ఈ రెండు పార్టీల నేతలు ప్రవర్తిస్తున్నారని ధ్వజమెత్తారు.
7, 11, 19 తేదీల్లో తెలంగాణకు ప్రధాని
ఈ నెల 7వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణలో పర్యటించనున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన రానున్నారు. 7వ తేదీతో పాటు 11వ తేదీన నిర్వహించే సభలోనూ ఆయన పాల్గొంటారు. ఈ తేదీల్లో హైదరాబాద్, కరీంనగర్, అదిలాబాద్, నల్గొండ జిల్లాల్లో సభలు నిర్వహించాలని బిజెపి రాష్ట్ర నాయకత్వం భావిస్తోంది.
తాము అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని అమిత్ షా ఇటీవల సభలో ప్రకటించారు. ఈ ప్రకటన తర్వాత ప్రధాని మోదీ తొలిసారి తెలంగాణకు వస్తున్నారు. నామినేషన్ల ప్రక్రియ పూర్తయ్యాక ఈ నెల 15వ తేదీ నుంచి జోరుగా ప్రచారం చేయాలని బిజెపి నిర్ణయించింది.
పార్టీ అధ్యక్షుడు జేపీ నడ్డా, అమిత్ షా సహా కేంద్రమంత్రులు, జాతీయ నాయకులు ప్రచారం చేయనున్నారు. 15వ తేదీ నుంచి ఎన్నికల ప్రచారం ఉధృతమయ్యాక 19న మరోసారి ప్రధాని మోదీ తెలంగాణకు రానున్నారు.
More Stories
పాక్-సౌదీ రక్షణ ఒప్పందంలో మరిన్ని ముస్లిం దేశాలు
వరవరరావు బెయిల్ షరతుల మార్పుకు సుప్రీం నిరాకరణ
హెచ్-1బీ వీసా దరఖాస్తులకు లక్ష డాలర్ల రుసుము