
తెలంగాణలో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఒకదానికొకటి స్లీపర్ సెల్స్ గా వ్యవహరిస్తున్నాయని బిజెపి జాతీయ అధికార ప్రతినిధి జాఫర్ ఇస్లాం ధ్వజమెత్తారు. కాంగ్రెస్ లో ఎమ్మెల్యే అభ్యర్థులకు ఎవ్వరికి టిక్కెట్ ఇవ్వాలో కేసీఆర్ నిర్ణయిస్తున్నారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు అవగాహన ఒప్పందం కుదుర్చుకొని రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో మరోసారి ప్రజలను మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నాయని విమర్శించారు.
రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాపార భాగస్వాములేనంటూ దుయ్యబట్టారు. కేసీఆర్ వ్యవహారం మొత్తం తెలంగాణ ప్రజలు గమనిస్తున్నారని చెబుతూ తెలంగాణ ప్రజలపై రాహుల్ గాంధీ కపట ప్రేమ చూపిస్తున్నారని హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు రెండు ఒక్కటే అని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి నోటుకు ఓటు కేసుపై కెసిఆర్ ఎందుకు స్పందించడం లేదని ప్రశ్నించారు.
రేవంత్ రెడ్డి కేసీఆర్ కూతురు ఇద్దరు వ్యాపార భాగస్వాములు కాదా? అని నిలదీశారు. 2018 ఎన్నికల్లో ఒప్పందంతోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ లో చేరారని ఆరోపించారు. అసెంబ్లీ ఎన్నికల తరువాత కూడా బీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కలిసిపోతాయని జాఫర్ ఇస్లాం జోస్యం చెప్పారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల నాటకాలను, రాజకీయ ఒప్పందాలను ప్రజలు గమనిస్తున్నారని హెచ్చరించారు. రానున్న ఎన్నికల్లో ఈ రెండు పార్టీలకు ప్రజలు గట్టి బుద్ధి చెబుతారని ధీమా వ్యక్తం చేశారు.
More Stories
శ్రీశైలం ఘాట్ రోడ్లో ఎలివేటర్ కారిడార్ కు కేంద్రం సమ్మతి!
సిబిఐకి ఫోన్ ట్యాపింగ్ కేసు?
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం