
మెదక్ పార్లమెంట్ సభ్యుడు, దుబ్బాక బిఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై ఓ వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దౌల్తాబాద్ మండలం సూరంపల్లిలో ఎన్నికల ప్రచారంలో కొత్త ప్రభాకర్ రెడ్డి ఉన్న సమయంలో రాజు అనే వ్యక్తి హఠాత్తుగా దూసుకు వచ్చి ఆయనపై కడుపు భాగంలో కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో ఆయనకు తీవ్రంగా గాయాలయ్యాయి.
దాడి జరగగానే అక్కడే ఉన్న బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేసిన రాజును పట్టుకొని చితకబాదారు. అనంతరం అతనిని పోలీసులకు అప్పగించారు. నిందితుడిని మిరుదొడ్డి మండలం పెద్దప్యాల గ్రామానికి చెందిన దట్టని రాజుగా గుర్తించారు. అతడు ఓ యూట్యూబ్ ఛానల్‌లో విలేకరిగా పనిచేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుతం నిందితుడు పోలీసుల అదుపులో ఉన్నాడు. రాజు ఎవరు? ఎందుకు దాడి చేశారు? అనే కోణంలో పోలీసులు విచారించనున్నారు.
మరోవైపు, దాడి అనంతరం తీవ్ర రక్తప్రసావంతో బాధపడుతున్న ప్రభాకర్ రెడ్డిని చికిత్స నిమిత్తం గజ్వేల్ ఆస్పత్రికి అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం ఆయనను హైదరాబాద్‌కు తరలించారు. ఎంపీ ఆరోగ్య పరిస్థితిపై యశోద వైద్యులు స్పందిస్తూ ప్రస్తుతం ఆయనకు ఎలాంటి ప్రమాదం లేదని తెలిపారు. లోతైన గాయాలు కాకపోవటంతో ప్రమాదం తప్పిందని పేర్కొంటూ గాయం అయిన చోట్లు ఆరు కుట్లు వేసినట్లు వైద్యులు చెప్పారు.
More Stories
మాలవీయ మిషన్ పేద విద్యార్థులకు ఆర్థిక సహాయం
స్థానిక సంస్థల ఎన్నికల్లో బిజెపి అభ్యర్థుల ఎంపిక ప్రారంభం
తెలంగాణ బతుకమ్మకు రెండు గిన్నిస్ రికార్డులు