
కాంగ్రెస్ పార్టీ అమ్ముడుపోయే పార్టీ అయితే, బీఆర్ఎస్ కొనుగోలు చేసే పార్టీ అని కేంద్ర మంత్రి, బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ ఒక రాజకీయ అజ్ఞాని అని ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని రాహుల్ గాంధీ ఇష్టారీతిన ఆరోపణలు చేస్తున్నారని పేర్కొంటూ అసలు బీఆర్ఎస్కు కాంగ్రెస్సే బీ-టీమ్ అని ఆరోపించారు. రాహుల్ గాంధీకి అసలు తెలంగాణపై ఏమాత్రం అవగాహన లేదని మండిపడ్డారు. బిఆర్ఎస్ కు రాజీనామా చేసిన చేవేళ్ల మాజీ ఎమ్మెల్యే కేఎస్ రత్నం బీజేపీలో కిషన్ రెడ్డి సమక్షంలో బీజేపీలో చేరారు. కేఎస్ రత్నానికి పార్టీ కండువా కప్పి పార్టీలోకి కేంద్ర మంత్రి ఆహ్వానించారు.
ఎవరో రాసిచ్చిన స్క్రిప్ట్ ను చదవడమే రాహుల్ గాంధీకి అలవాటని ఆయన చెప్పారు. తెలంగాణ సెంటిమెంట్ ఎమిటో, తెలంగాణ ప్రజల ఆకాంక్షలు ఏమిటో, తెలంగాణ చరిత్ర ఏమిటో తెలియని రాజకీయ అజ్ఞాని రాహుల్ అంటూ విమర్శించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ను కంట్రోల్ చేసేది మజ్లిస్ పార్టీ అధినేత అసదుద్దీన్ ఓవైసీ అని ఆరోపించారు.
తెలంగాణ ఒక మాఫియా చేతిలో బందీగా ఉందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కుటుంబ, అవినీతి పాలన నుంచి తెలంగాణకు బీజేపీ విముక్తి చేస్తుందని స్పష్టం చేశారు. బీజేపీపై ఎవరైనా కారుకూతలు కూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ లు అవినీతి పార్టీలని, ఈ రెండు పార్టీలు నియంతల అడుగు జాడల్లో నడిచే పార్టీలుగా ఆయన విమర్శించారు.
బిజెపి తెలంగాణ ప్రజల టీమ్ అని చెబుతూ అధికారం శాశ్వతం కాదు.. ప్రతిపక్షంలో కూర్చోవడానికి తాము సిద్ధమని స్పష్టం చేశారు. కాంగ్రెస్ దోపిడీ, హత్యల పాలనను ప్రజలు చూశారని, ఉద్యమం పేరుతో ప్రజలను ఆగం చేసిన బిఆర్ఎస్ పాలననూ చూశారని చెబుతూ అందుకే సంక్షేమానికి పెద్దపీట వేసి బిజెపికి ఒక్క అవకాశం ఇవ్వాలని కిషన్ రెడ్డి కోరారు. బిజెపి అధికారంలోకి వస్తే ఉచిత విద్య, ఉచిత వైద్యం అందిస్తామని హామీ ఇచ్చారు.
మహబూబ్ నగర్ అభ్యర్థిగా మిథున్ కుమార్ రెడ్డి
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బిజెపి ఇటీవల 52 మందితో తొలి జాబితా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బీజేపీ ఒకే అభ్యర్థి పేరుతో నేడు రెండో జాబితా విడుదల చేసింది. మహబూబ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఏపీ మిథున్ కుమార్ రెడ్డి పేరును ప్రకటించింది. మిథున్ కుమార్ రెడ్డి మాజీ ఎంపీ ఏపీ జితేందర్ రెడ్డి కుమారుడు.
More Stories
ఆయుర్వేద పద్ధతులను, యోగాను అణచి వేసే కుట్ర
లొంగిపోయిన మోస్ట్ వాంటెడ్ మావోయిస్టు సుజాతక్క
17 నుంచి `సేవా పక్షం అభియాన్’గా మోదీ జన్మదినం