బిజెపి అధికారంలోకి వ‌స్తే బిసి వ్య‌క్తికే ముఖ్య‌మంత్రి ప‌ద‌వి

తెలంగాణాలో బిజెపి అధికారంలోకి వ‌స్తే బిసి వ‌ర్గానికి చెందిన వ్య‌క్తినే ముఖ్య‌మంత్రి చేస్తామ‌ని బిజెపి అగ్ర‌నేత, హోమంత్రి అమిత్ షా ప్ర‌క‌టించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన బీజేపీ జన గర్జన సభలో ప్రసంగిస్తూ, కాంగ్రెస్, బిఆర్ఎస్ లు బిసిల‌కు చేసిందేమి లేదంటూ విమ‌ర్శించారు.
 
కాంగ్రెస్ వ‌ల్ల దేశం స‌ర్వం దోపిడికి గురైతే, బిఆర్ఎస్ వ‌ల్ల తెలంగాణ స‌ర్వ‌నాశ‌నం అయింద‌ని మండిప‌డ్డారు. రెండు పార్టీలు అభివృద్ధికి నిరోధ‌క‌ల‌ని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ పార్టీ రాహుల్ ను ప్ర‌ధానిని చేయాల‌ని అలోచిస్తుంటే, కెటిఆర్ ను రాష్ట్ర ముఖ్య‌మంత్రిని చేయాల‌ని ఎత్తులు వేస్తున్నార‌ని అమిత్ ఆరోపిచారు.
 
ఆ రెండు పార్టీలు కుటుంబ పార్టీలు కావ‌డం వ‌ల్లే స్వంత కుటుంబ అభివృద్దే తప్ప ప్ర‌జ‌ల‌కు ఎటువంటి అభివృద్ది ప‌నులు చేయ‌రంటూ విమర్శ‌లు గుప్పించారు.  ప్రధాని మోదీ నాయకత్వంలో మాత్రమే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమని కేంద్ర హోం మంత్రి స్పష్టం చేశారు.
 
”కేటీఆర్‌ను సీఎంను చేయాలని కేసీఆర్‌ ఆలోచిస్తుంటారు. రాహుల్‌ గాంధీని ప్రధానిగా చేయాలని సోనియాగాంధీ చూస్తుంటారు. కేసీఆర్‌, సోనియాకు వాళ్ల కుటుంబం మాత్రమే ముఖ్యం. వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే బిఆర్ఎస్, కాంగ్రెస్‌ లక్ష్యం. బీజేపీ మాత్రమే పేదల సంక్షేమం గురించి ఆలోచిస్తుంది” అని చెప్పారు.
 
బిఆర్ఎస్ పేదల వ్యతిరేక పార్టీ, దళితుల వ్యతిరేక పార్టీ అంటూ కేసీఆర్‌ మరోసారి గెలిస్తేనైనా దళితుడిని సీఎంగా చేస్తారా? అని ప్రశ్నించారు. దళితులకు మూడెకరాల భూమి ఇస్తామన్న హామీ ఏమైందో కేసీఆర్‌ చెప్పాలని నిలదీశారు. రూ.50వేల కోట్లతో దళితుల అభివృద్ధి నిధి ఏమైందో చెప్పాలని కోరారు. 
రూ.10వేల కోట్లతో బీసీ సంక్షేమ కార్యక్రమాలు అన్నారని పేర్కొంటూ ఏం చేశారో చెప్పాలని స్పష్టం చేశారు.
బీసీల సంక్షేమం కోసం ప్రధాని మోదీ రాజ్యాంగ బద్ధంగా బీసీ కమిషన్‌ ఏర్పాటు చేశారని అమిత్ షా గుర్తు చేశారు.  కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గిరిజన సంక్షేమం కోసం కేంద్రం కట్టుబడి ఉందని పేర్కొంటూ అందుకే   ములుగులో సమ్మక్క సారక్క యూనివర్సిటీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రధాన మంత్రి ప్రకటించిన విషయాన్ని అమిత్ షా ఈ సందర్భంగా  ప్రస్తావించారు.

పసుపు రైతుల కోసం తెలంగాణలో పసుపు బోర్డు ఏర్పాటు చేసిన విషయాన్ని కూడా ప్రస్తావించారు.  తెలంగాణ ప్రజల ఆకాంక్షల అనుగుణంగా  కృష్ణా వాటర్ ట్రిబ్యూనల్ ఏర్పాటు చేసామని పేర్కొన్నారు.  కృష్ణా జలాల్లో తెలంగాణ హక్కులు కాపాడేందుకు మోదీ ముందుకు వచ్చారని చెప్పారు. కృష్ణా జలాల్లో తెలంగాణ వాటా తేల్చేందుకు ట్రైబ్యునల్‌ ఏర్పాటు చేశారని అమిత్‌ షా తెలిపారు.

ఈ సందర్బంగా బీఆర్ఎస్ దళిత విరోధి పార్టీ అంటూ ధ్వజమెత్తుతూ వారసులను పదవుల్లో కూర్చబెట్టడమే కాంగ్రెస్, బీఆర్ఎస్‌ల లక్ష్యమని స్పష్టం చేశారు. అయోధ్యలో రామ మందరం నిర్మాణం కోసం 550 యేళ్లకు పైగా పోరాడిన విషయాన్ని ప్రస్తావించారు. త్వరలో ప్రారంభం కానున్న అయోధ్య రామ మందిరాన్ని ప్రజలు దర్శించుకోవాలని కోరారు.