
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఏవీ అమలు చేయకుండా ప్రజలను బిఆర్‌ఎస్ మభ్యపెడుతోందని కేంద్రమంత్రి, బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కిషన్‌రెడ్డి ఆరోపించారు. బుధవారం బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ ఈటల రాజేందర్, జాతీయ కార్యవర్గ సభ్యులు వివేక్ వెంకటస్వామిల సమక్షంలో పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని పాలకుర్తి జడ్పీటీసీ సభ్యురాలు కందుల సంధ్యారాణి, ఆమె అనుచరులు, పెద్దపల్లి, రామగుండంకు చెందిన బిఆర్‌ఎస్ కార్యకర్తలు బీజేపీలో చేరారు.
ఈ సందర్భంగా కిషన్‌రెడ్డి మాట్లాడుతూ కందుల సంధ్యారాణి బిజెపిలోకి ఆహ్వానిస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని వెల్లడించారు. బిఆర్‌ఎస్ పేదలకు డబుల్ బెడ్ రూమ్స్ పంపిణీ, రుణమాఫీ, దళిత బంధు, గిరిజన బంధు, దళితులకు 3 ఎకరాల భూమి వంటి హామీలను నెరవేర్చకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.
మహిళా పొదుపు సంఘాలకు పావలా వడ్డీ రుణాలు ఇవ్వడం లేదు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్ మెంట్ చెల్లించడం లేదు. ఆరోగ్య శ్రీ అటకెక్కించారని ఆరోపించారు. తెలంగాణ వెనుకబాటుకు, ఉద్యోగాల కల్పనలో నిర్లక్ష్యం, సాగునీటి వాటా దక్కకపోవడానికి కారణం కాంగ్రెస్ పార్టీయే కారణమని ఆరోపించారు. గ్యారెంటీల పేరుతో కర్ణాటకలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఏ హామీని నెరవేర్చకుండా ప్రజలను మోసం చేసిందని, ప్రజలకు వెన్నుపోటు పొడిచిందని పేర్కొన్నారు.
జడ్పీటీసీ కందుల సంధ్యారాణి మాట్లాడుతూ రాష్ట్రానికి పట్టిన గ్రహణం వీడాలంటే, సుపరిపాలన అందాలంటే బిజెపి అధికారంలోకి రావాలని ఆకాక్షించారు. మహిళలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ కల్పించేలా చట్టం తీసుకొచ్చిన నరేంద్ర మోదీ ప్రభుత్వానికి మహిళలంతా మద్దతు తెలపాలని కోరుతున్నానని వెల్లడించారు.
More Stories
మహిళా మోర్చా ఆధ్వర్యంలో క్యాన్సర్ స్క్రీనింగ్ శిబిరం
అమెరికాలో పోలీసు కాల్పుల్లో తెలంగాణ టెక్కీ మృతి!
నిజమైన హైదరాబాద్ బస్తీల్లో ఉంది