కోడికత్తి కేసు విచారణపై హైకోర్టు స్టే

కోడికత్తి కేసు విచారణపై హైకోర్టు స్టే
ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో దాడి చేసిన కేసు విచారణపై హైకోర్టు ఎనిమిది వారాల పాటు స్టే విధించింది. కోడికత్తి కేసులో లోతైన విచారణ చేయాలని జగన్ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ ను ఎన్ఐఏ కోర్టు కొట్టివేసింది. దీంతో ఎన్‌ఐఏ కోర్టు ఉత్తర్వులను సీఎం జగన్ హైకోర్టులో సవాల్ చేశారు. 
 
ఈ పిటిషన్ పై కౌంటర్ దాఖలు చేయాలని ఎన్‌ఐఏకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అదేవిధంగా ఈ కేసుపై విచారణను ఆరు వారాలకు కోర్టు వాయిదా వేసింది.  విశాఖ ఎయిర్ పోర్టులో కోడికత్తితో తనపై జరిగిన దాడిలో కుట్రకోణం ఉందని, ఈ కేసులో లోతైన దర్యాప్తు చేయాలని జగన్ ఎన్ఐఏ కోర్టులో పిటిషన్ వేశారు. 
 
అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకోకుండా ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్ దాఖలు చేసిందని ఆరోపించారు. ఈ కేసులో నిందితుడైన శ్రీనివాసరావుకు నేర చరిత్ర ఉన్నా ఆ విషయాన్ని పట్టించుకోకుండా ఎయిర్ పోర్టు క్యాంటీన్‌ నిర్వాహకుడు విధుల్లోకి తీసుకున్నారని పిటిషన్ లో పేర్కొన్నారు.  అయితే ఈ పిటిషన్ ను ఎన్‌ఐఏ కోర్టు జులై 25న కొట్టివేయడంతో సీఎం జగన్‌ హైకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసులో అరెస్టైన శ్రీనివాసరావుకు నాలుగేళ్లగా జైలులోనే ఉన్నాడు. ఈ కేసులో కోర్టు అతడికి బెయిల్ నిరాకరించింది. తాజాగా హైకోర్టు ఈ కేసు విచారణపై ఎనిమిది వారాల పాటు స్టే విధించింది. విశాఖ ఎయిర్‌పోర్టు లాంజ్‌లో అప్పటి ప్రతిపక్షనేత, ప్రస్తుత సీఎం జగన్‌పై నిందితుడు జనుపల్లి శ్రీనివాసరావు కోడి కత్తితో దాడి చేశాడు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఈ కేసును ఎన్ఐఏ విచారణ చేస్తుంది. ఎయిర్‌పోర్టులో జరిగిన ఈ దాడిపై దర్యాప్తు చేపట్టిన ఎన్‌ఐఏ ఇటీవల కోర్టులో ఛార్జ్‌షీట్‌ దాఖలు చేసింది.  ఈ దాడిలో ఎలాంటి కుట్రకోణం లేదని స్పష్టం చేసింది. ఈ కేసులో అభియోగాలు నమోదు చేసిన ఎన్‌ఐఏ కోర్టు, సాక్షుల వాంగ్మూలం నమోదు చేస్తుంది.
ఈ కేసును గతంలో విజయవాడ ఎన్ఐఏ కోర్టులో విచారణ చేశారు. ఇటీవల కేసు విచారణను విశాఖ ఎన్ఐఏ కోర్టుకు బదిలీ చేశారు. దీంతో పాటు నిందితుడు శ్రీనివాసరావు రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విశాఖ జైలుకు తరలించారు.