
తెలుగు రాష్ట్రాల్లో ప్రసిద్ధి పొందిన రచయిత్రి చక్కిలం విజయలక్ష్మి (75) సోమవారం సాయంత్రం కర్నూలులో తుదిశ్వాస విడిచారు. మంగళవారం కర్నూలులో అంత్యక్రియలు నిర్వహించారు. ఆమె గత కొంతకాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నారు. కర్నూలు నగరంలో రుక్మిణమ్మ, కృష్ణమూర్తి దంపతులకు 1948లో జన్మించారు.
స్థానిక బాలికోన్నత పాఠశాలలోనే సెవెన్త్ ఫారం ఆంటే ఇప్పటి ఇంటర్మీడియేట్ వరకు కెవిఆర్ మహిళా కళాశాలలో డిగ్రీ పూర్తి చేశారు. పారిశ్రామికవేత్త శ్రీనివాసరావును పెళ్ళాడారు. ఆ దంపతులకు ఇద్దరబ్బాయిలు. అమెరికాలో సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా ఉద్యోగాలు చేస్తున్నారు. చదువుకునే రోజుల్లోనే తెలుగు భాషా సాహిత్యాలను అమితంగా ప్రేమించారు. చిన్నప్పటినుంచే రచనలు చేయడం ఆరంభించారు. 1973లోనే ఆమె కథ పూలవనం ప్రచురితం అయ్యింది. 1975లో మరుభూమిలో మల్లెతీగలు నవల రాశారు. అప్పటి నుండి కథలు, నవలలు విరివిగా రాయడం ఆరంభించారు.
1973 నుండి 1983 వరకు ఉజ్వల వారపత్రికలో సహసంపాదకులుగా పని చేశారు. 1977లో ఆంధ్రప్రభ వారపత్రికలో తండ్రులూ తీర్పుమీదే! నవల సీరియల్‌గా ప్రచురితమైంది. శాంతితీరం నవలకూడా దారవాహికంగా ప్రచురితమైంది. దేశం నలుమూలలా ఈమె నవలలకు పాఠకులు వేలమంది అభిమానులు తయారయ్యారు. అప్పటి నుండి పలు పత్రికలలో ఆమె నవలలు ధారావాహికంగా ప్రచురించారు. 10 కవితలు ప్రచురితమయ్యాయి. అనేక రేడియో నాటికలు రాశారు.
చక్కిలం ఇప్పటివరకు రాసిన 60కు పైగా కథలన్నీ ప్రచురితమయ్యాయి. నీ గుండె కార్చిన కన్నీరు, పడవప్రయాణం, కాకిగూడు, ప్రేమంటే తెలుసా నీకు, పాలు, అంత్యక్రియలు, శాంతికి శిలువ, జ్ఞాన నేత్రం, గంగాజలం అనే కథలు తెలుగు కథా సాహిత్యంలో సంచలనాలు. గుండెకార్చిన కన్నీళ్ళు, జ్యేష్టభాగం,చంద్రమతి రచనలకు ఎన్నో బహుమతులచ్చాయి.
ఇప్పటివరకు 14 నవలలు రాసి తెలుగు నవలాసాహిత్యంలో నవలారాణి అనిపించుకున్నారు. కర్నూలు జిల్లా చరిత్రను రాస్తే దాన్ని ఆంధ్రభూమి దినపత్రికలో దారావాహికంగా ప్రచురించారు. ఈనాడు దినపత్రికలో అంతర్యామి అనే ఆధ్యాత్మిక శీర్షికను నిర్వహించారు. ఈనాడు సాహిత్య మాసపత్రిక తెలుగు వెలుగులో ప్రేమలేఖల పోటీలో బహుమతి వచ్చింది.
More Stories
ఉగ్రవాదుల బాంబు బెదిరింపులతో ఉలిక్కిపడ్డ తిరుపతి
దేవరగట్టు కర్రల సమరంలో ఇద్దరు మృతి
భారతీయ ఉత్పత్తులకు గ్లోబల్ సంతగా స్వదేశీ సంత