చంద్రబాబు క్వాష్ పిటీషన్ పై సుప్రీం’ తీర్పు రిజర్వ్

ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై సుప్రీంకోర్టులో మంగళవారం విచారణ ముగిసింది. బాబు తరపున హరీష్ సాల్వే, సిద్దార్థ్ లుథ్రా  ఏపీ ప్రభుత్వం తరపున ముకుల్ రోహత్గి సుదీర్ఘ వాదనలు వినిపించారు. వాదనలు విన్న తర్వాత తదుపరి విచారణను శుక్రవారానికి వాయిదా వేస్తున్నట్లు సుప్రీంకోర్టు తెలిపింది. 

ప్రస్తుతం ఈ కేసులో న్యాయస్థానం తీర్పు రిజర్వ్ చేస్తూ సుప్రీం కీలక నిర్ణయం తీసుకుంది. మరోవైపు కోర్టుకు అవసరమైతే లిఖితపూర్వక వాదనలు సమర్పిస్తానని హరీష్ సాల్వే తెలిపారు. సాల్వే విజ్ఞప్తిని సుప్రీంకోర్టు ధర్మాసనం అంగీకరించింది. దీంతో ఈ తీర్పును దేశ అత్యున్నత న్యాయస్థానం రిజర్వ్‌ చేసింది. 

కాగా మొత్తం 17 ఏ చంద్రబాబు వర్తిస్తుందా..? లేదా..? అనేదానిపైనే వాదనలు జరిగాయి. అయితే సోమవారం నాడు వాదనలు మాత్రమే ముగిశాయి. ఇరువురి వాదనలు పరిశీలించడానికి సమయం పడుతుండటంతో శుక్రవారానికి వాయిదా పడింది.

మరోవైపు, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబుకు సుప్రీంకోర్టులో ఊరట లభించింది. బాబుపై నమోదైన ఫైబర్‌నెట్ కేసులో ముందస్తు బెయిల్‌ ఇవ్వాలని ఆయన తరఫు లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించగా సోమవారం నాడు విచారించింది. ఇరువర్గాల వాదనలు విన్న తర్వాత ధర్మాసనం శుక్రవారానికి విచారణ వాయిదా వేసింది. అంతేకాదు అప్పటి వరకూ చంద్రబాబును అరెస్ట్ చేయొద్దని పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.
 
అయితే, ఏపీ హైకోర్టు, విజయవాడ ఏసీబీ కోర్టుల్లో ఆయన దాఖలు చేసుకున్న రెండు కీలక పిటిషన్లపై విచారణ ముందుకు సాగలేదు. దీంతో ఆయన గురువారం వరకూ వేచి చూడాల్సిన పరిస్దితి ఏర్పడింది. ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో చంద్రబాబు బెయిల్ ను ఏసీబీ కోర్టు తోసిపుచ్చిన నేపథ్యంలో ఆయన హైకోర్టును ఆశ్రయించారు. 
 
దీనిపై విచారణ వాయిదా పడుతూ వస్తోంది. ఇవాళ కూడా మరోసారి విచారణ ప్రారంభమైంది. ఇరువర్గాల లాయర్లు తమ వాదనలు వినిపించారు. అయితే దీనిపై ఎటూ తేల్చని హైకోర్టు ధర్మాసనం విచారణను ఎల్లుండికి వాయిదా వేస్తూ నిర్ణయం తీసుకుంది. దీంతో సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ విచారణ నేపథ్యంలో హైకోర్టు ఈ నిర్ణయం తీసుకుని ఉండొచ్చని తెలుస్తోంది.

 
మరోవైపు విజయవాడ ఏసీబీ కోర్టులో చంద్రబాబు లాయర్లు నిన్న ఆయన హెల్త్ అప్ డేట్స్ ఇవ్వాలని కోరుతూ మరో పిటిషన్ దాఖలు చేసారు. దీన్ని విచారణకు స్వీకరించిన ఏసీబీ కోర్టు ఇవాళ వాదనలు ప్రారంభించింది.  అయితే దీనిపై సీఐడీ కౌంటర్ దాఖలు చేయాలని సూచిస్తూ విచారణను వాయిదా వేసింది. సీఐడీ నుంచి కౌంటర్ దాఖలు అయ్యాక దీనిపై ఏసీబీ కోర్టు విచారణ ప్రారంభించనుంది. దీంతో చంద్రబాబు హెల్త్ అప్ డేట్స్ విషయంలోనూ ఆయనకు ఊరట దక్కలేదు.