ఏపీలో రాజకీయ కలకలం సృష్టిస్తున్న ఏపీ ఫైబర్ నెట్ కేసులో ఇప్పటికే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఏపీ సిఐడి నిందితుడిగా పేర్కొన్నది. ఆయన కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్ ప్రమేయంపై దర్యాప్తు చేస్తున్నట్లు ప్రకటించింది. వీరితో పాటు గత ప్రభుత్వంలో ఆర్థికశాఖ మంత్రిగా పని చేసిన యనమల రామకృష్ణుడు పేరు కూడా ఈ కేసులో బయటకు వస్తుందని ఏపీ ఫైబర్ నెట్ ఛైర్మన్ పి గౌతమ్‌రెడ్డి వెల్లడించారు.
ఈ కేసులో లోకేష్ పాత్ర ఉందా లేదా అనేది సీఐడీ చెబుతుందని, దర్యాప్తులో తేలుతుంది పేర్కొన్నారు. యనమల పాత్ర గురించి అప్పట్లోనే చెప్పానని, ఫైబర్ గ్రిడ్ కుంభకోణంలో చంద్రబాబు, అప్పటి ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు పాత్ర ఉందని గతంలోనే చెప్పానని గౌతమ్ రెడ్డి గుర్తు చేశారు.
అధికారంలో ఉన్నప్పుడు తనను ఎవరూ ఏమీ చేయలేరన్న అహంకారంతో చంద్రబాబు ఉండేవారని, ఇప్పుడు అడ్డంగా దొరికిపోయి జైల్లో ఉన్నారని ఎద్దేవా చేశారు. చంద్రబాబు బాధితుల్లో తానూ ఒకడినని, తనను కూడా జైలుకు పంపించారని చెప్పారు. ఒక వ్యక్తిని అన్యాయంగా అరెస్ట్ చేస్తే ఆ కుటుంబం ఎంత వేదన చెందుతుందో ఇప్పుడు బాబు కుటుంబ సభ్యులకు కూడా తెలుస్తుందని తెలిపారు.
ప్రధాని మోదీ, హోంశాఖ మంత్రి అమిత్‌షాలకు చెప్పే చంద్రబాబుని ప్రభుత్వం అరెస్టు చేసిందని వస్తున్న ఆరోపణలను గౌతమ్ రెడ్డి కొట్టిపారేసారు. బీజేపీ, వైఎస్సార్సీపీల మధ్య ఎలాంటి సంబంధాలూ లేవని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ఫైబర్ నెట్ వ్యాపార విస్తృతికి కొత్తగా అనేక చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు.

More Stories
సనాతన ధర్మ పరిరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలి
రూ. 750 కోట్లతో యోగా అండ్ నేచురోపతి రీసెర్చ్ ఇన్స్టిట్యూట్
పుట్టపర్తికి రాష్ట్రపతి ముర్ము, ప్రధాని మోదీ రాకకు పటిష్ట ఏర్పాట్లు