
బిజెపిలో శనివారం ఇద్దరు మాజీ మంత్రులు పార్టీలో చేరారు. నాంపల్లి బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన ఒక కార్యక్రమంలో వివిధ పార్టీలకు చెందిన మాజీ మంత్రులు కృష్ణ యాదవ్, చిత్తరంజన్ దాస్, జడ్పీటీసీ రేఖ సత్యనారాయణ, బండల రామచంద్ర రెడ్డిలతో పాటు పలువురు ప్రాంతాల సర్పంచులు, ఎంపీటీసీలు బీజేపీ లో చేరారు.
వారందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కేంద్ర మంత్రి, తెలంగాణ బిజెపి అధ్యక్షుడు కిషన్ రెడ్డి. ప్రధాని మోదీ నాయకత్వానికి ఆకర్షితులై తెలంగాణలో బీజేపీ ప్రభుత్వ స్థాపన లక్ష్యంగా వీరు పార్టీలో చేరారని కిషన్ రెడ్డి వెల్లడించారు. చైతన్యవంతులైన రాష్ట్ర ప్రజలు బిఆర్‌ఎస్ నేతలు చేస్తున్న నాటకాలను గమనిస్తున్నారని పేర్కొంటూ దీనికి వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సరైన సమాధానం చెబుతారని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో బిజెపి ప్రభుత్వం ఏర్పాటుచేయడం ఖాయమని చెబుతూ 90 రోజుల తర్వాత కెసిఆర్ కుటుంబం ఫాంహౌజ్ కు పరిమితం కావడం ఖాయమని జోస్యం చెప్పారు. తొమ్మిదేళ్లలో రూ. 9 లక్షల కోట్లు రాష్ట్రాభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వం ఖర్చుపెట్టిందని చెబుతూ ముఖ్యమంత్రికి కౌంట్ డౌన్ మొదలైంది స్పష్టం చేశారు.
బిఆర్‌ఎస్ హఠావో.. తెలంగాణ బచావో… ఇది తెలంగాణ ప్రజల నినాదం అని కేంద్ర మంత్రి చెప్పారు. కాంగ్రెస్ పార్టీ 6 గ్యారెంటీల పేరుతో తెలంగాణ ప్రజలను మభ్యపెడుతోందని ధ్వజమెత్తారు. వాళ్లు 60 గ్యారెంటీలు ఇచ్చినా తెలంగాణ సమాజం నమ్మదని తేల్చి చెప్పారు. ఈ కార్యక్రమంలో బిజెపి నేతలు ఈటల రాజేందర్ , డి కె అరుణ తదితరులు పాల్గొన్నారు.
మాజీ మంత్రి జె చిత్తరంజన్ దాస్ మాట్లాడుతూ రాబోయే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని, పార్టీ అధిష్ఠానం తనకు ఎక్కడ అవకాశం ఇచ్చినా బరిలో ఉంటానని, కల్వకుర్తి అభ్యర్థి విజయానికి కృషి చేస్తానని ప్రకటించారు.
More Stories
మాజీ డీఎస్పీ నళినిని పరామర్శించిన బిజెపి బృందం
తెలుగు రాష్ట్రాల స్వదేశీ జాగరణ్ మంచ్ సారధిగా రాచ శ్రీనివాస్
హైదరాబాద్ నుండి మరో రెండు వందే భారత్ రైళ్లు