తెలంగాణలో చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారు. ఆదివారంనాడు మహబూబ్ నగర్ లో నిర్వహించిన పాలమూరు ప్రజాగర్జన బహిరంగసభలో ప్రసంగిస్తూ తెలంగాణలో పసుపు పంట విస్తృతంగా పండుతున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. పసుపు రైతుల సంక్షేమం కోసం జాతీయ పసుపు బోర్డును ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు.
కరోనా తర్వాత పసుపుపై పరిశోధనలు పెరిగాయని మోదీ పేర్కొన్నారు. పసుపు బోర్డు ఏర్పాటుతో పసుపు రైతులకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని చెప్పారు. రాష్ట్ర పసుపు రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామని మోదీ స్పష్టం చేశారు. ములుగు జిల్లాలో కేంద్రీయ గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని కూడా ప్రధాని ప్రకటించారు. సమ్మక్క, సారలమ్మ పేరుతో గిరిజన యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని చెప్పారు. రూ. 900 కోట్లతో యూనివర్శిటీని ఏర్పాటు చేస్తామని వెల్లడించారు. కాగా, ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఎమినెన్స్‌గా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీని తీర్చిదిద్దుతామని ప్రధాని ప్రకటించారు.
‘‘పార్లమెంట్‌లో మహిళా రిజర్వేషన్ బిల్లు పాస్ చేశాం. తెలంగాణలో పలు అభివృద్ధి పనులు ప్రారంభించడం ఆనందంగా ఉంది. తెలంగాణలో రోడ్డు, రైలు కనెక్టివిటీ పెంచాల్సిన అవసరముంది. నవరాత్రికి ముందే శక్తి పూజలు ప్రారంభించాం. తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర మధ్య రవాణా సదుపాయాలు మెరుగవుతాయి. కొత్త ప్రాజెక్టుల్లో 5 మెగా ఫుడ్ పార్క్స్, 4 ఫిషింగ్ క్టస్టర్స్ నిర్మిస్తాం’’ అని మోదీ ప్రకటించారు.
దేశంలో నిర్మించే ఐదు టెక్స్‌టైల్ పార్కుల్లో తెలంగాణకు ఒకటి కేటాయిచామని ప్రధాని మోదీ తెలిపారు. హనుమకొండలో నిర్మించే టెక్స్‌టైల్ పార్క్‌తో వరంగల్, ఖమ్మం ప్రజలకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని చెప్పారు. ప్రస్తుతం చేపట్టిన ప్రాజెక్టులతో మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మధ్య అనుసంధానం పెరుగుతుందని ప్రధాని తెలిపారు. కాగా, తాను తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను ఖచ్చితంగా నెరవేరుస్తామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
తెలంగాణకు ప్రధాని మోదీ వచ్చినా ఆయనను కలిసేందుకు సీఎం కేసీఆర్ కు సమయంలేదని కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు జి. కిషన్ రెడ్డి విమర్శించారు. కేంద్రం చేపట్టే కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ హాజరుకావడంలేదని అంటూ తెలంగాణకు ప్రధాని మోదీ వచ్చినప్పుడల్లా కేసీఆర్ ముఖం చాటేస్తున్నారని ధ్వజమెత్తారు.
అంతకు ముందు హైద్రాబాద్ నుండి రాయిచూర్, రాయిచూర్ నుండి హైద్రాబాద్ కు తొలి రైలు సర్వీస్ ను ప్రధాని ప్రారంభించారు. హైద్రాబాద్ యూనివర్శిటీకి ఐదు కొత్త భవనాలను ప్రధాని ప్రారంభించారు. చర్లపల్లికి గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టకు శంకుస్థాపన చేశారు. రూ. 500 కోట్లతో 37 కి.మీ. నిర్మించిన జక్లేర్-కృష్ణా న్యూ రైల్వే లైన్ ను ప్రధాని జాతికి అంకితం చేశారు. ఖమ్మం నుండి విజయవాడకు గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహాదారి పనులను ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. ప్రధాని తన పర్యటనలో రూ. 6,404 కోట్ల విలువైన జాతీయ రహదారులకు శంకుస్థాపన చేశారు.
More Stories
ట్రంప్ `పౌరసత్వం’ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
ఈ నెల 22 నుంచి ఒకే వరుసలోకి ఆరు గ్రహాలు!
అంతరిక్షం నుంచి మహా కుంభ మేళా.. ఇస్రో ఫొటోలు