
భారతదేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల సంఖ్య 42కి చేరింది. తాజాగా మరో రెండు ప్రదేశాలను యునెస్కో ప్రపంచ వారసత్వ కట్టడాలుగా గుర్తించింది. నోబెల్ గ్రహీత, విశ్వ కవి రవీంద్రనాథ్ ఠాగూర్ స్థాపించిన పశ్చిమబెంగాల్‌లోని ప్రఖ్యాత శాంతినికేతన్ విశ్వవిద్యాలయానికి యునెస్కో గుర్తింపు లభించింది.
దీంతో యునెస్కో గుర్తించిన ప్రపంచ వారసత్వ కట్టడాల జాబితాలో శాంతినికేతన్‌కు కూడా చోటు దక్కింది.
శాంతినికేతన్ విశ్వవిద్యాలయానికి శతాబ్దానికి పైగా చరిత్ర ఉంది. అలాగే కర్ణాటకలోని హొయసల రాజవంశానికి చెందిన 13వ శతాబ్దపు దేవాలయాలకు కూడా యునెస్కో గుర్తింపు లభించింది. ప్రసిద్ధి చెందిన బేలూరులోని చన్నకేశవ ఆలయం, హళేబీడులోని హోయసలేశ్వర ఆలయం, సోమనాథపురలోని కేశవ ఆలయానికి కలిపి ప్రపంచ వారసత్వ కట్టడంగా గుర్తింపు ఇస్తున్నట్టు యునెస్కో వెల్లడించింది. సౌదీ అరేబియాలో జరుగుతోన్న 45వ వరల్డ్ హెరిటేజ్ కమిటీలో ఈ నిర్ణయం తీసుకున్నారు.
శాంతినికేతన్, హోయసలకు ఒక రోజు వ్యవధిలో యునెస్కో గుర్తింపు లభించడం గమనార్హం. దీంతో భారతదేశంలోని ప్రపంచ వారసత్వ కట్టడాల సంఖ్య 42కి చేరుకుందని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తెలిపింది. ఇందులో సాంస్కృతిక విభాగంలో 34, సహజ విభాగంలో ఏడు, ఒక మిశ్రమ ఆస్తి ఉన్నాయని పేర్కొంది.
దీంతో యునెస్కో అత్యధిక వారతస్వ కట్టడాలను గుర్తించిన జాబితాలో భారతదేశం ఆరో స్థానానికి చేరుకుంది. భారత్ కంటే ముందు ఇటలీ, స్పెయిన్, జర్మనీ, చైనా, ఫ్రాన్స్ ఉన్నాయి. ఆయా దేశాల్లో 42 లేదా అంతకంటే ఎక్కువ వారసత్వ కట్టడాలు యునెస్కో గుర్తింపు పొందాయి. కాగా మన దేశంలో 2014 నుంచే ఏకంగా 12 వారసత్వ కట్టడాలకు యునెస్కో గుర్తింపు లభించడం గమనార్హం. హొయసల దేవాలయాలు ఉత్తర, మధ్య, దక్షిణ భారతదేశంలో ప్రబలంగా ఉన్న నగర, భూమిజ, ద్రవిడ శైలుల వంటి వివిధ ఆలయ నిర్మాణ సంప్రదాయాలకు గుర్తింపుగా ఉన్నాయని ఏఎస్‌ఐ తెలిపింది.
ఈ దేవాలయాల గోడలపై ఉన్న వాస్తు శిల్పం, శిల్పాలు.. క్లిష్టమైన శిల్పాలను అనువదించడంలో శిల్పుల ప్రతిభను ప్రతిబింబిస్తాయని పేర్కొంది. అలాగే ఆలయ గోడల వెంట హిందూ ఇతిహాసాలు, పురాణ కథలను వివరించే శిల్పకళా ఫలకాలను కలిగి ఉండే పద్ధతిని మొదట హొయసలులు ప్రవేశపెట్టారని ఏఎస్‌ఐ పేర్కొంది.
More Stories
నేపాల్ అలజడులతో చిక్కుకున్న మానసరోవర్ యాత్రికులు
దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితా సవరణకు కసరత్తు
భారత్- నేపాల్ సరిహద్దుల్లో హై అలర్ట్