కిషన్ రెడ్డి దీక్షను విరమింపజేసిన ప్రకాశ్ జవదేకర్

కిషన్ రెడ్డి దీక్షను విరమింపజేసిన ప్రకాశ్ జవదేకర్
బీజేపీ కార్యాలయంలో 24 గంటల ఉపవాస దీక్షను బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి విరమించారు. నిరుద్యోగులకు న్యాయం చేయాలన్న డిమాండ్‌తో బుధవారం ఇందిరాపార్క్ వద్ద కిషన్‌రెడ్డి నిరాహారదీక్ష చేపట్టారు. అయితే అనుమతి లేదంటూ గత రాత్రి కిషన్ రెడ్డి పోలీసులు అదుపులోకి తీసుకుని బీజేపీ కార్యాలయంలో వదిలిపెట్టారు. 
 
దీంతో బీజేపీ కార్యాలయంలోనే రాత్రి నుంచి దీక్షను కొనసాగించారు. మాజీ కేంద్ర మంత్రి, తెలంగాణ ఎన్నికల ఇన్ ఛార్జ్ ప్రకాష్ జవదేకర్ ఆయనకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింప చేశారు. ఈ సందర్భంగా బీజేపీ కార్యకర్తలు చూపిన తెగువను కూడా అభినందిస్తున్నాను. ఇప్పటికే వివిధ సందర్భాల్లో బీజేపీ సత్తాను కేసీఆర్ కు చూపించామని, కల్వకుంట్ల కుటుంబానికి చుక్కలు చూపించే కార్యక్రమాలు ఇంకా చాలా ఉన్నాయని జవదేకర్ స్పష్టం చేశారు.
నిన్న కిషన్ రెడ్డి శాంతియుతంగా ధర్నా చేస్తే కేసీఆర్ సర్కారుకు సమస్య ఏంటని ప్రశ్నించారు.   కేసీఆర్ భయపడ్డాడని, అందుకే పోలీసులను పంపించి దీక్షను భగ్నం చేసేందుకు కుట్ర చేశాడని ధ్వజమెత్తారు. తెలంగాణ యువతను మోసం చేశామనే విషయం వారికి కూడా తెలుసని,  అందుకే భయం అంటూ విమర్శించారు. యువత కేసీఆర్ ను తొలగించాలని, తెలంగాణను బతికించుకోవాలని ఈ సందర్భంగా పిలుపిచ్చారు.

ఇంకా చేయాల్సింది చాలా ఉందని చెబుతూ వంద రోజుల సమయం మన దగ్గర ఉందని, కేసీఆర్ అవినీతి, అక్రమాలను ప్రజలకు తెలియజేసే ఉద్యమాన్ని కొనసాగిద్దామని ప్రకటించారు. 
అనేక ప్రజాసమస్యలమీద బీజేపీ అలుపెరగని పోరాటం చేస్తోందని,  కానీ పోలీసుల సహాయంతో వీటన్నింటినీ అణిచివేసే ప్రయత్నం కేసీఆర్ చేస్తున్నారని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
శాంతియుతంగా ధర్నాచౌక్ వద్ద 24 గంటల నిరాహార దీక్ష చేస్తే మీకు కలిగిన ఇబ్బందేంటి? మీ ఫాం హౌజ్ లో ధర్నా చేస్తున్నమా?  అంటూ ముఖ్యమంత్రిని ప్రశ్నించారు.  తెలంగాణ ఉద్యమ లక్ష్యాలైన ‘నియామకాల’  విషయంలో కేసీఆర్ సర్కారు అనుసరిస్తున్న విధానం పట్ల తెలంగాణ యువతలో ఆందోళన నెలకొందని తెలిపారు. 
కెసిఆర్‌ మరోసారి అధికారంలోకి వస్తే నిజాం పాలన తెస్తారని హెచ్చరించారు. ‘తెలంగాణ సమాజమా మేలుకో.. కాంగ్రెస్‌కు ఓటు వేస్తే బిఆర్ఎస్​ను సమర్థించినట్లే.. అసెంబ్లీ ఎన్నికల తరువాత కాంగ్రెస్‌తో వెళ్తామని బిఆర్ఎస్ నేతలు చెప్పారన్న విషయాన్ని గుర్తు పెట్టుకో’ అని కిషన్‌ రెడ్డి స్పష్టం చేశారు. తాము అధికారంలోకి వస్తే కచ్చితంగా ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు.
రాష్ట్రం కోసం పోరాడిన సంఘాలన్నింటిని కెసిఆర్ నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ఉద్యోగాలను భర్తీ చేసే టీఎస్‌పీఎస్‌సీలోనే ఖాళీలు ఉన్నాయని చెప్పారు. రానున్న ఎన్నికల్లో బిజెపి ని గెలిపిస్తే తెలంగాణలో నిరుద్యోగాన్ని నిర్మూలిస్తామని కిషన్ రెడ్డి అన్నారు.