లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవితకు మళ్లీ ఈడీ నోటీసులు!

లిక్కర్ కేసులో మరోసారి కీలక పరిణామం చోటు చేసుకుంది. ఇప్పటికే ఈడీ విచారణను ఎదుర్కొన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు తాజాగా మరోసారి నోటీసులు పంపింది. శుక్రవారం విచారణకు హాజరుకావాలని ఆదేశించింది.  ఈ కేసులో ఉన్న అరుణ్‌ రామచంద్రపిళ్లై అప్రూవర్‌గా మారిన వేళ కవితకు నోటీసులు రావటం ఉత్కంఠగా మారింది.
మరికొద్ది రోజుల్లోనే తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో కవితకు నోటీసులు రావటం ఆసక్తికరంగా మారింది. కవిత బినామీగా అరుణ్ రామచంద్రన్ పిళ్లైపై దర్యాప్తు సంస్థ అభియోగాలు మోపింది. కొద్దిరోజులుగా లిక్కర్ కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారింది. అయితే ఇప్పటికే పలువురిని అరెస్ట్ కూడా చేసింది ఈడీ.
ఇందులో భాగంగా ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కూడా తప్పదని అంతా భావించారు. కానీ అలా జరగకుండా  కేవలం విచారణతో సరిపెట్టింది ఈడీ. ఆ తర్వాత కొంత మౌనంగా ఈ వ్యవహరం ఉన్నప్పటికీ ఇందులోని కొందరు నిందితులు అప్రూవర్లుగా మారుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.  గత మార్చిలో మూడు సార్లు ఈడీ ముందు కవిత హాజరైన సంగతి తెలిసిందే.
ఈ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న అరుణ్ రామచంద్రన్ పిళ్లై ఇటీవలే అప్రూవర్‌గా మారారు. 164 కింద ఈడీ అధికారులకు పిళ్లై వాంగ్మూలం ఇచ్చారు. ఈ క్రమంలో అతని వద్ద ఈడీ అధికారులు కీలక సమాచారం రాబట్టినట్లు తెలుస్తోంది. నిజానికి గతంలోనే పిళ్లై అప్రూవర్ గా మారినప్పటికిీ తన స్టేట్ మెంట్ ను వెనక్కి తీసుకున్నాడు.
తాజాగా మరోసారి అప్రూవర్ గా మారినట్లు ఈడీ అధికారులు ప్రకటించారు. ఇతనే కాకుండా  ఏపీకి చెందిన ఎంపీ మాగుంట శ్రీనివాసరెడ్డి , ఆయన కుమారుడు రాఘవరెడ్డితో పాటు శరత్ చంద్రారెడ్డి కూడా అప్రూవర్ గా మారినట్లు తెలుస్తోంది. వీరిచ్చిన సమాచారం ఆధారంగా లిక్కర్ కేసులో కొత్త అంశాలు తెరపైకి వచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
సౌత్ గ్రూప్‌లో ఉన్నవాళ్లంతా అఫ్రూవర్లుగా మారిపోయారు. దీంతో ఈ కేసు మళ్లీ మొదటికొచ్చింది. తాజా పరిణామాల ఆధారంగానే కవితను మరోసారి విచారణకు రావాలని ఈడీ ఆదేశించినట్లు కనిపిస్తోంది.