జీఎస్‌టి బిల్లు లక్కీ డ్రాలో రూ.1 కోటి గెలుచుకోవచ్చు

జీఎస్‌టి బిల్లు లక్కీ డ్రాలో రూ.1 కోటి గెలుచుకోవచ్చు

ఏదైనా షాపులో వస్తువు కొని గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ (జీఎస్‌టి) చెల్లించిన వారు బిల్లును లక్కీ డ్రాలో వేసి రూ.1 కోటి గెలుచుకోవచ్చు. కేంద్ర ప్రభుత్వం త్వరలో ప్రారంభించబోతున్న ఇన్‌వాయిస్ ఇన్సెంటివైజేషన్ స్కీమ్ ఇది. కేంద్ర ప్రభుత్వం చాలాకాలంగా ‘మేరా బిల్ మేరా అధికార్’ పేరుతో ఈ స్కీమ్ ప్రారంభించబోతోంది. 

చాలాకాలంగా ఈ స్కీమ్‌పై కసరత్తు జరుగుతోంది. కస్టమర్లు మొబైల్ యాప్‌లో  జీఎస్‌టి ఇన్‌వాయిస్ బిల్లును అప్‌లోడ్ చేసి లక్కీ డ్రాలో పాల్గొనవచ్చు. హోల్‌సేల్ వ్యాపారులు, రీటైల్ వ్యాపారుల దగ్గర్నుంచి తీసుకున్న ఇన్‌వాయిస్‌లను కస్టమర్లు మేరా బిల్ మేరా అధికార్ యాప్‌లో అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. 

ఇన్‌వాయిస్ ఇన్సెంటివైజేషన్ స్కీమ్ ద్వారా రూ.10 లక్షల నుంచి రూ.1 కోటి వరకు నగదు బహుమతి గెలుచుకోవచ్చు. నెలకోసారి, మూడు నెలలకోసారి లక్కీ డ్రా జరుగుతుందిని అధికార వర్గాలు తెలిపాయి. మేరా బిల్ మేరా అధికార్ యాప్ త్వరలో ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్‌లో అందుబాటులోకి రానుంది. 

ఇన్‌వాయిస్‌లో సెల్లర్ జీఎస్టీఇన్, ఇన్‌వాయిస్ నెంబర్, చెల్లించిన మొత్తం, ట్యాక్స్ వివరాలు ఉండాలి. ఒక వ్యక్తి గరిష్టంగా 25 ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయొచ్చని, కనీస కొనుగోలు విలువ రూ.200 పైన ఉండాలని  అధికారులు వివరించారు. ఈ స్కీమ్ ద్వారా ప్రతీ నెలా 500కు పైగా కంప్యూటరైజ్డ్ లక్కీ డ్రాలు నిర్వహిస్తారు. 

ఈ లక్కీ డ్రాలో ప్రైజ్ మనీ లక్షల రూపాయల్లో ఉంటుంది. ఇక ప్రతీ మూడు నెలలకు ఓసారి రెండు లక్కీ డ్రాలు ఉంటాయి. బహుమతి మొత్తం రూ. 1 కోటి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ పథకం తుది దశకు చేరుకుందని, ఈ నెలలోనే దీన్ని ప్రారంభించవచ్చని వారు తెలిపారు.

జీఎస్‌టి ఎగవేతను అరికట్టడానికి, వార్షిక టర్నోవర్ రూ. 5 కోట్లకు మించిన బి2బి లావాదేవీలకు ప్రభుత్వం ఇప్పటికే ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌ని తప్పనిసరి చేసింది. ‘మేరా బిల్ మేరా అధికార్’ పథకం ఎలక్ట్రానిక్ ఇన్‌వాయిస్‌లు తీసుకునేలా బి2సి కస్టమర్‌లను ప్రోత్సహిస్తుంది. తద్వారా కొనుగోలుదారు లక్కీ డ్రాలో పాల్గొనేందుకు అర్హత పొందవచ్చు. 

జీఎస్‌టీ పరిధిలో ఉన్న వస్తువులు, సేవలకు సంబంధించి విక్రేతల నుంచి నిజమైన ఇన్‌వాయిస్‌లను అడగడానికి కస్టమర్లను ప్రోత్సహించడమే ఈ పథకం లక్ష్యం. బి2సి  దశలో పన్ను చెల్లింపును ప్రోత్సహించడం కోసం ఈ పథకం రూపొందించబడింది. పౌరులు తమ పేరు నమోదు చేసుకోవడానికి వీలుగా కస్టమర్ ఫ్రెండ్లీ మొబైల్ అప్లికేషన్, పోర్టల్ రూపొందిస్తోంది. ఇందులో సులువుగా ఇన్‌వాయిస్‌లను అప్‌లోడ్ చేయొచ్చు.