కంటోన్మెంట్‌ ఏరియాలో స్కైవేలకు రక్షణ శాఖ ఆమోదం

కంటోన్మెంట్‌ ఏరియాలో స్కైవేలకు రక్షణ శాఖ ఆమోదం
సికింద్రాబాద్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ సమస్య పరిష్కారానికి కంటోన్మెంట్‌ ఏరియాలో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన రెండు స్కైవేల నిర్మాణానికి రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. కంటోన్మెంట్‌ పరిధిలోని రాజీవ్‌ రహదారి, 44వ జాతీయ రహదారిలో స్కైవేలను నిర్మించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
 
ఇందుకు ఆ మార్గాలలోని రక్షణశాఖ స్థలాలను కేటాయించాలని రాష్ట్ర ప్రభుత్వం కొంతకాలంగా కేంద్రాన్ని కోరుతున్నది. దీనిపై సానుకూలంగా స్పందించిన రక్షణశాఖ ఆయా రహదారుల్లో తన అధీనంలో ఉన్న 33 ఎకరాల స్థలాన్ని కేటాయిస్తూ గురువారం ఆమోదం తెలిపిందని కంటోన్మెంట్‌ బోర్డు వర్గాలు వెల్లడించాయి.  బేషరతుగా స్థలాలను అప్పగించేందుకు రక్షణ శాఖ అంగీకరించిందని తెలిపాయి. 
 
దీంతో ఈ రహదారుల్లో రాష్ట్ర ప్రభుత్వం నిర్మించనున్న డబుల్‌ డెక్కర్‌ మెట్రోకు మార్గం సుగమమమైంది. ప్రజా రవాణా వ్యవస్థ విస్తరణలో భాగంగా రాజీవ్‌ రహదారి, 44వ జతీయ రహదారిలో రెండంతస్థుల వంతెన మార్గాలను నిర్మించాలని జూలై 31న జరిగిన క్యాబినెట్‌ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 
 
ఒక వంతెనను మెట్రో రైలుకు, మరో వంతెనను వాహనాల రాకపోకలకు కేటాయించాలని నిర్ణయించారు. రాజీవ్‌ రహదారిలో జూబ్లీ బస్‌స్టాండ్‌ నుంచి తూముకుంట వరకు, హైవేలో ప్యాట్నీ నుంచి కండ్లకోయ ఔటర్‌రింగ్‌ రోడ్డు వరకు డబుల్‌ డెక్కర్‌ ఫ్లైఓవర్లను నిర్మించాలని తీర్మానించినట్టు మంత్రి కేటీఆర్‌ చెప్పారు. ఈ మార్గాల్లో కొంత భాగం రక్షణ శాఖ ఆధీనంలో ఉండటంతో అనుమతులు రాగానే పనులు ప్రారంభిస్తామని తెలిపారు. రక్షణశాఖ స్థలాలను ఇవ్వడానికి ముందుకు రావడంతో స్కైవేల నిర్మాణాలు ప్రారంభం కానున్నాయి.

కంటోన్మెంట్‌ ప్రాంతంలో రోడ్ల విస్తరణకు రక్షణశాఖ భూమిని అప్పగించాలని, అందుకు ప్రత్యామ్నాయంగా మరోచోట విలువైన భూమిని ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని కేంద్రానికి రాష్ట్ర సర్కారు విన్నవిస్తున్నది. ట్రాఫిక్‌ రద్దీ కారణంగా ఉత్తర తెలంగాణలోని ఐదు జిల్లాల నుంచి హైదరాబాద్‌ శివారు వరకు వచ్చేందుకు పట్టే సమయం ఒక ఎత్తయితే హకీంపేట నుంచి హైదరాబాద్‌ నగరంలోకి చేరుకునే సమయం మరో ఎత్తుగా ఉంటుంది.