అసెంబ్లీలో తాము ఏమైనా చెప్పాలి అనుకుంటే స్పీకర్ కనీసం తమ మొహం కూడా చూడరని, అసెంబ్లీలో కేవలం సీఎం వైపు మాత్రమే చూస్తూ తమకు సమయం కూడా ఇవ్వరని తెలంగాణ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి వ్యవహరించిన తీరుపై బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఈ సెషన్ అసెంబ్లీ సమావేశాలు స్పీకర్ గొప్పగా నిర్వహించారని అంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లేనని అంటూ ఎద్దేవా చేశారు. శాసన సభలో బీజేపీ ఎమ్మెల్యేలకు కనీసం గది కూడా ఇవ్వకుండా వివక్ష చూపించారని ఆయన మండిపడ్డారు. దాంతో, తాము గన్ మెన్ గదిలో కూర్చొని నోట్స్ రాసుకున్నామని చెప్పారు.
సీఎం కేసీఆర్కు చట్ట సభల మీద విశ్వాసం సన్నగిలిందనడానికి నిదర్శనం ఇటీవల జరిగిన సమావేశాలే నిదర్శనం అని ఈటెల విమర్శించారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో ఏడాదికి దాదాపు 50 నుంచి 65 రోజులు సమావేశాలు జరిగేవని, ఇప్పుడు ఒక సంవత్సరంలో అసెంబ్లీ సమావేశాలు జరిగింది కేవలం 14 రోజులేనని అని గుర్తు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో 13 పార్టీలు ఉన్నా బీఏసీకి పిలిచేవారని, ఇప్పుడు అసెంబ్లీలో ఉంది కేవలం నాలుగు పార్టీలే ఉన్నా, అందులో బీజేపీ జాతీయ స్థాయిలో అధికారంలో ఉన్నప్పటికీ దాన్ని బీఏసీకి పిలవకపోవడం అంటే సీఎంకు ఎంత అక్కసు ఉందో తెలుసుకోవచ్చని ఈటెల మండిపడ్డారు. బీఆర్ఎస్, ఎంఐఎం మిత్రులే అని సీఎం చెబుతారు. మిత్రపక్షమే అసెంబ్లీలో ప్రతిపక్షంగా వ్యహరించడం దారుణం అని విమర్శించారు. అసెంబ్లీలో ఎన్ని ప్రశ్నలు అడిగినా ప్రభుత్వం నుంచి సమాధానాలు రాలేదని చెబుతూ ఎంఐఎం అడిగితే మాత్రం లేచి లేచి సమాధానాలు చెప్పారని ఎద్దేవా చేశారు.
హరీష్ రావు మాట్లాడితే అన్నింటిలో తెలంగాణ నంబర్ వన్, కేటీఆర్ మాట్లాడితే చప్పట్లు కొట్టే వారు 100 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు అనడం ర్యాగింగ్ చేయడమే అని ఈటెల విమర్శించారు. కేసీఆర్ నా అమ్ముల పొదిలో అనేక అస్త్రాలు ఉన్నాయి అంటున్నాడని పేర్కొంటూ గతంలో ఇచ్చిన నిరుద్యోగ భృతి, రైతు రుణమాఫీ లాంటి హామీలే ఇప్పటికి అమలు కాలేదని ఈటల గుర్తు చేశారు.

More Stories
జూబ్లీహిల్స్లో విశ్రాంత ఐపీఎస్ భార్య దారుణ హత్య
ప్రధాని మోదీ పర్యటనలో కానుకగా రూ 8 వేల కోట్ల ప్రాజెక్టులు
కొండగట్టు అంజన్న ఆలయానికి అంతర్జాతీయ గుర్తింపు