గద్దర్ అంతిమయాత్ర తొక్కిసలాటలో సియాసత్ ఎడిటర్ మృతి

గద్దర్ అంత్యక్రియల్లో విషాదం ఏర్పడింది. ఇంటి నుంచి బయలుదేరిన అంతిమయాత్రలో పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. వేలాది మంది అభిమానుల అశ్రునయనాల మధ్య అంతిమయాత్ర స్కూల్ ఆవరణకు చేరుకుంది. అయితే చివరి చూపు కోసం వేలాది మంది ఒక్కసారిగా తోసుకుని ముందుకు రావటంతో తొక్కిసలాట జరిగింది.

ఈ తోపులాటలో గద్దర్‌కు అ‍త్యంత ఆప్తుడిగా పేరున్న జహీరుద్దీన్‌ అలీఖాన్‌ మృతి చెందారు. గద్దర్‌ కడసారి చూపు కోసం భారీగా అభిమానులు వచ్చారు. పోలీసులు వాళ్లను నియంత్రించలేకపోవడంతో తోపులాట జరిగింది. ఈ తోపులాటలో సియాసత్‌ ఉర్దూ ఎడిటర్‌ జహీరుద్దీన్‌ అలీ ఖాన్‌ కింద పడిపోయి ఉక్కిరి బిక్కిరి అయ్యారు.  తోపులాటలో కిందపడిపోయిన ఆయనకు గుండెపోటు వచ్చినట్లు తెలుస్తోంది.

వెంటనే పక్కనే ఉన్న ప్రాథమిక చికిత్స కేంద్రానికి తరలించగా ఆయన చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. సియాసత్ ఉర్దూ పత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీ ఖాన్‌. గద్దర్‌కు అత్యంత సన్నిహితుడు. గద్దర్‌ అంత్యక్రియలకు హాజరై ఎల్బీ స్టేడియం నుంచి పార్థివదేహంతో పాటే వాహనంలో ఆల్వాల్‌ ఇంటి వద్దకు చేరుకున్నారు.

అయితే ఇంటి దగ్గర కిక్కిరిసిన జనం మధ్య ఆయన కింద పడిపోయారు. ఊపిరాడక అస్వస్థతకు గురయ్యారు. కార్డియాక్‌ అరెస్ట్‌తోనే జహీరుద్దీన్‌ మృతి చెందినట్లు తెలిపారు ఈ క్రమంలోనే ఒకరిపై ఒకరు పడ్డారు. ఈ తొక్కిసలాటలో ఒకరు చనిపోయారు. పరిస్థితి అదుపు తప్పటంతో పోలీసులు లాఠీఛార్జి చేసి చెదరగొట్టారు. పలువురికి స్వల్ప గాయాలు అయ్యాయి.

బౌద్ధ సంప్రదాయం ప్రకారం గద్దర్ అంత్యక్రియలు జరిగాయి. అల్వాల్‌లోని భూదేవినగర్‌లో పేద విద్యార్థుల కోసం గద్దర్ స్థాపించిన ‘మహాబోధి పాఠశాల’ ఆవరణలో ఆయన అంత్యక్రియలు నిర్వహించారు. బౌద్ధ మత గురువులు పాల్గొని ప్రార్థనలు చేశారు. గద్దర్ కుమారుడు సూర్యం (సూర్యుడు) చేతుల మీదుగా అంతిమ సంస్కారాలు నిర్వహించారు. అభిమాననులు ‘లాల్ సలామ్, గద్దరన్న ఆశయాలను సాధించుకుందాం, జోహార్ గద్దరన్న, జై భీమ్..’ అంటూ నినాదాలు చేశారు.