సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో రాహుల్ గాంధీ ఎంపీగా లోక్‌సభకు తిరిగి వచ్చిన రోజున, బీజేపీ నాయకుడు నిషికాంత్ దూబే కాంగ్రెస్ దేశవ్యతిరేకతలతో, చైనా దేశాన్ని “విభజిస్తూ” అరాచకం సృష్టిస్తోందని ఆరోపించడంతో లోక్ సభలో తీవ్ర అలజడి చెలరేగింది. దానితో గందరగోళం మధ్య, సభ మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా పడింది.
లోక్‌సభ మధ్యాహ్నం సమావేశమైనప్పుడు, కాంగ్రెస్ ఎంపీలు గాంధీతో కలిసి “భారత్ జోడో భారత్ జోడో”, “రాహుల్ గాంధీ జిందాబాద్ జిందాబాద్” అని నినాదాలు చేస్తూ సభలోకి ప్రవేశించారు. అప్పుడు దూబే లేచి నిలబడి, ది న్యూయార్క్ టైమ్స్‌లోని ఒక కథనం “తుక్డే తుక్డే గ్యాంగ్”, “కొన్ని మీడియా” భారత వ్యతిరేక కార్యకలాపాలలో పాల్గొనడానికి ఏవిధంగా బాహ్య శక్తులతో చేరారో బట్టబయలు చేసిందని ఆరోపించారు.
కేంద్ర ప్రభుత్వాన్ని ఎదిరించేందుకే కాంగ్రెస్‌కు చైనా డబ్బులు ఇస్తోందని ఆరోపించారు. దూబే ప్రకారం, నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని వ్యతిరేకించడానికి కాంగ్రెస్ నాయకులు 2016లో చైనీయులను కలిశారు. “వారు చైనా బలగాలు, కొన్ని మీడియా ద్వారా భారతదేశాన్ని విభజించాలనుకుంటున్నారు,” అని దూబే బిగ్గరగా ఆరోపించారు.
ఆయనకు మద్దతుగా బిజెపి ఎంపీలు తమ డెస్క్‌లను కొట్టారు. “2005- 2014 మధ్య, సంక్షోభం వచ్చినప్పుడల్లా, కాంగ్రెస్ చైనా నుండి డబ్బు పొందింది. 2008లో సోనియా గాంధీ, రాహుల్ గాంధీలను ఆహ్వానించారు. 2016లో డోక్లామ్ సంక్షోభం సమయంలో వారు చైనీయులతో మాట్లాడుతున్నారు’’ అని ఎంపీ తెలిపారు.
కాంగ్రెస్ నేతలు దిగ్విజయ్ సింగ్, రణదీప్ సూర్జేవాలా పేర్లను కూడా ఆయన ప్రస్తావించారు. మావోయిస్టులు, రోహిణి సింగ్, స్వాతి చతుర్వేది వంటి సీనియర్ జర్నలిస్టులకు డబ్బు ఎలా ఇచ్చారో ది న్యూయార్క్ టైమ్స్ నివేదిక వివరించిందని దూబే పేర్కొన్నారు.
ఈ సందర్భంగా కేంద్ర సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ జోక్యం చేసుకొంటూ న్యూస్ క్లిక్ వంటి మీడియా వేదికలు వ్యాప్తి చేస్తున్న కధానాలనే రాహుల్ గాంధీ విదేశీ పర్యటనల సందర్భంగా భారత్ లో ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉందని, న్యాయవ్యవస్థ రాజీ పడుతుందని, ఈవీఎంలు మారుస్తున్నారని అంటూ ఆరోపణలు చేస్తున్నారని గుర్తు చేశారు. వీరందరూ భారత్ ఎదగడానికి ఇష్టం లేని విదేశీ శక్తుల నుండి నిధులు పొందుతున్నారని ఆరోపించారు.
స్పీకర్ స్థానంలో ఉన్న కిరీట్ సోలంకి ఆనాటి కార్యక్రమాలను కొనసాగించడానికి ప్రయత్నించినప్పటికీ, ఇరుపక్షాలు ఒకరినొకరు అరచు కోవడంతో సాధ్యం కాలేదు. దానితో సభ మధ్యాహ్నం 2 గంటలకు వాయిదా పడింది.
వాయిదా అనంతరం సోనియా గాంధీ, రాహుల్ చుట్టూ చేరిన ప్రతిపక్ష ఎంపీలు దూబే మొత్తం సమయంలో మైక్ ఎలా ఆన్‌లో ఉందని ప్రశ్నిస్తూ, రికార్డుల నుంచి ఆయన చేసిన ఆరోపణలను తొలగించేలా స్పీకర్‌ను కలవాలని కోరారు. ఆత్మరక్షణలో కాంగ్రెస్ పడడంతో, స్పీకర్‌కు రాసిన లేఖలో, కాంగ్రెస్ ఎంపీ అధిర్ రంజన్ చౌదరి దూబే ఆరోపణలను “అవమానకరం”, “పరువు నష్టం కలిగించేది” అని పేర్కొన్నారు.
బిజెపి ఎంపీ వ్యాఖ్యలను రికార్డుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్థానంలో ఉన్నాయన మంత్రులకు పత్రాలను సభ ముందుంచడానికి అవకాశం ఇస్తున్న సమయంలో శ్రీ నిషికాంత్ దూబే మైక్రోఫోన్ స్విచ్ ఆన్ చేయబడిందని, ఆయన కాంగ్రెస్ పార్టీపై, సభలోని సభ్యుడైన రాహుల్ గాంధీపై ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే, సభాపతి అనుమతి తీసుకోకుండానే అపవాదు, పరువు నష్టం కలిగించే అభియోగాలను మోపారని అంటూ అభ్యంతరం తెలిపారు.
అతని ఆరోపణలు లోక్‌సభలో ప్రవర్తనా నియమావళిలోని 353వ నిబంధనను తీవ్రంగా ఉల్లంఘించాయని చౌదరి ఆరోపించారు.
“కాబట్టి, రూల్ 350 ప్రకారం, అతని వ్యాఖ్యలను పూర్తిగా తొలగించాలని, అటువంటి ఆరోపణను రికార్డ్‌లో లేవనెత్తడానికి ఎలా అనుమతించబడిందనే దానిపై విచారణ జరపాలని మేము డిమాండ్ చేస్తున్నాము” అని ఆయన కోరారు.
ఇలా ఉండగా, నిర్దుష్టమైన ఆధారాలు లభించడంతో న్యూస్ క్లిక్ మనీ లాండరింగ్ కు పాల్పడినట్లు దర్యాప్తు సంస్థలు 2021లో విచారణ చేపట్టినప్పుడు కాంగ్రెస్, వామపక్ష ఉదారవాదులు దానికి మద్దతుగా నిలబడ్డారని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ గుర్తు చేశారు.

More Stories
118 మంది ఎమ్మెల్యేల మద్దతు లేఖలు కావాల్సిందే
‘ఆపరేషన్ సిందూర్’లో 100 మంది ఉగ్రవాదులు హతం
బీహార్ మంత్రివర్గంలోకి నితీశ్ కుమారుడు నిషాంత్