ఆర్టీసీ ఉద్యోగులను తప్పుదోవ పాటించడంపై ఆగ్రహం

ఆర్టీసీ ఉద్యోగులను తప్పుదోవ పాటించడంపై ఆగ్రహం

ఆర్టీసీ ఉద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని బిజెపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆరోపించారు. శనివారం ఉదయం అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ “ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఆర్టీసీ విలీనం బిజెపికి ఇష్టం లేదని ప్రచారం జరుగుతోంది” అంటూ మండిపడ్డారు. 

టిఆర్‌ఎస్ ప్రభుత్వం కావాలని బట్టకాల్చి గవర్నర్ మీద వేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. ఆర్టీసి ఉద్యోగులను తప్పుదోవ పట్టిస్తూ, బలవంతంగా రాజ్‌భవన్‌కు పంపుతున్నారని ఆరోపించారు. ఆర్టీసీ ఉద్యోగులకు రెండు పిఆర్సీలు బకాలు ఉన్నారని ఆయన గుర్తు చేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని విమర్శించారు.

కాగా, తెలంగాణ సర్కార్, ఆర్టీసిని ప్రభుత్వంలో విలీనం చేస్తూ గవర్నర్ అమోదం కోసం బిల్లును పంపించింది. ఆర్టీసీ బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టడానికి గవర్నర్ నుండి అనుమతి రాలేదని ప్రభుత్వ వర్గాల్లో ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో శుక్రవారం రాజ్ భవన్ అధికారులు స్పష్టత ఇచ్చారు.

అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావడానికి ఒక రోజు ముందే ఆర్టీసీ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడానికి సంబంధించిన బిల్లు రాజ్ భవన్ కు వచ్చిందని తెలిపారు.  ఈ నెల 2వ తేదీ మధ్యాహ్నం 3:30 గంటలకు ఆర్టీసీ బిల్లును సభలో ప్రవేశపెట్టేందుకు అనుమతి కోసం అభ్యర్ధించారని, అయితే ఈ అభ్యర్థనపై నిర్ణయం తీసుకోవడానికి ముందు బిల్లును పరిశీలించి న్యాయ సలహా తీసుకోవడానికి మరికొంత సమయం అవసరం అని స్పష్టం చేశారు.

బస్సుల బంద్ పై మంత్రి ఆదేశంపై ఆగ్రవేశాలు

కాగా, ఆర్టీసీ విలీనం బిల్లుకు గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ఆమోదం తెలిపేందుకు కొంత సమయం కావాలనడంపై టీఎస్‌ఆర్టీసీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇందులో భాగంగా రాష్ట్రం వ్యాప్తంగా శనివారం ఆర్టీసీ బంద్‌కు పిలుపునిచ్చింది. ఈరోజు ఉదయం 10 గంటల వరకు ఆర్టీసీ బస్సుల బంద్ కొనసాగనుంది. 

అయితే డిపో దాటి బస్సులు బయటికి వెళ్లొద్దంటూ ఆర్టీసీ ఉన్నతాధికారులకు మంత్రి పువ్వాడ అజయ్ ఆదేశాలు జారీచేయడంపై  ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వమే బస్సులను బంద్ చేయించడంపై ప్రయాణికులు మండిపడుతున్నారు. సిటీలో బస్సుల్లేక విద్యార్థులు, ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 

ఎంజీబీఎస్, జేబీఎస్ బస్టాండ్లలో జిల్లాలకు వెళ్లే ప్రయాణికులు బస్సుల కోసం పడిగాపులు కాస్తున్నారు. అసెంబ్లీ ప్రారంభమయ్యే వరకు బస్సులు నడపొద్దు అంటూ డిపో మేనేజర్లకు ఆర్టీసీ ఉన్నతాధికారులు హుకుం జారీ చేశారు. మరోవైపు జిల్లాల వ్యాప్తంగా కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితం అయ్యాయి.

ఇదిలాఉండగా గురుకుల టీచర్ పరీక్షలపై బస్సుల బంద్ ప్రభావం తీవ్రంగా కనబడుతోంది. ఉదయం 8.30 గంటలకు గురుకుల పరీక్షకు హాజరుకావాల్సి ఉంది. అయితే.. బస్సుల బంద్తో అభ్యర్థుల్లో తీవ్ర ఆందోళన కనబడింది. హైదరాబాద్ లోనే కాకుండా వివిధ జిల్లాల్లో గురుకుల టీచర్‌ పరీక్ష కేంద్రాల వద్ద ఇదే పరిస్థితి నెలకొంది.