సిఐ అంజు యాదవ్ పై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు

సిఐ అంజు యాదవ్ పై పవన్ కళ్యాణ్ ఫిర్యాదు
జనసేన అధినేత పవన్‌ కళ్యాణ్‌ సోమవారం తిరుపతి ఎస్పీ పరమేశ్వరరెడ్డిని కలిసి జనసేన నేత సాయిపై దాడి చేసిన శ్రీకాళహస్తి సీఐ అంజూ యాదవ్‌పై ఫిర్యాదు చేశారు. శాంతియుతంగా ఉన్న తమ పార్టీ నాయకుడిపై దాడి చేసిన సీఐపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ మేరకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం మీడియాతో పవన్‌ మాట్లాడుతూ ప్రశాంతంగా ఆందోళన చేస్తుంటే సీఐ చేయి చేసుకన్నారని విమర్శించారు. జనసైనికులు ఎంత క్రమశిక్షణ కలిగి ఉంటారనే మచిలీపట్నం సభలో చూశామని తెలిపారు. ఎక్కడా చిన్న పొరపాటు కూడా జరగలేదని గుర్తు చేశారు. జనసేన కార్యకర్త కొట్టే సాయి హుందాగా వ్యవహరించే వ్యక్తి అని.. ఆయన్ని పిలిపించి పోలీసులు కొట్టారని పవన్ కల్యాణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
 
తాము క్రమశిక్షణతో ప్రశాంతంగానే నిరనసలు తెలుపుతామని, తాము ప్రతిసారి పోలీసు శాఖకు ఇబ్బంది కలగకుండా చూసుకుంటున్నామని చెప్పారు. పోలీసులకు ప్రభుత్వం నుంచి ఒత్తిడి ఉంటుందనేది ఒకస్థాయి వరకు తాము అర్థం చేసుకుంటామన తెలిపారు. ఈ ఘటనపై హెచ్‌ఆర్సీ స్పందించి సుమోటోగా స్వీకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.
 
పోలీసులను ప్రభుత్వం ఇష్టానురాజ్యంగా వాడొద్దని హెచ్చరించారు. పవన్‌ రాక నేపథ్యంలో తిరుపతి జిల్లా ఎస్పీ కార్యాలయం వద్దకు భారీగా జనసేన నాయకులు, కార్యకర్తలు చేరుకున్నారు. కాగా సీఐ అంజూ యాదవ్‌పై చర్యలు తీసుకునేందుకు పోలీసు ఉన్నతాధికారులు సిద్దం అవుతున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. దీనిపై పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.