భారతదేశంలోని వైవిధ్యభరితమైన అంశాలు సహజీవనానికి గొప్ప నమూనా అని ముస్లిం వరల్డ్ లీగ్ సెక్రటరీ జనరల్ షేక్ డాక్టర్ మహమ్మద్ బిన్ అబ్దుల్కరీం అల్-ఇస్సా ప్రశంసించారు. ఇది కేవలం మాటల్లో మాత్రమే కాకుండా క్షేత్ర స్థాయిలో కూడా ఆదర్శప్రాయమైనదేనని చెప్పారు. ఈ విషయంలో జరుగుతున్న కృషిని ప్రశంసిస్తున్నట్లు తెలిపారు.
న్యూఢిల్లీలోని ఇండియా-ఇస్లామిక్ కల్చరల్ సెంటర్లో మంగళవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశంలోని ముస్లింలు జాతీయ భావంతో ఉన్నారని, తాము భారతీయులమని గర్వపడతారని, తమ రాజ్యాంగాన్ని గర్వకారణంగా భావిస్తారని చెప్పారు.
డాక్టర్ అల్-ఇస్సాను ఉద్దేశించి జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్ మాట్లాడుతూ, ‘‘మీకు ఇస్లాంతోపాటు ప్రపంచంలోని ఇతర మతాల గురించి లోతైన అవగాహన ఉంది. వేర్వేరు మతస్థుల మధ్య సామరస్యం కోసం కృషి చేస్తున్నారు. సంస్కరణల పథంలో నడవడానికి నిరంతరం ధైర్యంతో కృషి చేస్తున్నారు” అని కొనియాడారు.
ఇస్లాం గురించి, మానవాళికి అది చేస్తున్న కృషి గురించి మరింత బాగా అవగాహన చేసుకోవడానికి ఇవన్నీ దోహదపడ్డాయని ఆయన చెప్పారు. అంతేకాకుండా అతివాద, రాడికల్ భావజాలాలు యువత మనసుల్లో వ్యాపించకుండా నిరోధించాయని తెలిపారు.
మతం, స్థానికత, సంస్కృతి వంటివాటితో సంబంధం లేకుండా దేశంలోని ప్రజలందరికీ వేదికను కల్పించడంలో భారత దేశం విజయవంతమైందని అజిత్ దోవల్ చెప్పారు. ముస్లింలు అధికంగా గల దేశాల్లో ప్రపంచంలో రెండో స్థానంలో భారత దేశం నిలిచిందని, భారతదేశంలో ఇస్లాం సగర్వంగా చెప్పుకోదగ్గ స్థాయిలో ఉందని పేర్కొన్నారు. ఇస్లామిక్ సహకార సంఘంలోని 33 దేశాల్లోని ముస్లింల సంఖ్య కన్నా ఎక్కువ సంఖ్యలో భారత దేశంలో ముస్లింలు ఉన్నారని ఆయన చెప్పారు.
ప్రపంచంలోని విభిన్న అభిప్రాయాలు, సిద్ధాంతాలను స్వాగతించడంలో అరమరికలు లేకపోవడం, వేర్వేరు సిద్ధాంతాలుగలవారితో చర్చలు జరపడం, వివిధ నమ్మకాలు, ఆచారాలు, సంస్కృతులను పూర్తిగా అర్థం చేసుకోవడం వల్లే ఇది సాధ్యమైందని చెప్పారు. ప్రపంచంలో అణచివేతకు గురవుతున్న అన్ని మతాలవారికి అభయాన్నిచ్చే దేశంగా భారత దేశం ఎదిగిందని తెలిపారు.
డాక్టర్ అల్-ఇస్సా మన దేశంలో ఆరు రోజుల పాటు పర్యటిస్తారు. ఈ పర్యటన సోమవారం ప్రారంభమైంది. భారత దేశంలోని రాజకీయ, మతపరమైన నాయకత్వాన్ని ఇస్లామిక్ వరల్డ్ సంస్థతో అనుసంధానం చేయడం కోసం ఆయన కృషి చేస్తున్నారు. వివిధ మతాల మధ్య సామరస్యాన్ని పెంచడంపై ఆయన ప్రధానంగా దృష్టి సారించారు. ఈ సంస్థకు సౌదీ అరేబియా నిధులు సమకూర్చుతోంది. అందువల్ల ఆయన పర్యటనను ‘శాంతి దౌత్యం’గా భావిస్తున్నారు.

More Stories
తమిళనాట బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం ఖాయం
శశి థరూర్ పార్టీ మీటింగ్ కు గైరాజర్.. మోదీ సభకు హాజరు
కేరళలోనూ గుజరాత్ తరహాలో త్వరలో అధికార మార్పు