ప‌వ‌న్ వ్యాఖ్యాల‌కు భ‌గ్గుమ‌న్న వైసిపి, మ‌హిళా క‌మిష‌న్

ప‌వ‌న్ వ్యాఖ్యాల‌కు భ‌గ్గుమ‌న్న వైసిపి, మ‌హిళా క‌మిష‌న్
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదివారం ప్రారంభించిన రెండవ విడత వారాహి విజయయాత్రలో వాలంటీర్ల పై చేసిన వ్యాఖ్యలపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. పవన్ కళ్యాణ్ వాలంటీర్ల పై అనుచిత వ్యాఖ్యలు చేశారని తీవ్ర స్థాయిలో పవన్ కళ్యాణ్ తీరుపై వైస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. ఏపీ మహిళా కమిషన్ నోటీసులు జారీ చేసింది.
 
‘వైఎస్సార్‌సీపీ పాలనలో ప్రతి గ్రామంలో వాలంటీర్లను పెట్టి.. కుటుంబంలో ఎంత మంది ఉన్నారు.. వారిలో మహిళలు ఎందరు, వితంతువులున్నారా అని ఆరా తీస్తున్నారు. ఈ పాలనలో అదృశ్యమైన 30 వేల మందిలో 14 వేల మంది ఆచూకీ ఇప్పటికీ తెలియలేదు. రాష్ట్రంలో మహిళల అదృశ్యాలకు వాలంటీర్లే కారణం” అని పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. 
 
ఏలూరులో మహిళల మిస్సింగ్‌పై పవన్ చేసిన ఆరోపణలపై ఆధారాలివ్వాలని కోరింది.. 10 రోజులలో సమాధానం ఇవ్వాలని నోటీస్ లో మహిళా కమిషన్ పేర్కొంది.  పవన్ కళ్యాణ్ మ‌హిళా వాలంటీర్ల‌ను అవ‌మానించాడ‌ని అంటూ వైసిపి మంత్రులు మండిపడుతున్నారు. మరోవంక, వాలంటీర్ల సంఘాలు రాష్త్ర వ్యాప్తంగా నిరసనలు జరుపుతూ పవన్ కళ్యాణ్ దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తున్నారు. పవన్ తక్షణమే క్షమాపణలు చెప్పాలని లేకపోతే క్రిమినల్ కేసులు పెడతామని హెచ్చరిస్తున్నారు.
 

పవన్ చేసిన వ్యాఖ్యలకు ఆధారాలు ఇవ్వకపోతే క్షమాపణ చెప్పాలని మహిళా కమిషన్‌ డిమాండ్‌ చేసింది. ఏ కేంద్ర నిఘా వ్యవస్థ సమాచారం మేరకు పవన్ ఈ వ్యాఖ్యలు చేశారో సమాచారం ఇవ్వాలని కోరింది.  పవన్‌ ఆరోపిస్తున్నట్లు తప్పిపోయిన మహిళల వివరాలు ఇవ్వాలని కమిషన్‌ డిమాండ్‌ చేసింది. మహిళల మిస్సింగ్ పవన్ కు సమాచారం ఇచ్చిన కేంద్ర అధికారి ఎవరో చెప్పాలని రాష్ట్ర మహిళా కమిషన్‌ నోటీసుల్లో పేర్కొంది.

మహిళలను ఉద్ధేశించి చేసిన పవన్‌ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వస్తున్నాయని మహిళా కమిషన్‌ ఛైర్‌ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ తెలిపారు. ఈ-మెయిల్స్ ద్వారా మహిళా సంఘాలు, వాలంటీర్లు ఫిర్యాదులు చేస్తున్నారని పేర్కొన్నారు. పవన్‌కు నోటీసులు ఇచ్చామని వాసిరెడ్డి పద్మ తెలియజేశారు.
పవన్‌కళ్యాణ్‌పై ఉరవకొండ పోలీస్ స్టేషన్‌లో వలంటీర్లు ఫిర్యాదు చేశారు. వలంటీర్లపై చేసిన అనుచిత వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. పవన్‌కళ్యాణ్‌పై చర్యలు తీసుకోవాలంటూ వలంటీర్లు కోరారు.
తిరుగుబోతు సంసారం గురించి మాట్లాడితే ఎలా ఉంటుందో పవన్ కల్యాణ్ రాజకీయాల గురించి మాట్లాడితే అలాగే ఉందని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఎద్దేవా చేశారు. పవన్ పొలిటికల్ సైడ్ హీరో అని సెటైర్లు వేశారు. పవన్ చూసి ఆడపిల్లలు భయపడుతున్నారని మంత్రి గుడివాడ అమర్నాథ్ ఆరోపించారు.  పవన్ కళ్యాణ్ మ‌హిళా వాలంటీర్ల‌ను అవ‌మానించాడ‌ని మంత్రి వేణుగోపాలకృష్ణ మండిప‌డ్డారు. మహిళలకు పవన్ వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. వాలంటీర్ల వ్యవస్థ దేశంలోనే ఎంతో గుర్తింపు పొందిందని పేర్కొన్నారు.