
ఫ్రాన్స్‌లో అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి. గత మంగళవారం మైనారిటీ వర్గానికి చెందిన 17 ఏండ్ల టీనేజర్ నాహెల్‌ను ట్రాఫిక్ పోలీసులు కాల్చిచంపడంతో మొదలైన అల్లర్లు అన్ని ప్రధాన నగరాలకు విస్తరిస్తున్నాయి. రాత్రి అయ్యిందంటే చాలు వందలు, వేలమంది ఆందోళనకారులు రోడ్లపైకి వచ్చి ఎదురొచ్చిన వాహనానికల్లా నిప్పు పెడుతున్నారు.
ఆందోళనకారుల ఆగ్రహానికి ఇప్పటికే 2,500 వాహనాలు బూడిదయ్యాయి. వందలకొద్దీ షాపులు, మాల్స్ ధ్వంసమయ్యాయి. వరుసగా ఐదో రోజు కూడా ఆందోళనలతో ఫ్రెంచ్ దేశం దద్దరిల్లింది. ఈ క్రమంలో ఆందోళనకారులు ప్యారిస్ టౌన్ మేయర్ ఇంటిపై దాడిచేశారు. ఆదివారం రాత్రి నగర మేయర్ విన్సెంట్ జీన్‌బ్రన్ ఇంట్లోకి ఓ కారు దూసుకెళ్లింది. అంతటితో ఆగని నిరసనకారులు ఇంటికి నిప్పు పెట్టారు.
దీంతో ఆయన భార్య, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారని విన్సెంట్ ట్విట్టర్ వేదికగా వెల్లడించారు. పారిస్‌కు దక్షిణంగా ఉన్న పట్టణంలోని తన ఇంటిపైకి తన కుటుంబం నిద్రిస్తున్న సమయంలో ఆందోళనకారులు కారుతో నివాసంలోకి దూసుకువచ్చారని, అనంతరం ఇంటికి నిప్పుపెట్టారని తెలిపారు. ఈ దాడిలో తన భార్య, చిన్నారికి గాయాలైనట్లు లా హెలెస్ రోసెస్ పట్టణ మేయర్ విన్సెంట్ జీన్‌బ్రూన్ ట్విటర్‌లో పేర్కొన్నారు. తమపై హత్యాయత్నం చేశారని ఆరోపించారు.
గత ఐదు రోజులుగా కొనసాగుతున్న అల్లర్లలో పోలీసులు ఇప్పటివరకు 4 వేల మంది నిరసనకారులను అరెస్టు చేశారు. అయితే అధికారుల చెబుతున్న సంఖ్య కన్నా ఇంకా ఎక్కువమందే పోలీసుల అదుపులో వున్నారని భావిస్తున్నారు. అయినా, నిరసనలు ఆగటం లేదు. నిరసనకారులంతా టీనేజర్లేనని పోలీసులు చెప్తున్నారు. శాంతిని నెలకొల్పేందుకు పోలీసులు ఎంతగా ప్రయత్నించినా అల్లర్లు కొనసాగుతూనే ఉన్నాయి.
పది షాపింగ్ మాల్స్, 200కి పైగా సూపర్ మార్కెట్లు, 250 పొగాకు దుకాణాలు, 250 బ్యాంక్ అవుట్‌లెట్లపై దాడులు జరిగాయని ఆర్థిక మంత్రి బ్రూనో లీ మైర్ తెలిపారు. ఇప్పటివరకు 1350కి పైగా కార్లు దగ్ధమయ్యాయి. రోడ్లపై మొత్తంగా 2560చోట్ల భవనాలకు, వాహనాలకు నిప్పంటించారని హోం మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఫ్రాన్స్‌లో తాజా అల్లర్లు గత ఏడాది అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్‌ను పోలీసులు చంపిన తర్వాత చెలరేగిన అల్లర్లను తలపిస్తున్నాయి. ఇప్పుడు ఫ్రాన్స్‌లో చనిపోయిన నాహెల్ కూడా ఆఫ్రికా నుంచి వలస వచ్చిన అరబ్ మూలాలున్న నల్లజాతీయుడే. అతడు ముస్లిం మతానికి చెందినవాడు. దీంతో ఫ్రాన్స్‌లోని నల్లజాతీయులంతా తీవ్ర ఆగ్రహంతో నిరసనలు తెలుపుతున్నారు.
ఈ నిరసనలు దశాబ్దాలుగా పాతుకుపోయిన జాతి వివక్షపై తిరుగుబాటు అని ప్రచారం అవుతున్నది. సోషల్‌మీడియాలో కూడా జాతి వివక్ష వ్యతిరేక ఉద్యమ హోరు కొనసాగుతున్నది. నాహెల్ తల్లి కూడా తన కుమారుడు నల్లజాతీయుడు కాబట్టే పోలీసులు కాల్చిచంపారని ఆరోపించారు. ఇదిలా వుండగా, రాత్రి వేళల్లో బస్సులు, ట్రామ్‌లు నడపవద్దని హోం మంత్రి గెరాల్డ్ దార్మానిన్ ఆదేశించారు. హింసను రెచ్చగొట్టేందుకు సామాజిక మాధ్యమాలను ఉపయోగించవద్దని కోరారు.
More Stories
రామ రాజ్యం నాటి సుపరిపాలన కోసం కూటమి పాలన
నేపాల్ తాత్కాలిక ప్రధానిగా సుశీల కర్కిని ఒప్పించిన ఆర్మీ చీఫ్
పాక్ కు చైనా, ఐరోపా, యుఎఈ, అమెరికాల నిఘా యంత్రాలు