`ఆదిపురుష్’ చిత్రంలో కొన్ని సంభాషణలు మార్పు

`ఆదిపురుష్’ చిత్రంలో కొన్ని సంభాషణలు మార్పు
ప్రభాస్ హీరోగా తెరకెక్కిన `ఆదిపురుష్’ సినిమా శుక్రవారం విడుదలై వసూళ్ల పరంగా దూసుకు పోతున్నా గ్రాఫిక్స్ విషయంతో పాటు కొన్ని సంభాషణల పరంగా వ్యక్తం అవుతున్న అభ్యంతరాలను దృష్టిలో ఉంచుకొని కొన్ని మార్పులు చేయనున్నట్లు చిత్ర బృందం ప్రకటించింది. విడుదలైన మొదటి రెండు రోజుల్లోనే వసూళ్ళలో రూ.240 కోట్ల మార్కును దాటింది.

`ఆదిపురుష్’ సినిమాలో ప్రధానంగా హనుమంతుడి చెప్పే కొన్ని సంభాషణలపై కొందరు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. దేవుడి పాత్రతో ఇలా మాట్లాడిస్తారా? అని దర్శకుడు ఓం రౌత్,  సంభాషణల రచయిత మనోజ్ ముంతాషిర్ శుక్లలాపై విమర్శలు చేస్తున్నారు. దీంతో ప్రజల మనోభావాలను దృష్టిలో ఉంచుకొని, అభ్యంతరాలు వ్యక్తమవుతున్న సంభాషణలను మార్చేందుకు నిర్ణయించుకున్నారు. మరికొన్ని రోజుల్లో మారిన సంభాషణలు సినిమాలో ఉంటాయని వెల్లడించారు.

“ప్రేక్షకుల నుంచి వచ్చిన సూచనల మేరకు సినిమాలోని కొన్ని సంభాషణలను మార్చేందుకు నిర్ణయించాం. సినిమా ప్రధాన అంశంపై ఎలాంటి ప్రభావం పడకుండా సంభాషణల మార్పు ఉంటుంది. మరికొన్ని రోజుల్లో ఈ మారిన సంభాషణలు థియేటర్లలో కనిపిస్తాయి” అని చిత్రబృందం తెలిపింది.

కొన్నిసంభాషణల విషయంలో విమర్శలు వస్తుండటంతో సంభాషణల రచయిత మనోజ్ స్పందించాడు. “నేను ఆదిపురుష్ మూవీ కోసం 4000 లైన్లు రాశాను. కేవలం 5 లైన్ల పట్ల సెంటిమెంట్లు బయటికి వస్తున్నాయి. అయితే, శ్రీ రాముడిని కీర్తిస్తూ, సీతాదేవి పవిత్రతను వర్ణిస్తూ వందలాది లైన్లు రాశా. కానీ వాటికి నేను ఎలాంటి ప్రశంసలను అందుకోలేదు. ఇలా ఎందుకో నాకు తెలియదు” అని మనోజ్ విచారం వ్యక్తం చేశారు.

‘‘తొలి రోజే పాన్‌ ఇండియా స్థాయిలో రూ.140 కోట్లు వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం రికార్డ్‌ స్థాయిలో విజయవంతంగా వెళ్తున్న సమయంలో సంభాషణలు మార్పు చేయడం అనేది బృందంకు సాహసం అనే చెప్పాలి. అయితే సినిమాకు విజయాన్ని ఇచ్చే ప్రేక్షకుల మనోభావాలను, సెంటిమెంట్స్‌, వారి సూచనలను గౌరవించడం అన్నింటి కన్నా ముఖ్యం అని భావిస్తున్నాం’’ అని చిత్ర దర్శక నిర్మాతలు చెబుతున్నారు.

ఆదిపురుష్ మూవీలో శ్రీరాముడిగా ప్రభాస్ నటించగా, సీతాదేవి పాత్రను కృతి సనన్ పోషించింది. రావణుడిగా సైఫ్ అలీఖాన్ నటించాడు. ఈ చిత్రానికి ఓం రౌత్‌ దర్శకత్వం వహించారు. టీ సిరీస్‌ భూషణ్‌కుమార్‌ నిర్మాత. కాగా, ఈ చిత్రంలో కొన్ని చోట్ల గ్రాఫిక్స్ విషయంలోనూ ట్రోల్స్ వస్తున్నాయి.