తీరం దాటిన బిపర్‌జోయ్ తుపాను.. గుజరాత్ లో అల్లకల్లోలం

తీరం దాటిన బిపర్‌జోయ్ తుపాను.. గుజరాత్ లో అల్లకల్లోలం
అరేబియా సముద్రంలో పది రోజుల క్రితం ప్రారంభమై అత్యంత తీవ్రమైన తుపానుగా మారిన బిపర్‌జోయ్ తుపాను ఉగ్ర రూపంతో గుజరాత్‌ తీర ప్రాంతంపై విరుచుకుపడింది. కచ్‌ జిల్లాలో జకావు పోర్టుకుసమీపంలో తీరాన్ని తాకిందని గురువారం సాయంత్రం భారత వాతావరణ విభాగం తెలిపింది.  తుఫాను కేంద్రం (సైక్లోన్‌ ఐ) దాదాపు 50 కి.మీ. వ్యాసంతో గంటకు 13-14 కి.మీ. వేగంతో కదలడంతో అర్ధరాత్రి తర్వాతే తీరాన్ని దాటింది.
గత అంచనాలను తల్లకిందులు చేస్తూ కేవలం 48 గంటల్లోనే ఈ బిపొర్‌జాయ్ తుఫాను తీవ్రరూపం దాల్చింది. అరేబియాలో పది రోజులకు పైగా కొనసాగిన తొలి తుఫానుగా ఇది నిలిచిపోయింది.  మూడో కేటగిరీలోని ఈ తుపానును ‘అత్యంత తీవ్రమైన తుపాను’ వర్గీకరించారు.  దీని ప్రభావంతో గుజరాత్ తీర ప్రాంతంలో భీకర గాలులు వీస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. తుఫాను తీరం దాటే సమయంలో గంటలకు 125 నుంచి 140 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీచాయి.
 
తీరం దాటి తర్వాత ఇది ఈశాన్యంగా రాజస్థాన్‌వైపు ప్రయాణిస్తుందని, ఆ రాష్ట్రానికి చేరుకునే సమయానికి బలహీనపడుతుందని ఐఎండీ అంచనా వేసింది. సౌరాష్ట్ర, కచ్‌తోపాటు, డామన్ ప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా మారింది. పలుచోట్ల విద్యుత్తు స్తంభాలు, వృక్షాలు కూలిపోయాయి. గుజరాత్ లో 940 గ్రామాలు అంధకారంలో ఉండిపోయాయి.
 
సాయంత్రంకే తీరం దాటుతుందని తొలుత అంచనా వేశారు. కానీ, దాని గమనం మందగించి మెల్లగా ప్రయాణించడంతో తీరాన్ని తాకడానికే ఆలస్యమైంది. పలుచోట్ల గంటకు 100 వేగంతో గాలులు వీచాయి. తీరం దాటే సమయానికి ఇది 120-130 కి.మీ. వరకు చేరింది. దాదాపు 20 తీరప్రాంత గ్రామాలకు చెందిన లక్షమంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
 
తుఫాను ప్రభావంతో కచ్‌, జామ్‌నగర్‌, రాజ్‌కోట్‌, పోర్‌బందర్‌, దేవ్‌భూమి ద్వారక, అమ్రేలీ సహా పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం కూడా ఇవి కొనసాగుతాయని ఐఎండీ డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ్ మహాపాత్రా పేర్కొన్నారు. తీరం దాటిన తర్వాత ఇది అత్యంత తీవ్ర తుఫాను నుంచి తీవ్ర తుఫానుగా బలహీనపడినట్టు ఆయన వివరించారు
 
తుపానుపై గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ బుధవారం గాంధీనగర్‌లోని స్టేట్ ఎమర్జెన్సీ సెంటర్‌లో అత్యవసర సమీక్ష నిర్వహించారు. కేంద్రంనుంచి 8 ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, రాష్ట్రం తరఫున 12 ఎస్‌డిఆర్‌ఎఫ్ బృందాలు, రోడ్లు, భవనాల విభాగంనుంచి 115 బృందాలు, విద్యుత్ విభాగం నుంచి 397 బృందాలను తీర వెంబడి జిల్లాల్లో మోహరించారు.
 
మరో వైపు కేంద్ర రక్షణ మంత్రిత్వ శాఖ సైతం ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది. ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్, కోస్ట్టుగార్డు బృందాలు బోట్లు, లైఫ్ జాకెట్లు, అత్యవసర ఆహార పదార్థాలు లాంటి వాటితో సిద్ధంగా ఉన్నాయి. సముద్రం అల్లకల్లోలంగా ఉన్న నేపథ్యంలో శుక్రవారం దాకా చేపల వేటను నిషేధించారు. ముందు జాగ్రత్త చర్యగా 76 రైలు సర్వీసులను రద్దు చేసినట్లు పశ్చిమ రైల్వే ప్రకటించింది.
 
తుపాను కారణంగా ప్రముఖ పుణ్యక్షేత్రాలయిన దేవ్‌భూమి ద్వారకలోని ద్వారకాధీశ్ ఆలయం, గిర్ సోమనాథ్ జిల్లాలోని సోమనాథ్ ఆలయఆలను గురువారం మూసివేశారు. జామ్‌నగర్ విమానాశ్రయంలో వాణిజ్య విమానాల రాకపోకలను శుక్రవారం దాకా నిలిపివేశారు. అయితే అత్యవసర సమయంలో ఎయిర్‌పోర్టును పని చేయించడానికి అవరమైన పెట్రోల్, డీజిల్‌ను నిల్వ చేసి ఉంచినట్లు అధికారులు తెలిపారు.