మతమార్పిడి నిషేధ చట్టాన్ని రద్దు చేసిన కర్ణాటక

కర్ణాటకలో గతంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం అమలు చేసిన మతమార్పిడుల నిషేధ చట్టాన్ని రద్దు చేస్తూ కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య నేతృత్వంలోని మంత్రివర్గ సమావేశం సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం విధానసౌదలో జరిగిన కేబినెట్‌ సమావేశంలో సీఎం సిద్దరామయ్య, ఆయన మంత్రి వర్గం పలు నిర్ణయాలు తీసుకున్నారు.
 
గత ఏడాది మేలో అప్పటి బీజేపీ ప్రభుత్వం ఆర్డినెన్స్ ద్వారా మత మార్పిడికి వ్యతిరేకంగా చట్టం చేసింది. సెప్టెంబర్ లో బిల్లును రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. మైనార్టీలను వేధించే సాధనమే మతమార్పిడి వ్యతిరేక చట్టమని కాంగ్రెస్ పార్టీ వర్గాలు వాదిస్తూ ఈ చట్టాన్ని  తీవ్రంగా వ్యతిరేకించారు. అలాగే గత ప్రభుత్వం (బీజేపీ) చేసిన పాఠశాల పాఠ్య పుస్తక సవరణను రద్దు చేసి గతంలో ఉన్న పాఠ్యాంశాలను కొనసాగించాలని మంత్రివర్గం నిర్ణయించిందని రాష్ట్ర న్యాయశాఖ మంత్రి హెచ్‌కే. పాటిల్‌  మీడియాకు చెప్పారు.
పాఠశాలలు, కళాశాలల్లో పాఠ్య పుస్తకాల్లో మార్పులు చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది.  ఈ సమావేశంలోనే పాఠ్యాంశాలను సవరించాలని, కన్నడ, సాంఘిక శాస్త్రం సబ్జెక్టుల్లో 6 నుంచి 10వ తరగతి పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని, నెహ్రూ, అంబేద్కర్‌, హెడ్గేవార్‌, సూలిబెలె తదితర పాఠ్యాంశాల్లో మార్పులు చేయాలని నిర్ణయించింది.
బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో చేసిన చట్టం స్థానంలో వ్యవసాయ మార్కెట్ల (ఏపీఎంసీ)పై కొత్త చట్టాన్ని తీసుకురావాలని కేబినెట్ నిర్ణయించింది. గతంలో బీజేపీ ప్రభుత్వం తీసుకున్న పలు నిర్ణయాలు రద్దు చెయ్యాలని, లేదా మార్పులు చెయ్యాలని సీఎం సిద్దరామయ్య ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి హెచ్ కే. పాటిల్ తెలిపారు.