అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా ప్రధాని మోదీ

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత్ లో అత్యంత ప్రజాదరణ పొందిన నాయకుడిగా నిలిచారు.  లోక్ నీతి -సెంటర్ ఫర్ ది స్టడీ ఆఫ్ డెవలపింగ్ సొసైటీస్ (సి ఎస్ డి ఎస్) భాగస్వామ్యంతో “పబ్లిక్ ఒపీనియన్”ను సర్వే నివేదిక విడుదల చేసింది.  ఈ నెలలో ప్రధాని మోదీ  అధికారంలో తొమ్మిదేళ్లు పూర్తవుతున్నందున, వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలతో సహా వరుస ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ప్రజల మూడ్‌ను అంచనా వేయాలని సర్వే చేపట్టారు. మే 10, 19 మధ్య 19 రాష్ట్రాలలో ఈ సర్వే నిర్వహించారు.

కర్ణాటకలో బీజేపీ ఓడిపోయినప్పటికీ ప్రధాని మోదీ  ప్రజాదరణ బలంగా ఉందని సర్వే పేర్కొంది. పార్టీ ఓట్ల శాతం స్థిరంగా ఉన్నట్లు వివరించింది. దాదాపు 43% మంది బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే (నేషనల్ డెమోక్రటిక్ అలయన్స్) వరుసగా మూడోసారి గెలుపొందాలని అభిప్రాయపడ్డారు, అయితే 38% మంది విభేదిస్తున్నారు. ఈరోజు ఎన్నికలు జరిగితే బీజేపీకి ఓటేస్తామని దాదాపు 40% మంది చెప్పారు. కాంగ్రెస్‌కు 29 శాతం ఓట్లు వచ్చాయి.
 
బీజేపీ ఓట్ల శాతం 2019 (37%) నుంచి 2023 (39%)కి పెరిగింది. అలాగే కాంగ్రెస్‌కు – 2019లో 19% నుంచి 2023లో 29% పెరిగింది. ఈ రోజు ఎన్నికలు జరిగితే ప్రధానమంత్రి పదవికి నరేంద్ర మోదీ సరైనవాడని 43 శాతం మంది చెప్పారు. ఆయన సమీప ప్రత్యర్థి రాహుల్ గాంధీ 27 శాతం మంది మద్దతు తెలిపారు.
 
ప్రధానమంత్రికి ప్రముఖ ఎంపిక విషయంలో మమతా బెనర్జీ, అరవింద్ కేజ్రీవాల్ 4 శాతం మంది మద్దతు తెలపగా, అఖిలేష్ యాదవ్ 3%, నితీష్ కుమార్ 1 శాతం మంది మద్దతు తెలిపారు. 2019,2023కి సంబంధించిన ప్రధానమంత్రి మోడీకి (44 నుంచి 43%) స్వల్ప తగ్గుదలని కనిపించగా, రాహుల్ గాంధీకి (24 నుంచి 27%) పెరుగుదల కనిపించింది.
2024లో ప్రధాని మోదీని ఎదుర్కొనే ప్రతిపక్ష నాయకుడు ఎవరని ప్రశ్నించగా  రాహుల్ గాంధీ పేరును 34% మంది చెప్పగా, అరవింద్ కేజ్రీవాల్ అని 11 శాతం మంది చెప్పారు. అఖిలేష్ యాదవ్ 5%, మమతా బెనర్జీ అని 4% మంది చెప్పారు. మోదీకి ఎదురు నిలిచేవారు లేరని 9 శాతం మంది చెప్పారు.
కాగా, ప్రత్యర్థులను వేటాడేందుకు ప్రభుత్వం ఏజెన్సీలను ఉపయోగించుకుంటోందని ప్రతిపక్ష ఆరోపణలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేశారు. 37% మంది ఏజెన్సీలు చట్టబద్ధమైనవని చెప్పగా, 32% మంది రాజకీయ ప్రతీకారానికి ఒక సాధనమని చెబుతున్నారు. లోక్‌నీతి-సిఎస్‌డిఎస్ 71 నియోజకవర్గాల్లో 7,202 మందిని సర్వే చేసినట్లు తెలిపింది.