గూఢచర్యం కేసులో పాత్రికేయుడు అరెస్ట్

ఫ్రీలాన్స్ జర్నలిస్ట్ వివేక్ రఘువంశీ, మాజీ నావికా దళం కమాండర్ ఆశిష్ పాఠక్‌లను కేంద్ర దర్యాప్తు సంస్థ  అరెస్ట్ చేసింది. రక్షణ రంగ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డిఆర్డిఓ) ప్రాజెక్టుల వివరాలు, రక్షణ దళాలు భవిష్యత్తులో సేకరించబోతున్న ఆయుధాల వంటివాటికి సంబంధించిన అత్యంత రహస్య సమాచారాన్ని వీరు విదేశాలకు వెల్లడించినట్లు నమోదైన కేసులో ఈ చర్యలు తీసుకుంది.
 
ఈ సమాచారాన్ని బయటపెట్టడం వల్ల కొన్ని దేశాలతో భారత దేశ సంబంధాలు ప్రభావితమవుతాయని ఆరోపించింది. జాతీయ మీడియా కథనాల ప్రకారం, రఘువంశీ, పాఠక్‌లను అధికార రహస్యాల చట్టం క్రింద అరెస్టు చేశారు. రఘువంశీని మంగళవారం సీబీఐ ప్రశ్నించింది. అనంతరం ఆయనతోపాటు పాఠక్‌ను అరెస్ట్ చేసింది.
 
వీరు నేరపూరిత కుట్రకు పాల్పడినట్లు ఆరోపించింది. దీని వెనుకగల విస్తృత స్థాయి కుట్రను వెలికి తీసేందుకు దర్యాప్తు జరుపుతున్నామని ఓ సీబీఐ అధికారి చెప్పారు. ఈ నేరంలో పాఠక్ పాత్ర ఏమిటో సీబీఐ తెలియజేయలేదు. రఘువంశీ గూఢచర్యానికి పాల్పడినట్లు సీబీఐ గత ఏడాది డిసెంబరులో కేసు నమోదు చేసింది. డీఆర్‌డీవో ప్రాజెక్టుల వివరాలు, వాటి పురోగతి, రక్షణ దళాలు భవిష్యత్తులో సేకరించబోతున్న ఆయుధాలు, వ్యూహాత్మక సంసిద్ధత, మిత్ర దేశాలతో భారత దేశ దౌత్య చర్చలు, విదేశీ నిఘా సంస్థలకు అత్యంత రహస్య సమాచారాన్ని అందజేయడం వంటి నేరాలకు రఘువంశీ పాల్పడినట్లు ఆరోపించింది.

డిఫెన్స్, స్పేస్ మాన్యుఫ్యాక్చరింగ్‌పై ప్రధాన దృష్టితో కొన్ని వ్యాసాలను అమెరికాలోని ఓ న్యూస్ పోర్టల్‌కు రాశారు. ఈ దర్యాప్తునకు అంతర్జాతీయ పర్యవసానాలు ఉంటాయని సీబీఐ అధికారి ఒకరు తెలిపారు. డిఫెన్స్ ప్రాజెక్టులకు సంబంధించిన ఏయే సమాచారాన్ని బయటివారికి అందజేశారో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.