కర్ణాటక ముఖ్యమంత్రిగా సిద్దరామయ్య

కర్ణాటక ముఖ్యమంత్రి ఎంపికపై నాలుగు రోజులుగా జరుగుతున్న సమాలోచనలు ఎట్టకేలకు కాంగ్రెస్ నాయకత్వం ముగింపు పలికింది. ముఖ్యమంత్రిగా మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యను ఖరారు చేసిన్నట్లు తెలిసింది. ఈ పదవికి పోటీపడిన డీకే శివకుమార్ ను కేపీసీసీ అధ్యక్షునిగా కొనసాగనిస్తూ ఉపముఖ్యమంత్రిగా నియమించడానికి నిర్ణయం జరిగినా, ఆయన మంత్రివర్గంలో చేరే విషయమై స్పష్టత లేదు.

సోనియా గాంధీ, రాహుల్ గాంధీ సుదీర్ఘంగా మంతనాలు జరిపి సర్ధిచెప్పడంతో సిద్దరామయ్య అభ్యర్థిత్వానికి శివకుమార్ ఆమోదం తెలిపినట్లు చెబుతున్నారు. సిద్ధరామయ్యకు ఉన్న అనుభవం, సీనియార్టీని పరిగణలోకి తీసుకుని డీకే శివకుమార్ ను బుజ్జగించినట్లు తెలుస్తుంది. శివకుమార్ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం సానుకూలంగా ఉన్నా సిద్ధరామయ్యకే మొగ్గు చూపింది.

2024 ఎన్నికల వరకు కర్ణాటక కాంగ్రెస్ పీసీసీ చీఫ్ గానే కొనసాగాలని, 2024 సార్వత్రిక ఎన్నికల తర్వాత సీఎం పదవి ఇస్తామంటూ కాంగ్రెస్ హైకమాండ్ శివకుమార్ కు స్పష్టమైన హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. ముందుగా నిర్ణయించిన ముహూర్తం ప్రకారం మే 18వ తేదీన బెంగళూరులోని కంఠీవ స్టేడియంలో సీఎంగా సిద్ధరామయ్య ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

డీకేను బుజ్జగించటంలో రాహుల్ గాంధీ కిలక పాత్ర పోషించారని తెలుస్తున్నది. ఒకటికి పది సార్లు మూడు రోజులుగా రాహుల్ గాంధీ డీకేతో స్వయంగా మాట్లాడారు. ఏదేమైనా సీఎం పదవి మినహా ఏమీ వద్దని శివకుమార్  స్పష్టం చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.  “నా అన్నగా భావిస్తున్నా.. మీకు పార్టీలో అన్యాయం జరగదు, ఎప్పటికీ గుర్తింపు ఉంటుంది. మిమ్ములను పార్టీ వదలుకోవాలని ఎప్పుడూ అనుకోలేదు. నేనే కాదు.. అమ్మ కూడా మీ విషయంలో చాలా పాజిటివ్ గా ఉంది” అంటూ రాహుల్ చెబుతూ ఉండడంతో శివకుమార్ పట్టుసడలించినట్లు చెబుతున్నారు.

“నిన్ను ఎప్పుడూ పార్టీ వ్యక్తిగా చూడలేదు. వ్యక్తిగతంగా మా కుటుంబంలో ఒకరిగా చూశాం. మీరు పార్టీని చేసిన సేవల విషయంలో ఎలాంటి లోటు లేదు. ఎంతో కష్టపడ్డారు. ఈసారికి మా మాట వినండి. మీ డిమాండ్లు అన్నీ నెరవేరుస్తాం. ఈ ఒక్కసారిగా మా వినండి. పార్టీ కోసం ఇంత చేశారు. ఈ ఒక్కసారి కొంచెం వినండి” అంటూ రాహుల్ గాంధీ వ్యక్తిగతంగా అభ్యర్థించడంతో  శివకుమార్ కు మార్గాంతరం లేకపోయిన్నట్లుంది.

అయితే, ఇంత జరిగిన తర్వాత డీకే శివకుమార్ ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు? అధిష్టానం ఇచ్చినట్లుగా , రెండు కీలకఉపముఖ్యమంత్రి పదవి శాఖలను తీసుకుని మౌనంగా  ఉండిపోతారా? అనేది తెలియాల్సి ఉంది.