
కన్నడ ప్రజల కలలను తన సొంత కలలుగా భావించి, వారి కలలను సాకారం చేస్తానని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ భరోసా ఇచ్చారు. ఈనెల 10న కర్ణాటక ఎన్నికల్లో గెలుపు కోసం హోరాహోరాగా పార్టీలు సాగించిన ప్రచారం ముగిసిన నేపథ్యంలో కన్నడ ప్రజలను ఉద్దేశించి ప్రధాని ఒక వీడియో సందేశాన్ని ఇచ్చారు.
బీజేపీ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియో పోస్టయింది. ”మీ కలలే నా కలలు. మీ తీర్మానమే నా తీర్మానం” అని మోదీ ఆ వీడియోలో స్పష్టం చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థలో కర్ణాటక పాత్రను ప్రస్తావిస్తూ భారతదేశం ప్రపంచంలో ఐదో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అని గుర్తు చేశారు. త్వరలోనే భారత్ ప్రపంచంలోని మొదటి మూడు ఆర్థిక వ్యవస్థల్లో ఒకటిగా నిలిచేలా చూడాలని, అయితే కర్ణాటక ఆర్థిక వ్యవస్థ శరవేగంగా అభివృద్ధి చెందినప్పుడే ఇది సాధ్యమవుతుందని స్పష్టం చేశారు. కర్ణాటకలో డబుల్ ఇంజిన్ ప్రభుత్వం 3.5 సంవత్సరాల పాలనను మోదీ ప్రశంసించారు.
బీజేపీ ప్రభుత్వ నిర్ణయాత్మక, కేంద్రీకృత, భవిష్యత్తు విధానం కర్ణాటక ఆర్థిక వ్యవస్థకు గణనీయంగా దోహదం చేస్తోందని చెబుతూ కరోనా సమయంలోనూ కర్ణాటక బీజేపీ నాయకత్వంలో ఏటా రూ.90 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని గుర్తు చేశారు. అయితే గత ప్రభుత్వాల హయాంలో కర్ణాటకకు ఏటా సుమారు రూ.30 వేల కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని తెలిపారు.
ఇది కర్ణాటక యువత పట్ల బీజేపీ నిబద్ధత అని ప్రధాని పేర్కొన్నారు.నగరాల్లో మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి, రవాణా వ్యవస్థను అభివృద్ధి చేయడానికి, గ్రామాలు, నగరాలలో జీవన నాణ్యతను మెరుగుపరచడానికి, మహిళలు, యువతకు కొత్త అవకాశాలను సృష్టించడానికి బీజేపీ ప్రభుత్వం అత్యంత విధేయతతో పనిచేస్తుందని ప్రధాని చెప్పారు.
పెట్టుబడులు, పరిశ్రమలు, ఆవిష్కరణల్లో కర్ణాటక నంబర్ వన్ గా నిలవాలని ఆ వీడియోలో ప్రధాని ఆకాంక్షించారు. విద్య, ఉపాధి, ఎంటర్ ప్రెన్యూర్ షిప్ లో కర్ణాటక నంబర్ వన్ గా నిలవాలని తెలిపారు. వ్యవసాయంలో కూడా కర్ణాటకను నంబర్ వన్ గా నిలిపేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ప్రధాని చెప్పారు.
కర్ణాటక వారసత్వాన్ని, సాంస్కృతిక సామర్థ్యాన్ని తాము గౌరవించామని తెలిపారు. కర్ణాటకను రాష్ట్రం నెంబర్ వన్‌గా నిలపాలంటే ఈనెల 10న జరిగే ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ బాధ్యత కలిగిన పౌరులుగా ఓటు వేయాలని మోదీ పిలుపునిచ్చారు.
More Stories
దేశభక్తి, దైవభక్తి పదాలు భిన్నమైనా వేర్వేరు కాదు
ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ వోటింగ్ తో ఆత్మరక్షణలో ప్రతిపక్షాలు
జర్మనీ వైపు చూస్తున్న భారతీయ విద్యార్థులు