కోరుట్ల ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ పేపర్కు పిండప్రదానం

ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఆరోపిస్తూ జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్​రావుపై మెట్​పల్లి మండలంలోని కొండ్రికర్ల, కోనరావుపేట గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీటీసీ ఎన్నికల టైంలో ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్​పేపర్​కు సోమవారం కొండ్రికర్ల సమీపంలోని పెద్ద వాగు వద్ద పిండ ప్రదానం చేశారు.

‘‘నా ప్రధాన అనుచరుడు మారు సాయిరెడ్డిని ఎంపీటీసీగా గెలిపియున్రీ.. కొండ్రికర్ల, కోనరావుపేట గ్రామాలను దత్తత తీసుకుంటా.. అభివృద్ధిలో మొదటి స్థానంలో ఉంచుతా.. ఏదో ఓట్ల కోసం హామీ ఇచ్చి తప్పించుకోను.. గ్రామాల సమస్యలను పరిష్కరిస్తానని ప్రమాణం చేస్తున్నా.. రెండేళ్లలో కొండ్రికర్ల పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మిస్తానని మాట ఇస్తున్నా..’’ అని స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో ఎమ్మెల్యే విద్యాసాగర్​రావు బాండ్​పేపర్ ​రాసిచ్చారు.

హామీ ఇచ్చి నాలుగేండ్లు అవుతున్నా పట్టించుకోకపోవడంతో కొండ్రికర్ల, కోనరావుపేట గ్రామస్తులు బాండ్ పేపర్ కు పిండ ప్రదానం చేసి తమ ఆగ్రహాన్ని వెళ్లగక్కారు. ఎమ్మెల్యే రాసిచ్చిన బాండ్ పేపర్​ను పెద్ద సైజులో ఫ్లెక్సీగా తయారు చేయించి సోమవారం పెద్దవాగు వద్దకు చేరుకున్నారు. ఫ్లెక్సీకి పిండ ప్రదానం చేసి తమ నిరసనను తెలియజేశారు.

అసెంబ్లీ ఎన్నికలలోపు హామీని నెరవేర్చకపోతే బాండ్​పేపర్ ను కరపత్రాలుగా తయారుచేసి నియోజకవర్గం మొత్తం పంచుతామని హెచ్చరించారు. కోనరావుపేట గ్రామాన్ని కలుపుతూ నిర్మిస్తామన్న లింక్ రోడ్లు ఏమయ్యాయని ప్రశ్నించారు. సాయిరెడ్డిని గెలిపిస్తే, ప్రతిఫలంగా రెండు గ్రామాలను దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చారని, దీంతో అంతా కలిసి సాయిరెడ్డిని గెలిపించామని గుర్తుచేశారు. భారీ వర్షాలు కురిసిన  సమయంలో పలు గ్రామాలకు రాకపోకలకు నిలిచిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఎమ్మెల్యే ఇచ్చిన హామీ ప్రకారం బ్రిడ్జి నిర్మిస్తే వేములవాడతోపాటు చుట్టుపక్కల ఊళ్లకు వెళ్లేందుకు సులభం  అవుతుందని చెప్పారు. వర్షా కాలంలో వాగులో నీటి ప్రవాహం పెరిగి రైతులు, గీత కార్మికులు తీవ్ర అవస్థలు పడుతున్నారని, వ్యవసాయ పనులకు వెళ్లేవారు 20 కి.మీ. చుట్టూ తిరిగి వెళ్లాల్సి వస్తోందని వాపోయారు.

పెద్ద వాగుపై బ్రిడ్జి నిర్మించే వరకు ఎమ్మెల్యే విద్యాసాగర్ రావును గ్రామాల్లోకి అడుగు పెట్టనియ్యమని గ్రామస్తులు హెచ్చరించారు. ఇచ్చిన మాట తప్పిన ఎమ్మెల్యే విద్యాసాగర్, తమ ఓట్లతో గెలిచిన సాయిరెడ్డి వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ ఆకుల రాజగంగు, ఉప సర్పంచ్ గంట రాజేశ్వర్, గ్రామస్తులు పలువురు మహిళలు పాల్గొన్నారు.