దంతేవాడ పేలుడుకు 2 నెలల ఈడీ బాంబు అమర్చారు

దంతేవాడ పేలుడుకు 2 నెలల ఈడీ బాంబు అమర్చారు
చత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో మావోయిస్టులు జరిపిన దారుణకాండలో డ్రైవర్​తో సహా పది మంది పోలీసులు చనిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై పోలీసులు జరుపుతున్న విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. మావోయిస్టులు పక్కా ప్లాన్​తోనే వ్యవహరించినట్లు తెలిసింది.
దాదాపు 2 నెలలు లేదా అంతకంటే ముందే ఐఈడీ బాంబును అరన్‌పుర్‌జగర్‌గుండ రోడ్డుకింద అమర్చినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందని బస్తర్ రేంజ్ పోలీసు ఐజి పి సుందర్ రాజ్ మీడియాకు వెల్లడించారు.
దీనికోసం రోడ్డు పక్క నుంచి సొరంగం తవ్వారని, దాదాపు 3 లేదా 4 అడుగుల లోతులో మందుపాతరను అమర్చారని వివరించారు. అనంతరం దాదాపు 40నుంచి 50 కిలోల బరువైన ఐఇడిలను అమర్చారు. వీటిని పేల్చడానికి అనువుగా వైరును రోడ్డు పక్కనుంచి భూమిని తవ్వి లోపల పాతి  కొన్నిమీటర్ల్ల దూరంలోని పొదలవరకు విస్తరించారు. ఇలా తవ్వి, మట్టి కప్పిన చోట గడ్డి మొలిచిందని వివరించారు.
 
బాంబును గుర్తించకపోవడానికి ఇది కూడా కారణమైందని తెలిపారు. ఆ రహదారిపై వెళ్లే వాహనాల సమాచారం పక్కాగా మావోయిస్టులకు ఎప్పటికప్పుడు చేరినట్లు భావిస్తున్నారు. కాగా, దాడికి ముందురోజు ఆ రోడ్డుపై డీ మైనింగ్​ ఎక్సెర్​సైజ్​ జరిగిందని అధికారులు తెలిపారు. అయినా బాంబును గుర్తించలేకపోయామని చెప్పారు.
 
బుధవారం ఉదయం అరన్‌పూర్‌కు కొన్ని కిలోమీటర్ల దూరంలో నక్సల్స్‌కు, భద్రతా సిబ్బందికి మధ్య కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో ఇద్దరు నక్సల్స్‌ను పట్టుకున్నారు. వారిలో ఒకరికి గాయాలయ్యాయి. దరిమిలా ఎన్‌కౌంటర్ జరిగిన ప్రదేశంలో భద్రతా సిబ్బంది గాలింపులు కొనసాగిస్తుండగా అరన్‌పూర్‌నుంచి ఎనిమిది వాహనాల్లో డిఆర్‌జి బృందం బయలుదేరిందని సుందర్ రాజ్ చెప్పారు. ‘పట్టుకున్న నక్సల్స్‌ను కాన్వాయ్‌లోని మొదటి వాహనంలో తీసుకు వస్తున్నారు. కాన్వాయ్‌లాగా కనిపించకుండా ఉండడం కోసం వాహనానికి వాహనానికి మధ్య చాలా దూరం ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నారు. అయితే నక్సల్స్ పది మంది భద్రతా జవాన్లు ఉన్న రెండో వాహనాన్ని టార్గెట్ చేశారు’ అని వివరించారు.

దీనికి తోడు మావోయిస్టులు ఈ ప్రాంతంలో కొంతకాలంగా దూకుడుగా ఉన్నట్లు భద్రతా దళాలకు ముందునుంచే సమాచారం ఉంది. ఈ నెల 18న గంగలూరుపడ్డేడ రోడ్డుపై బిజాపూర్ కాంగ్రెస్ ఎంఎల్‌ఎ విక్రమ్ ముండావి కాన్వాయ్‌పై మావోయిస్టులు కాల్పులు జరిపారు. అయితే అదృష్టవశాత్తు ఈ కాల్పుల్లో ఎవరు కూడా గాయపడలేదు.

కాగా, దంతెవాడ పేలుడు ఘటనలో చనిపోయిన పది మంది పోలీసులలో ఐదుగురు మాజీ మావోయిస్టులేనని పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. రాష్ట్రంలో మావోయిస్టుల ఏరివేత విషయంలో ప్రభుత్వం కఠినంగా వ్యవహరించడం, ప్రత్యేక బలగాలతో కూంబింగ్​ జరుపుతుండడంతో ఏటా చాలామంది మావోయిస్టులు లొంగిపోతున్నారని చెప్పారు.
 
 లొంగిపోయిన వారిలో కొంతమందిని డిస్ట్రిక్ రిజర్వ్  గార్డ్స్​ (డీఆర్జీ)లో చేర్చుకుని శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. శిక్షణ పూర్తయ్యాక వారిని మావోయిస్టుల ఏరివేత ఆపరేషన్లకు పంపిస్తున్నట్లు చెప్పారు. ఇలా పోలీసులుగా మారిన మాజీ మావోయిస్టులలో ఐదుగురు తాజా పేలుడులో ప్రాణాలు కోల్పోయారని అధికారులు వివరించారు.