
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2002 నాటి నరోదా గామ్ నరమేధం కేసులో మొత్తం 68 నిందితులు నిర్ధోషులేనని గుజరాత్ అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు తీర్పు వెలువరించింది. అహ్మదాబాద్‌లోని ప్రత్యేక కోర్టు ఈ మేరకు గురువారం తీర్పు ఇచ్చింది. బీజేపీ మాజీ మంత్రి మాయా కొద్నాని, భజరంగ్ దళ్ మాజీ నేత బాబు భజరంగి ఈ జాబితాలో ఉన్నారు.
కాగా ఈ కేసులో నిందితుల సంఖ్య మొత్తం 86 కాగా విచారణ సమయంలో 18 మంది చనిపోయారు. నిందితులపై 302 (హత్య), 307 (హత్యాయత్నం), 143 (చట్టవిరుద్ధంగా గుమిగూడడం), 147 (ఘర్షణలు), 148 (మరణాయుధాలతో అల్లర్లు), 120(B) (నేరపూరిత కుట్ర), 153 (అల్లర్లకు పురిగొల్పడం)తోపాటు ఇతర సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
గుజరాత్ రాష్ట్రం అహ్మదాబాద్ నగరంలోని నరోదా గామ్ అనేది ఒక ప్రాంతం. 2002లో గోద్రా రైలు దహనానికి నిరసనగా అన్ని ప్రాంతాల మాదిరిగా ఇక్కడ కూడా బంద్ జరిగింది. కానీ అనూహ్యంగా ఘర్షణలు చెలరేగాయి. ఈ అల్లర్లలో రెచ్చిపోయిన కొందరు పలు ఇళ్లకు నిప్పుపెట్టడంతో పాటు ముస్లిం వర్గానికి చెందిన 11 మందిని దారుణంగా హత్య చేశారు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మాయా కొద్నానీ ఆయన ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2017లో ఆమె తరుఫున డిఫెన్స్ సాక్షిగా అమిత్ షా కోర్టుకు హాజరయ్యారు. ఇరవై ఏళ్లకుపైగా కొనసాగిన కేసు విచారణ కాలంలో 18 మంది నిందితులు మరణించారు. నరోదా గామ్‌లో జరిగిన ఊచకోత 2002లో జరిగిన మతపరమైన అల్లర్లకు సంబంధించిన తొమ్మిది ప్రధాన కేసుల్లో ఒకటి. సుప్రీంకోర్టు నియమించిన ప్రత్యేక బృందం దర్యాప్తు చేసింది.
కాగా, 97 మందిని ఊచకోత కోసిన నరోడా పాటియా అల్లర్ల కేసులో గుజరాత్ మాజీ మంత్రి, బీజేపీ నేత మాయా కొడ్నానిని 2008లో నిందితురాలిగా పేర్కొంది. నరోదా పాటియా నరమేధం కేసులో పాత్రకుగానూ మాయా కొద్నానికి 28 ఏళ్ల జైలుశిక్ష విధిస్తూ ఆగస్టు 2012లో స్పెషల్ సిట్ కోర్ట్ తీర్పునిచ్చింది. అయితే ఏప్రిల్ 2018లో ట్రయల్ కోర్ట్ తీర్పును గుజరాత్ హైకోర్ట్ కొట్టివేసింది. దీంతో ఆమె నిర్ధోషిగా విడుదలయ్యారు.
More Stories
రేపు మణిపూర్‌లో ప్రధాని మోదీ పర్యటన
`ఓటు యాత్ర’ జనాన్ని ఆకట్టుకున్నా, ఓట్లు పెంచలేదు!
ఉపరాష్ట్రపతిగా సీపీ రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం