
ఉత్తరప్రదేశ్ ప్రయాగ్‌రాజ్‌లో గ్యాంగ్‌స్టర్ అతీఖ్ అహ్మద్, అతడి సోదరుడు అష్రఫ్ అహ్మద్ ను హత్య చేసిన లవ్లేశ్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యలకు తమ సంస్థతో ఎలాంటి సంబంధమూ లేదని విశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. తమకు గానీ, భజరంగ్ దళ్‌కు కానీ ఎలాంటి సంబంధమూ లేదని విశ్వహిందూ పరిషత్ అంతర్జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్ కుమార్ తెలిపారు.
దీనిపై జరుగుతున్నదంతా దుష్ప్రచారమని ఆయన కొట్టిపారేశారు. వీహెచ్‌పీ, భజరంగ్‌దళ్ భారత రాజ్యాంగం ప్రకారం నడచుకుంటాయని, చట్టాన్ని ఎప్పుడూ తమ చేతుల్లోకి తీసుకోలేదని చెప్పారు. విచారణలో సత్యాలు బయటపడతాయని అలోక్ కుమార్ విశ్వాసం వ్యక్తం చేశారు. మరోవైపు లవ్లేశ్ తివారీ, సన్నీ సింగ్, అరుణ్ మౌర్యలను భద్రతా కారణాల దృష్ట్యా ప్రయాగ్ రాజ్ జైలు నుంచి ప్రతాప్‌గఢ్ జిల్లా జైలుకు తరలించారు.
కాగా, ఈ కేసులో నిందితులను అదుపులోకి తీసుకొని పోలీసులు విచారించగా సంచలన విషయాలు వెలువడ్డాయి. అతీక్ అహ్మద్ శరీరంలో 9 బుల్లెట్లు ఉన్నట్లు పోస్టుమార్టం రిపోర్టులో వెల్లడైంది. అతడి సోదరుడు ఆష్రఫ్ శరీరంలో 5 బుల్లెట్లను గుర్తించారని సమాచారం అందుతోంది. ఐదుగురు డాక్టర్ల బృందం పోస్టుమార్టం చేశారు. హై ప్రొఫైల్ కేసు కావడంతో పోస్టుమార్టమ్ ను వీడియో తీశారు.
టర్కీ దేశంలోని టిపాస్ కంపెనీకి చెందిన జిగాన తుపాకులు నిందితులు ఉపయోగించినట్లు సమాచారం. ఇవి ఒక్కో దాని ఖరీదు రూ. 6 లక్షలకు పైనే ఉంటుంది. టర్కీ సైనికులు ఉపయోగించే తుపాకులు ఉపయోగించారు. ముగ్గురు హంతకులు కూడా పేద కుటుంబాల వారేనని, వారికి ఆ ఆయుధాలను కొనే ఆర్ధిక స్థితి లేదని పోలీసులు చెబుతున్నారు.
ప్రస్తుతం ఈ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. అసలు విషయాలు బయటకు రానున్నాయి. అయితే ఈ తుపాకులపై మన దేశంలో నిషేధం ఉంది. పాకిస్థాన్ నుంచి అక్రమంగా మన దేశంలోకి రవాణా చేస్తున్నారని నిఘా సంస్థలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.
ఇలా ఉండగా, పోలీసుల దృష్టి అతీఖ్ అహ్మద్ భార్య షైస్తా పర్వీన్ పై పడింది. అతీఖ్, అష్రఫ్‌ల అంత్యక్రియలకు కూడా ఆమె హాజరుకాకపోవడంతో ఆమె ఆచూకీ తెలుసుకునేందుకు జల్లెడ పడుతున్నారు. అతీఖ్ అహ్మద్ నేరసామ్రాజ్యాన్ని నడపడంలో షైస్తా పర్వీన్ కీలకంగా ఉన్నారని పోలీసులు అనుమానిస్తున్నారు. అతీఖ్ అహ్మద్ జైలులో ఉండగా మాఫియా సభ్యులతో అక్రమ వ్యవహారాలన్నీ ఆమెనే చక్కబెట్టారని పోలీసులు చెబుతున్నారు.
More Stories
గృహ నిర్మాణం ప్రాథమిక హక్కు
ఢిల్లీలో మాత్రమే బాణాసంచాపై నిషేధం విధించాలా?
ఢిల్లీ, ముంబై హైకోర్టులకు బాంబు బెదిరింపులు