సనాతన హిందూ ధర్మాన్ని ఆచరించేవారు అమర్‌నాథ్ యాత్రను ఎంతో పవిత్రంగా భావిస్తారు. దక్షిణ కశ్మీర్‌లోని హిమాలయాల్లో మంచు రూపంలో కనిపించే అమర్‌నాథ్ శివలింగాన్ని దర్శించుకోవడానికి ఏటా భారీగా భక్తులు వస్తుంటారు. కాగా, ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రకు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ రిజిస్ట్రేషన్ సోమవారం ప్రారంభమైంది. 62 రోజుల అమర్‌నాథ్ యాత్రకు రిజిస్ట్రేషన్ ప్రారంభం కాగా ఈ ఏడాది జూలై 1 నుంచి ఆగస్టు 31 వరకు యాత్ర జరగనుంది. యాత్ర వివరాలను జమ్మూ కశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా వెల్లడించారు.
ఈ యాత్ర సాధారణంగా రెండు మార్గాల ద్వారా అనుమతిస్తారు. అనంతనాగ్ జిల్లా పహల్గామ్ 48 కిమీ మార్గంలో, గండేర్‌బల్ జిల్లా లోని బల్తాల్ ట్రాక్ 14 కిమీ మార్గంలో యాత్రికులను పంపిస్తారు. ఈ మార్గాల్లో యాత్రకు వెళ్లేవారు తమ పేర్లను నమోదు చేసుకోవాలని అధికారులు సూచించారు. యాత్రికులు తమ ఆధార్ కార్డ్‌ను తప్పనిసరిగా తీసుకెళ్లాలి.
ఎలాంటి ఆటంకాలు లేకుండా యాత్ర కొనసాగటానికి కేంద్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లను చేస్తుందని ఎల్‌జీ తెలిపారు. ‘తీర్థయాత్ర ప్రారంభానికి ముందే టెలికాం సేవలు అందుబాటులోకి వస్తాయి. యాత్ర సజావుగా సాగేందుకు భక్తుల కోసం బస, విద్యుత్, నీరు, భద్రత వంటి సౌకర్యాలను ఏర్పాటు చేయనున్నాం.’ అని మనోజ్ సిన్హా తెలిపారు.
అయితే అమర్‌నాథ్ యాత్ర కోసం రిజిస్టర్ చేసుకునే వ్యక్తుల వయసు 13-70 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హులైన అభ్యర్థులు https://jksasb.nic.in వెబ్‌సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఈ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ లింక్ గూగుల్ ప్లే స్టోర్‌లోని ‘‘శ్రీ అమర్‌నాథ్ జీ యాత్ర’’ అనే మొబైల్ యాప్‌లో కూడా అందుబాటులో ఉటుంది. ఆరు వారాలు లేదా అంతకంటే ఎక్కువ రోజుల గర్భవతులను అమర్‌నాథ్ యాత్రకు అనుమతించరు.
దేశం మొత్తం మీద పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచిల్లో సోమవారం యాత్ర కోసం రిజిస్ట్రేషన్లు ప్రారంభమయ్యాయని బ్యాంకు చీఫ్ మేనేజర్ రోహిత్ రైనా వెల్లడించారు. మొత్తం 542 బ్యాంకు బ్రాంచిల ద్వారా రిజిస్ట్రేషన్ జరుగుతుందన్నారు. ఇందులో పంజాబ్ నేషనల్ బ్యాంకు బ్రాంచిలు 316 వరకు ఉన్నాయి. జమ్మూ కాశ్మీర్‌లోని 90 శాఖలు, యెస్ బ్యాంక్‌కు చెందిన 37 శాఖలు, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు చెందిన 99 శాఖలు ఉన్నాయని అధికారులు వెల్లడించారు.
అయితే ఈసారి రిజిస్ట్రేషన్‌లో ఆధార్ ద్వారా నమోదు ప్రక్రియ ప్రవేశ పెట్టారు. గత ఏడాది వరకు ఫారాలు నేరుగా ఇచ్చేవారు. కానీ ఈసారి ఆధార్ నమోదుతో ఫారాలు ఇస్తారు. అలాగే యాత్రికులు తమ ఆరోగ్యాన్ని ధ్రువీకరించే డాక్టర్ సర్టిఫికెట్లు కూడా చూపించవలసి వస్తుందని రైనా వివరించారు. ముందుగా నిర్ణయించిన వివిధ బ్యాంక్ బ్రాంచ్‌ల ద్వారా ముందస్తు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఓ వ్యక్తి నుంచి రూ.120 సర్వీస్ ఛార్జ్ వసూలు చేయనున్నారు.
ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు ఒక వ్యక్తి రూ.220 చెల్లించాలి. 50 కంటే తక్కువ మంది కలిసి ఒక గ్రూప్‌గా రిజిస్టర్ కావచ్చు. గ్రూప్ రిజిస్ట్రేషన్‌కు ఒక వ్యక్తి రూ.220 చెల్లించాలి. ఎన్ ఆర్‌ఐ యాత్రికులు పీఎన్‌బీ బ్యాంక్ ద్వారా రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇందుకోసం ఎన్‌ఆర్‌ఐలు రూ.1520 రిజిస్ట్రేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. మరిన్ని వివరాల కోసం యాత్రికులు టోల్ ఫ్రీ నెం- 18001807198 లేదా 18001807199లను సంప్రదించవచ్చు.
అమర్‌నాథ్ పరిసరాలు అన్నీ పరిశుభ్రంగా ఉండేలా చూడాలని, వ్యర్థాల నిర్వహణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని లెఫ్టినెంట్ గవర్నర్ సిన్హా అధికారులను ఆదేశించారు. శ్రీ అమర్‌నాథ్‌జీ పుణ్యక్షేత్రం బోర్డు (ఎస్ ఎ ఎస్ బి) యాప్ ద్వారా భక్తులు అమర్‌నాథ్ పుణ్యక్షేత్ర పూజ కార్యకలాపాలను మొబైల్‌లోనే చూడవచ్చు. ఈ యాప్ ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు ఉదయం, సాయంత్రం హారతిని ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తుంది.
More Stories
ప్రొటోకాల్ ఉల్లంఘనలపై బీజేపీ ఎమ్మెల్యేల నిరసన
చెన్నమనేని జర్మనీ పౌరుడే…తేల్చిచెప్పిన హైకోర్టు
చైనా జలవిద్యుత్ డ్యామ్ లతో 12 లక్షల మంది టిబెటన్ల నిరాశ్రయం