
ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తరపు న్యాయవాది సోమా భరత్ నేడు మరోసారి ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఈ కేసులో ఆమె ఫోన్లను అధికారులు స్వాధీనం చేసుకోగా అందులోని సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరిస్తున్నారు.
ఈ ఫోన్లనే అస్త్రాలుగా ఉపయోగిస్తూ ఆమెపై ఆరోపణలను నిరూపించేందుకు ఈడీ ప్రయత్నిస్తున్నట్లు స్పష్టం అవుతుంది.
పైగా, ఫోన్లను ఈడీకి అందిస్తూ మహిళా గోప్యత అంశాన్ని ఆమె ప్రస్తావించడంతో ఆ ఫోన్లను ఆమె లేదా ఆమె ప్రతినిధి సమక్షంలోనే తెరుస్తూ, కేవలం కేసుకు సంబంధించిన అంశాలను మాత్రమే నమోదు చేస్తూ – ఆమె వ్యక్తిగత అంశాలను పట్టించుకోకుండా ఈడీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తున్నది.
ఈ విషయమై ఎమ్మెల్సీ కవితకు ఈడీ అధికారులు మంగళవారం రాసిన లేఖలో ఫోన్లు తెరిచేందుకు గాను స్వయంగా హాజరు కావటం లేదా ప్రతినిధిని పంపాల్సిందిగా ఆమెను కోరారు. దీంతో కవిత తన తరఫున న్యాయవాది సోమా భరత్‌ను మంగళవారం ఈడీ కార్యాలయానికి పంపింది. మంగళవారం ఉదయం 11.30కు ఈడీ కార్యాలయంలోకి వెళ్లిన భరత్ సాయంత్రం 5 గంటలకు బయటకు వచ్చారు.
సెల్ఫోన్లలో డేటాతో పాటు మరికొంత సమాచారాన్ని ఈడీ అధికారులు సేకరించారు. బుధవారం కూడా రావాలని ఈడీ అధికారులు కోరటంతో భరత్ ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. భరత్‌తో పాటు కవిత మాజీ అడిటర్ బుచ్చిబాబు కూడా ఈడీ కార్యాలయానికి వెళ్లారు. ఇక ఈ కేసులో కవితను ఈడీ అధికారులు ఇప్పటికే విచారించారు. ఈ నెల 11, 20, 21 తేదీల్లో ఆమె ఈడీ విచారణకు హాజరయ్యారు.
మొదటిసారి విచారణకు వెళ్లినప్పుడే ఈడీ అధికారులు ఆమె ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. ఈనెల 20న రెండోసారి హాజరైనపుడు కవిత బ్యాంక్ స్టేట్మెంట్లు, బిజినెస్‌కు సంబంధించిన కీలక పత్రాలను ఈడీ స్వాధీనం చేసుకుంది. ఈ కేసులో ఆధారులు ధ్వసం చేశారని ఈడీ కవితపై అభియోగాలు మోపారు. ఈ నేపథ్యంలో ఈనెల 21న విచారణకు హాజరైన సమయంలో కవిత కొన్ని మొబైల్ ఫోన్లను ఈడీ కార్యాలయానికి తీసుకెళ్లారు.
ఈడీ ఎదుట హాజరయ్యే ముందు ఈడీ తనను ఉద్దేశపూర్వకంగానే వేధిస్తుందని చెప్పేందుకు వాటిని మీడియాకు చూపించారు. అనంతరం వాటిని ఈడీ అధికారులకు అప్పగించారు. అయితే ఇప్పుడు మొబైల్ ఫోన్లలో సమాచారాన్ని ఈడీ సేకరిస్తుంది. డేటా సేకరణ అనంతరం ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది ఆసక్తికరంగా మారింది.
More Stories
గవర్నర్ ఆమోదం పొందని రిజర్వేషన్ల బిల్లులు
ఓ ఉగ్రవాది అరెస్టుతో ఉలిక్కిపడ్డ బోధన్
జూబ్లీ హిల్స్ లో బిఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత